ఏపీ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపే.. రఘురామ

ఆంధ్రప్రదేశ్ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపేనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మొగ్గు ఎటువైపు అన్న విషయంపై తాను సొంతంగా సర్వే చేయించినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆ సర్వేలో జనం మొగ్గు తెలుగుదేశం వైపే ఉందని స్పష్టమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 90 పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చిందన్నారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు చూసి అంతా మాకే అనుకూలంగా ఉందని వైసీపీ భావిస్తే గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తాను ఓ యాప్ ద్వారా సర్వే చేయించాననీ, ఆ సర్వేలో ఏపీ ప్రజలు తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉన్నారని తేలిందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. అలాగే ఇటీవలి కాలంలో జనసేనకు కూడా ఆదరణ బాగా పెరిగిందన్నారు. ఎటొచ్చీ వైసీపీ పరిస్థితే నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారైందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గమూ కూడా వైసీపీ పట్ల సానుకూలంగదా లేదని ఆయన పేర్కొన్నారు.  

జనగామలో బండి సంజయ్ అరెస్టు

ఢిల్లీ మద్యం స్కామ్ లో తెలంగాణ ప్రమేయం గురించిన వార్తలు వచ్చినప్పటి నుంచీ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఢిల్లీ మద్యం స్కాంలో టీఆర్ఎస్ అధినేత తనయ కవిత ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.   ఈ నేపథ్యంలోనే సోమవారం బీజేపీ కార్యకర్తలు కవిత నివాసం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. కాగా బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా బండి సంజయ్ మంగళవారం ( ఆగస్టు 23)న జనగామలో దీక్ష చేయాలని బండి నిర్ణయించారు. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్రలో ఉన్న సంగతి విదితమే. ఆ యాత్రలో భాగంగా జనగామలో దీక్ష కు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

నివేదిక‌ల తేదీల్లో తేడా తప్ప మ‌రేమీ లేదు.. ప‌ట్టాభి

అమెరికా చెబితేగాని మ‌న‌వాళ్లు దేన్ని న‌మ్మేట్టు లేరు. గోరంట్ల మాధ‌వ్ వీడియోకి సంబంధించి అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నివేదిక‌కు, అంత‌కుముందు తాము విడుద‌ల చేసిన నివేదిక‌కు తేదీ త‌ప్ప మ‌రే తేడా లేద‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి అన్నారు. ఆయ‌న ఈ చిన్న విష‌యానికి సీఐడీ అధికారి సునీల్ కుమార్ తాము అమెరికా ల్యాబ్ నివేదిక‌లు మార్చేశామ‌ని, కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌ రించ‌డం అర్ధ‌ర‌హిత‌మ‌ని ప‌ట్టాభి అన్నారు. ఇదంతా గోరంట్ల‌ను కాపాడుకోవడానికి చేస్తున్న కుట్ర‌ల‌ని ప‌ట్టాభిరామం మీడియాతో అన్నారు.  అమెరికా ల్యాబ్ నివేదిక‌లో నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అంటున్న‌వారు మ‌రి ఇపుడు ఆ నివేదిక‌ను బ‌హి ర్గ‌తం చేయాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. వాస్త‌వానికి తాము  వీడిమో పంపిన తేదీని అందులో పేర్కొన లేద‌ని, దీన్ని ఐ ఫోన్‌కి చెందిన ఫేస్ టైమ్ వీడియో కాల్ అని నివేదిక‌లో ప్ర‌త్యేకంగా పేర్కొన్నార‌ని అన్నారు. చిత్ర‌మేమంటే తాము వీడియోను పంపిన తేదీని నివేదిక‌లో పేర్కొన‌లేద‌ని ప‌ట్టాభి ఆరో పించారు. అయితే అదేమంత పెద్ద ప‌ని కాదుగ‌నుక జిమ్ స్టాఫోర్డ్ సిబ్బంది ఆ మార్పులు చేసి పంపార‌న్నారు. అయి తే త‌న సిబ్బంది చేసినది తెలియ‌క స్టాఫోర్డ్ అస‌లా మార్పులు తాము చేయ‌లేద‌ని సీఐడీకి తెలియ‌జేశారు.  ఇక్క‌డ చిత్ర‌మేమంటే ఫేస్ టైం వీడియో కాల్ అన‌కుండా  వీడియో కాల్ అని ఉంటే నివేదిక సారాంశం మారిపోతుందా?  కానీ స్టాఫోర్డ్ మాత్రం తాను ఇచ్చిన నివేదిక‌లో ఎలాంటి మార్పుచేర్పులు లేవ‌నే అంటు న్నారు.  సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్‌కు అన్ని విష‌యాలు స్ప‌ష్టంగా తెలుసున‌ని, ఆయ‌న నిజా యితీగా ఉంటే తాము విడుద‌ల చేసిన కాపీని, త‌నకు అంది నివేదిక కాపీని విడుద‌ల చేసి తేడాని ఆయ‌నే వివ‌రిం చాల‌ని ప‌ట్టాభి కోరారు. కానీ అధికారి ఎందుకు వెన‌క‌డుతువేస్తున్నారో తెలియ‌ద‌ని విమ‌ర్శించారు.  బాధ్యత గల ఎంపీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే నిజానిజాలు తేల్చడానికి ప్రభు త్వం ముందుకు రానప్పుడు,  ప్రధాన ప్రతిపక్షంగా తమ విధిని నిర్వర్తించామన్నారు. ఎంపీని కాపాడటానికి వైసీపీ దిగజారి ప్రవర్తించిందని విమర్శించారు. 

