అనకాపల్లి వదిలేస్తున్న గుడివాడ.. ఆయన గురి ఎక్కడంటే..?
posted on Aug 3, 2022 @ 10:11PM
మంత్రి గుడివాడ అమర్నాథరెడ్డి నియోజకవర్గం మార్పుపై తీవ్రంగా దృష్టి పెట్టారా? అనకాపల్లి నుంచి మళ్లీ పోటీకి దిగితే విజయం సులువు కాదని భావిస్తున్నారా? గత ఎన్నికలలో తనకు అనుకూలించిన అంశాలేవీ ఇప్పుడు తనకు అనుకూలంగా లేవని భావిస్తున్నారా?
మరో వైపు గత ఎన్నికల సమయంలో ఉన్న జగన్ గాలి ఈ సారి ఇసుమంతైనా లేకపోవడం వల్ల అనకాపల్లి నుంచే మళ్లీ పోటీకి దిగితే విజయం దక్కదని భావిస్తున్నారా? పైగా గతంలో తనకు గట్టి మద్దతుగా నిలిచిన దాడి వంటి పలుకు బడి కలిగిన నేతలు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారుతుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు.
పైగా అధినేత జనంలో ఉన్నవారికే టికెట్లని ఖరాకండీగా చెప్పేసిన తరువాత అనకాపల్లినే పట్టుకు వెళాడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన గుడివాడ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరనీ, తనకు పెందుర్తి నియోజకవర్గమైతే సేఫ్ అని భావిస్తున్నారనీ వైసీపీ శ్రేణుల్లోనే ఒక చర్చ జరుగుతోంది. అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గం గుడివాడ అమర్నాథ్ రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. దీనికి తోడు గుడివాడకు అనకాపల్లి నాన్ లోకల్ అన్న ముద్ర ఒకటి ఉంది.
దానిని బేస్ చేసుకునే సొంత పార్టీలోనే గుడివాడకు సెగ పెడుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెందుర్తి నియోజకవర్గం పై దృష్టి పెట్టారని అంటున్నారు. అక్కడ పోటీ చేస్తే తనకు లోకల్ కార్డ్ కలిసొస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఉన్నారు. ఇంత వరకూ గుడివాడకు బలమైన మద్దతు దారుగా ఉన్న అదీప్ రాజు.. ఇప్పుడు మంత్రిపై గుర్రుగా ఉన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.