ఉండవల్లి శ్రీదేవి పోలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాపేనా?!

నిత్యం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నామ జపం చేసు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనా? అంటే వైసీపీ శ్రేణులు, పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు. జగన్ ఏం మాట్లాడమంటే అదే మాట్లాడి, ఏం చేయమంటే అదే చేసిన ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో ఒక్కసారిగా ఆదరణ లేకుండా పోవడం ఒకింత ఆశ్చర్యమే. ఎందుకంటే అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా.. సందర్బం ఉన్నా, లేకపోయినా ఉండవల్లి శ్రీదేవిది ఒకటే మాట.. ఒకటే నామస్మరణ.. జగన్.. జగన్.. జగన్. ఆపరేషన్ అయిన గుండె సైతం జగన్.. జగన్ .. జగన్ అని కొట్టుకొంటోందంటూ.. అంత జగన్ నామస్మరణ చేసిన శ్రీదేవికి తాను మాత్రం జ  జగన్నాటకంలో చిన్న పాత్ర మాత్రమేనని ఆలస్యంగా తెలుసుకున్నారు. అప్పటికే తాడికొండ నియోజకవర్గం పార్టీ అదనపు సమన్వయకర్తగా డొక్క మాణిక్య వర ప్రసాద్‌ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసేసింది. దీంతో ఆ విషయం తెలుసుకొని.. తత్వం బోధపడి.. అంతా తెలుసుకునే సరికే జరగాల్సిన పని జరిగిపోయింది. నియోజవర్గంలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని వెంట పెట్టుకొని.. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగి నినాదాలతో కొద్ది సేపు హడావుడి చేసిన శ్రీదేవి ఆ తరువాత ఓ అల్టిమేటం జారీ చేసి ఆందోళన విరమించారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు అర్ధరాత్రి ఉండవల్లి శ్రీదేవి ఆందోళన ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో సుచరిత ఇంటి నుంచి బయటకు వచ్చి.. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని.. అధిష్టానం ఎలా ఆదేశిస్తే.. అలా నడుచుకుందామంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని.. సముదాయించారు, దీంతో ఉండవల్లి ఆందోళన విరమించారు. అయితే 10 గంటల్లో పార్టీ నిర్ణయం మార్చుకోవాలని నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా నియామకాన్ని వెనక్కు తీసుకోవాలనీ లేకుంటే నాలుగు మండలాల్లోని నాయకులంతా ముకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి శ్రీదేవి వర్గంగా చెప్పుకుంటున్న ఆ నాలుగు మండలాల నాయకులు అల్టిమేటం ఇచ్చారు.  అయితే ఇంతలా జగన్ నామస్మరణలో మునిగిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల సీఎం జగన్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారన్న ఓ సందేహం ఆమె వర్గాన్ని పట్టి పీడిస్తోంది.   శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆరోపణలు, విమర్శలు గట్టిగానే ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని.. ముందుగానే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సీఎం జగన్ చెక్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆమెను సీఎం జగన్ దూరం పెడుతూ వచ్చారనీ, అందుకే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను సీఎం జగన్ ఏరి కొరి మరీ నియమించారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మూమూలుగా ఎమ్మెల్యేలే వారి వారి నియోజకవర్గాల సమన్వయకర్తలుగా  వైసీపీలో వ్యవహరిస్తుంటారు. దీంతో ఇతరులను నియమించే అవకాశం ఉండదు... ఉండబోదు. కానీ తాడికొండలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే.. అదనపు సమన్వయకర్తగా జగన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు.   అయితే పార్టీ ఏం చెబితే అదే ఆమె చేశారని శ్రీదేవి అనుచరులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఆమె అమరాతి రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తారని... తమకు రాజధాని అవసరం లేదని స్పష్టం చేశారట. అలాగే  సొంత నియోజకవర్గంలోని రైతుల్ని సైతం పెయిడ్ ఆర్టిస్టులు అని అభివర్ణించారు. రాజధాని భూములన్నీ ఓ సామాజికవర్గానివే అని విమర్శలు సైతం గుప్పించారు. చివరికి ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరాటాల్ని సైతం టీడీపీకి అంటగట్టి కుల ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారారు.   అయితే ఎన్ని చేసినా జగన్ పార్టీలో శ్రీదేవికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తరచు ఆమెపై వివాదాలు ముసురుతూ వచ్చాయని... డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని పలువురు సొంత పార్టీ నేతలు సైతం ఆరోపణలు ఆమెపై గుప్పించారు. ఇలా ఒకటా రెండో.. శ్రీదేవి చేసిన ఘన కార్యాలు గురించి చెప్పుకుంటే పొతే.. కొండవీటి చాంతాడంత ఉంటుందనే ఓ చర్చ  తాడికొండలో ఓ రేంజ్ లో సాగుతోంది. అదీకాక.. తాడికొండ నియోజకవర్గం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది. జగన్ అధికారంలోకి రావడంతో.. అమరావతి ఎగిరిపోయింది. దీంతో ఆమెకు ఇదే పెద్ద మైనస్ అయిందట. అలాగే నియోజకవర్గంలో ఆమె అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కాగడా పట్టి వేదికనా కనిపించవని.. ఆ పార్టీ వారే పేర్కొంటునారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అయినా.. నియోజకవర్గ ప్రజలకు అరకొరగానే అందుతున్నాయని తెలుస్తోంది. అసైన్డ్ రైతులకు కౌలు, పెన్షన్ 5 వేలు, టిడ్కో గృహాలు కేటాయింపుల్లో శ్రీదేవి చేసిందేమీ లేదనే ఓ చర్చ సైతం నేటికి ఉందట.    ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే.. పట్టిసీమ ప్రయాణంలో.. పడవ బోల్తా పడినట్లు తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ సీటు చేయి జారీ గల్లంతయ్యే అవకాశం ఉందని.. భావించిన సీఎం జగన్ ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అదీకాక.. తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా తాజాగా నియమితులైన డొక్కా మాణిక్య వర ప్రసాద్.. గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రెండు సార్లు గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరదామనుకుని.. చివరి నిమిషంలో మనస్సు మార్చుకొని.. సైకిల్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరితపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో... మూడు రాజధానులు తెరపైకి రావడం.. దానికి వ్యతిరేకంగా టీడీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి సైతం డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ఆయన మళ్లీ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన చేరారు. అంతేకాదు.. ఇదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టారు. తాజాగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా నియమితులు కావడంతో.. తాడికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డొక్క అని ఇప్పటికే శ్రీదేవి అనుచర వర్గం   పక్కాగా ఫిక్స్ అయిపోయిందట. ఎంతైనా డొక్క.. వారు అనుకున్నారంటే.. అది సాధించే క్రమంలో విపక్షంలో అయినా.. స్వపక్షంలో అయిన..  ప్రత్యర్థి డొక్క చించి డొలు కడతాడనే ఓ టాక్ అయితే ఆయన అనుచరుల్లో నాటికే కాదు నేటికి అదే బలంతో బలంగా నడుస్తోంది.

సానియా చేతికి గాయం.. యూఎస్ ఓపెన్ కు దూరం

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది. దీంతో ఆమె యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి దూరమైంది. తన మోచేతికి గాయమైందని సానియా మీర్జా  స్వయంగా వెల్లడించింది. గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. రెండు వారాల కిందట కెనడాలో టెన్నిస్ ఆడుతుండగా ఆమె మోచేతికి గాయమైంది. అప్పుడు పెద్ద గాయం కాదని భావించినా నొప్పి తగ్గకపోవడంతో స్కాన్ చేయించుకుంది. స్కానింగ్ లో గాయం తీవ్రత తెలియడంతో కొన్ని వారాల పాటు ఆటకు దూరం అవ్వాలన్న వైద్యుల సూచన మేరకు తాను యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. గాయం కారణంగా తాను ఆట నుంచి రిటైర్ అయ్యే ప్రణాళికలో కొన్ని మార్పులు అనివార్యమౌతాయని భావిస్తున్నట్లు తెలిపిన సానియా మీర్జా ఇప్పటి వరకూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ, త్వరలోనే అప్ డేట్ చేస్తాననీ  పేర్కొంది. కాగా సానియామీర్జా గాయం వార్త వినగానే ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మనుగోడులో విజయమే లక్ష్యం.. కీలక వేళ కలహాలా.. టీకాంగ్రెస్ నేతలకు ప్రియాంక దిశా నిర్దేశం

మునుగోడు ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని ప్రియాంక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.  సోమవారం(ఆగస్టు 22) సాయంత్రం   10 జన్‌పథ్‌లో ప్రియాంక గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మాణిక్యం ఠాగూర్‌తో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, మునుగోడు ఎన్నికలపై చర్చించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విషయాల మీదా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మునుగోడులో విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని ప్రియాంక దిశా నిర్దేశం చేశారు. కీలక సమయంలో కలహాలేమిటని మందలించారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా సీనియర్ నేతలకు మీడియాతో మాట్లాడారు.ప్రియాంక గాంధీతో సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందన్నారు. త్వరలో అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు.  సమష్టిగా కృషి చేసి మునుగోడులో కాంగ్రెస్ అబ్యర్థిని గెలిపించాలని, క్రమశిక్షణతో  మెలగాలనీ ప్రియాంక సూచించారని చెప్పారు.   వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత, తమ పార్టీ కార్యకర్త అన్న రేవంత్, సమయాభావం వల్ల ఆయన ఈ సమావేశానికి రాలేదని సమర్ధించుకున్నారు.  వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఆయనను కూడా సంప్రదిస్తామని చెప్పారు.  ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి  పర్యవేక్షిస్తారని మధుయాష్కిగౌడ్ తెలిపారు.  మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ప్రియాంక పాల్గొంటారని, తేదీలు ఇంకా ఖరారు కాలేదని   చెప్పారు. ముందుగా అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం దృష్టి పెట్టిందని వివరించారు. నేతల మధ్య చిన్నచిన్న స్పర్ధలు మినహా విభేదాల్లేవు ఆయన చెప్పుకొచ్చారు. సమావేశంలో ప్రియాంక గాంధీ నేతలతో విడివిడిగా మాట్లాడారని వెల్లడించారు. భేటీకి హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తాను, దామోదర రాజనర్సింహ వెళ్లి మాట్లాడతామని మధుయాష్కీ అన్నారు. 

రేవంత్ విషయంలో తగ్గేదే లే.. వెంకటరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. ఆయన పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లాంటి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి విజయం అత్యంత అవసరం. ఇక్కడ విజయం సాధిస్తేనే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. పైగా సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో పార్టీలో అందరూ సమష్టిగా పని చేసి పార్టీకి విజయాన్ని చేకూర్చాల్సివన పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనెవరి మాటా విన అంటూ భీష్మించుకు కూర్చున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తమను కాదని.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ ను వీడేదే లే అంటున్న కోమటిరెడ్డి.. రేవంత్ లో సఖ్యతగా పని చేయడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని ఇప్పటికే ప్రకటించిన వెంకటరెడ్డి.. ఆ మాటకు కట్టుబడే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికపై కీలక భేటీకి డుమ్మా కొట్టార. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో హస్తినలో మునుగోడుపై కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన వెంకటరెడ్డి ఈ భేటీకి రేవంత్ కూడా వస్తున్నారంటూ భేటీలో పాల్గొనకుండానే వెనుదిరిగి వచ్చేశారు. అక్కడితో ఆగకుండా రేవంత్ మాణిక్కం ఠాగూర్ లపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు ప్రియాంక అధ్యక్షతన మునుగోడు ఉప ఎన్నికపై కీలక సమావేశానికి కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూరు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. తన సోదరుడి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక సందడి ఆరంభమైన తరువాత వెంకటరెడ్డి ఇంత వరకూ మునుగోడు వైపు వెళ్లలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖలో రేవంత్ తో వేదిక పంచుకోలేననీ, మునుగోడులో ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాకూర్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయనను తెలంగాణ నుంచి పంపించేయాలనీ కమల్ నాథ్ వంటి వారు ఆ స్థానంలో ఉంటే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని అన్నారు. ఇక రేవంత్ వల్ల పార్టీ భ్రష్టుపడుతోందని ఆరోపించారు. తమ కుటుంబంపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అందుకే ఆయనతో కలిసి పని చేయలేననీ స్పష్టం చేశారు. అయితే వెంకటరెడ్డి ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటోంది. వెంకటరెడ్డిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరికీ పట్టని అమిత్ షా మునుగోడు సభ

మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు. ఈ సభకు ముందు బీజేపీ భారీ ఎత్తున ఆర్బాటం చేసింది. అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ప్రచారం చేసింది. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి మాత్రమే కాక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కమల దళంలోని వలసలు ఉంటాయని పేర్కొంది. భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. దీనికి తోడు మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరిగిన తరువాత బీజేపీ సభ ఉండటంతో సర్వత్రా ఈ రెండు సభలపైనా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉందనీ, మునుగోడులో అమిత్ షా సభ కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుందని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా సభ అయిపోయిన తరువాత.. బీజేపీ తీరు ఆ సభ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా మునుగోడు లో చేసిన ప్రసంగం ఏం ప్రకంపనలు సృష్టించలేదు. ఎప్పుడూ చేసేలాగే కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ పాలన, అవినీతిపైనా ఊకదంపుడు విమర్శలతో సరిపెట్టారు. అందుకే సభ తరువాత ఎవరూ అమిత్ షా ప్రసంగం గురించి కానీ, మునుగోడులో బీజేపీ సభ గురించి కానీ మాట్లాడటం లేదు. ఇక చేరికల విషయంలో బీజేపీ చేసిన ఆర్భాటమంతా తుస్సు మంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మినహాయిస్తే.. ఆ సభా వేదికపై కమలం కండువా కప్పుకున్న వారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అధికారికంగా సభా వేదికపై కమలం తీర్ధం పుచ్చుకున్నారు కానీ ఆయన మునుగోడు శాసనసభా సభ్యత్వానికీ, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడానికి చాలా ముందు నుంచీ కమలం గూటి పలుకులే పలుకుతున్నారు కనుక ఆయన అధికారికంగా కాషాయ కండువా కప్పుకోవడం వల్ల బీజేపీ గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక అమిత్ షా తెలంగాణ పర్యటన మునుగోడు సభ వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల ఎక్కువ చర్చలో నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా సికిందరాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు చెప్పులు అందించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లు విమర్శలతో విరుచుకుపడ్డాయి. అమిత్ షాకు చెప్పులు అందించడాన్ని బండి సంజయ్ సమర్ధించుకుంటూ.. తండి, గురువులాంటి వారు అమిత్ షా అంటూ చెప్పుకున్నా.. పెద్దగా ఫలితం లేకపోయింది. ఆయన చెప్పులు అందించడం రాష్ట్రంలో బీజేపీకి చేయాల్సిన నష్టం చేసేసింది. ఈ సందర్భంగా పలువురు గతంలో అమిత్ షా ఒక సభలో పార్టీ సీనియర్ నేత అద్వానీ పక్కన కాలుపై కాలు వేసుకు కూర్చున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తన కాలు అద్వానీకి తగిలేలా ఉంచిన అమిత్ షా అహంకారాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గులాంగిరీని వారించకపోవడం కూడా అమిత్ షా అహంకారానికి నిదర్శనంగానే అభివర్ణిస్తున్నారు. దీంతో అమిత్ షా తెలంగాణ పర్యటన  ఈ సంఘటనతో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక మరో సంఘటన కూడా అమిత్ షా తెలంగాణ పర్యటనను చర్చలో నిలిపింది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం. కోరి పిలిపించుకుని మరీ అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. పరిశీలకులు  సైతం పలు వశ్లేషణలు చేశారు. అయితే చెప్పువ వివాదం వల్ల కానీ, ఎన్టీఆర్ తో భేటీ వల్ల కానీ బీజేపీకి తెలంగాణలో ఒనగూరు ప్రయోజనం ఏమిటన్నదానిపై మాత్రం పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఏ లక్ష్యంతో అయితే అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చి మునుగోడు సభలో పాల్గొన్నారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇక సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన దాఖలాలు లేవు. కుప్పలు తెప్పలుగా నేతలు వచ్చి పార్టీ కండువాలు కప్పించుకుంటారని చేసిన ప్రచారం కూడా తేలిపోయింది. వాస్తవానికి మునుగోడు బీజేపీ సభకు అనుకున్నంతగా జనాలు రాలేదు. అక్కడ సభకు కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి రాలేదు.  . ఈ పరిస్థితిని   ఊహించే జూనియర్ బీజేపీ ఎన్టీఆర్ తో అమిత్ షాతో భేటీ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు.  మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న బీజేపీ బలప్రదర్శన చేశామని చెప్పుకోవడానికి బదులు….  తమ సభకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో సభ విఫలమైందన్న సంగతిని బయటపెట్టుకుందని పరిశీలకులు అంటున్నారు.వాస్తవానికి మునుగోడులో బీజేపీకి బలం లేదు. క్యాడర్ లేదు. రాజగోపాలరెడ్డి చేరికను బలుపుగా భావించి బలప్రదర్శనకు రెడీ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అయితే రాజగోపాలరెడ్డి చేరిక బలుపు కాదనీ వాపు మాత్రమేననీ పరిశీలకులు విశ్లేషిన్తున్నారు.  

జగన్ ఢిల్లీకి అలా వెళ్లారు.. ఇలా వచ్చారు!

జగన్ హస్తిన పర్యటన అదేదో రియాల్టీ షోలో హోస్ట్ చెప్పినట్లు అలా వెళ్లి, ఇలా వచ్చేసినట్లు ముగిసిపోయింది. మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆఖరికి వైసీపీలో కూడా జగన్ పర్యటన గురించి పెద్దగా చర్చ లేదు. ప్రధాని నివాసంలో జగన్ గడిపింది ఓ అరగంట. అందులో జగన్- మోడీ మధ్య భేటీ ఎంత సేపు జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు. అయితే సీఎంవో ప్రెస్ నోట్ ప్రకారం పోలవరం సహా పలు డిమాండ్లతో జగన్ ప్రధానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మధ్యలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. జగన్ అమిత్ షాతో కూడా భేటీ కానున్నారని వైసీపీ శ్రేణులు చెప్పారు. అయితే అమిత్ షా అప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదని హస్తిన వర్గాల ద్వారా తెలిసింది.  జగన్ మోడీతో చర్చించిన విషయాలేమిటన్నది పక్కన పెడితే ఆయన పోలవరంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని మాత్రం సీఎంవో ఒక నోట్ విడుదల చేసింది. గతంలో పలు మార్లు మోడీతో జగన్ భేటీ అయ్యారు. అలా భేటీ అయిన ప్రతి సారీ... వారిరువురి మధ్యా జరిగిన చర్చ ఏమిటన్నది ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడూ అంతే సీఎంవో నుంచి విడుదలైన ప్రకటన వినా.. జగన్ మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడారో వివరించిన సందర్భం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. ఇంత హఠాత్తుగా.. సిరికిం జెప్పడు అన్న చందంగా జగన్ హస్తిన ఎందుకు వెళ్లారు? ఎందుకు వచ్చారు? అంటే వైసీపీ సీనియర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అయితే పరిశీలకులు మాత్రం కేవలం రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకురావడానికే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాల సంకేతాల నేపథ్యంలోనే జగన్ హస్తినకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారని చెబుతున్నారు. ఇటీవల అంటే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మోడీ కొద్ది నిముషాలసేపైనా ఆప్యాయంగా ముచ్చటించడం.. మరో సారి కలుద్దాం అంటూ ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ మద్యం స్కాం బయటపడిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ లింకులు ప్రస్తావించడం కూడా జగన్ హస్తిన పర్యటనకు కారణమని అంటున్నారు.మొత్తం మీద జగన్ హస్తిన పర్యటన ఎవరికీ పట్టకుండా పోయింది. మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఆఖరికి సొంత పార్టీ వారు కానీ జగన్ హస్తిన పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన హస్తిన వెళ్లడం, రావడం మామూలేగా అన్నట్లు నిర్లింప్తంగా ఉండిపోయారు. రాజకీయంగా లేదా కేసుల పరంగా ఏదైనా కొద్ది పాటి ఒత్తిడి వస్తే జగన్ హస్తిన వెళ్లి వస్తారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సారి అదే జరిగిందని వారు అంటున్నారు.   జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు. 

ఆ భేటీ కచ్చితంగా రాజకీయమే.. ఉండవల్లి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మధ్య భేటీ వెనుక ఉన్నది కచ్చితంగా రాజకీయమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.  బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో  టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ  తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి విదితమే. వీరి భేటీ  రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. అమిత్, ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? వీరి భేటీ వెనుక రాజకీయ కోణం ఉందా? అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే వీరి భేటీకి  ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నా.. ఇత‌ర పార్టీలు మాత్రం రాజ‌కీయ ప్రాధాన్యం లేనిదే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ఎందుకు సమావేశమౌతారంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిరువురి భేటీ కచ్చితంగా రాజకీయమే నంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవ‌ల‌ను బీజేపీ వినియోగించుకునే దిశ‌గా వీరిరువురి మధ్యా చర్చలు జరిగి ఉండొచ్చని అరుణ్ కుమార్ అన్నారు.   కచ్చితంగా ఎన్టీఆర్ కు పొలిటికల్ ఇంట్రస్ట్ ఉందనీ,  2009 ఎన్నికల్లో చాలా కష్టపడి తిరిగాడు.   జనంలో కలిసిపోయి ఆయన ప్రసంగం తాను కూడా విన్నానని చెప్పారు. ఎన్టీఆర్ కు మంచి ఎక్స్ ప్రెషన్ స్కిల్స్ ఉన్నాయి. పోలికలు సీనియర్ ఎన్టీఆర్ వి.  అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ అగ్రనేత అమిత్ షా కలిశాడంటే కచ్చితంగా అందుకు రాజకీయ కారణమే ఉంటుంది, వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, వారి భేటీ మాత్రం కచ్చితంగా రాజకీయమే” అని ఉండవల్లి అరుణ్ అభిప్రాయపడ్డారు

కేసీఆర్ చెబుతున్నథర్డ్ ఫ్రంట్ లిక్కర్ కూటమే.. బండి

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడి వెనుక వాస్తవమేమిటో ఇప్పుడు బట్టబయలైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తానంటూ కేసీఆర్ పలికిన ప్రగల్భాల వెనుక అసలు ఉద్దేశమేమిటో ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందని ఆయన అన్నారు. ఆయన రాష్ట్రాల పర్యటనలన్నీ లిక్కర్ ఫ్రంట్ కోసమేనని బండి సంజయ్ అన్నారు. మద్యం మాఫియా నడిపేందుకే ఆయన ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ పర్యటనలు చేశారని ఆరోపించారు. ఆయా రాష్ట్రాలలో పర్యటించి ఆయన చేసుకున్నవన్నటీ చీకటి ఒప్పందాలేనని విమర్శించారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బండి అన్నారు. పంజాబ్ లో ని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.    తన పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద సోమవారం (ఆగస్టు 22) మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్  రామచంద్ర పిళ్లై, శరత్, స్రుజన్ రెడ్డి, అభిషేక్ లు కేసీఆర్ కుటుంబ బినామీలని అన్న సంజయ్, లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల పేరు చెప్పి కేసీఆర్ రాష్ట్ర పర్యటనలన్నీ లిక్కర్ సిండికేట్ చేసి, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇప్పించడానికేనని బండివ సంజయ్ ఆరోపించారు.    అమిత్ షా కు చెప్పులు అందించడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ… నాపై చిల్లరగాళ్ళు చేసే ఆరోపణలు పట్టించుకోను. అమిత్ షా పెద్ద మనిషి. చెప్పులు తీసిస్తే..పెద్ద ఇష్యూ నా? అన్నారు. తాను  అమిత్ షాకు చెప్పులు అందించడాన్ని సమర్ధించుకున్నారు. అమిత్ షాకు తాను చెప్పులందించడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు.    అమిత్ షా తనకు  గురువు. తండ్రిలాంటి వారనీ ఆయనకు  చెప్పులందిస్తే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. గురుద్వారాలో చెప్పులు శుభ్రం చేస్తాం. ఇందాక పాదయాత్రలో ఓ పెద్దావిడ పోలియోతో ఇబ్బంది పడుతుంటే చెప్పులు తొడిగా..అందులో తప్పేముందని ప్రశ్నించారు.    కలెక్టర్ లు కేసీఆర్ కాళ్ళు మొక్కారు దాన్ని  ఏమనాలని ప్రశ్నించారు.  లిక్కర్ దందా వ్యవహారాన్ని పక్కతోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని బండి అన్నారు.  

విడాకుల పార్టీలో ప్రేమ వ్య‌వ‌హారం!

ప్రేమ గురించి ఇప్ప‌టికే తెలుగు సినిమాలు అనేక నిర్వ‌చ‌నాల‌తో మ‌న‌సుల్లో గ‌ట్టి ముద్ర‌నే వేశాయి. పూర్వం చెట్టూపుట్టా తిరుగుతూ పాడుకునే హీరో హీరోయిన్లు, కాలక్ర‌మంలో క్లాస్‌రూమ్‌ల్లో ప్రేమించే సుకుంటున్నారు. ఇప్పుడు ఇంకాస్త అందంగా వేరే వాళ్ల  పెళ్లిళ్ల‌లో ప్రేమ‌ను వెతుక్కుంటున్నారు. ఒక్క‌ రిద్ద‌రు స‌క్స‌స్ అవుతున్నారు. అయితే మెల్‌బోర్న్‌కి అమ్మాయి గాబ్రిలా లాం డాల్ఫీ మాత్రం వేరే విధంగా ప్రేమ‌లో ప‌డింది. ఇది సినిమాకి త‌క్కువేమీ కాదు. గాబ్రిలా విడాకుల కార్య‌క్ర‌మంలో మ‌రో వ్య‌క్తితో ప్రేమ లో ప‌డింది! ఇంత‌కంటే ట్విస్ట్ మ‌రోటి ఉంటుందా? ఎవ‌ర‌న్నా పెళ్ల‌యి, అనేకానేక కార‌ణాల వ‌ల్ల విడి పోతే ఎంతో బాధ‌ప‌డుతూంటారు. జీవితం ఎలాగా అని తెగ ఆలోచ‌న‌లో ప‌డి కాలం వెళ్ల‌దీస్తుంటారు. కానీ గాబ్రిలా సంగ‌తి వేరు. ఆమె మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌డం కూడా పెద్ద పార్టీలా చేసింది. ఆ పార్టీకి అన్ని ఏర్పాట్లు చూడ్డానికి వ‌చ్చిన వైయిట‌ర్ల‌లో ఒక‌డు జాన్ లాండాల్ఫీ. అత‌ను ఆమెను చూడ‌గానే ఢ‌భాల్న ప్రేమ‌లో ప‌డిపోలేదు, అమాంతం నువ్వు అదీ, నేను ఇదీ.. అంటూ పాటేమీ అందుకోలేదు. ఆమెకు కోపం తెప్పించే మాటే అనేశాడు. మేడ‌మ్ మీరు వేసుకున్న డ్ర‌స్ నిజానికి మీకు సూట్ కాలేదు. అది మీ లోపం కాదు, మీకు సూట్ కాలేదంతే.. అనేశాడు. ఆమెకు అప్ప‌టిదాకా ఉన్న ఆనందం కాస్తా పోయి కోపంతో ఊగి పోయింది. ప‌రుగులాంటి న‌డ‌క‌తో బెడ్‌రూమ్‌కి వెళ్లి త‌న‌ని నిలువెత్తు అద్దంలో చూసుకుంది. తాను, త‌న మేక‌ప్ అంతా బాగానే ఉంది. కానీ డ్ర‌స్ క‌ల‌ర్ ఆమెకు స‌రిప‌డ‌లేదు. అర‌గంట త‌ర్వాత శాంతించి ప్రశాంతంగా బ‌య‌టికి వ‌చ్చింది. అదే డ్ర‌స్‌లో అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ తిరిగింది.  కొంత‌సేప‌టికి మ‌ళ్లీ అత‌గాడు ఎద‌ర‌యి చాలా ఆరాధ‌నా భావంతో చూసి ఆమెకు మంచి డ్రింక్ ఇచ్చాడు. మీలాంటి మంచి మ‌న‌సు ఉన్న‌వారికి కోపం సూట్ అవ‌దు అనేశాడు. అరే వీడెలా ప‌సిగ‌ట్టాడు అనుకుంది. మీరు వేగంగా మెట్లు ఎక్కి వెళుతుంటే గ‌మనించాను. ఐ యామ్ సారీ.. నాదే త‌ప్పు అని మ‌రో మంచి డ్రింక్ ఇచ్చాడు. వీడిలో ఏదో ప‌వ‌ర్ ఉంది.. అనుకుంది. అత‌ని సిన్సియారిటీ ఆమెకు బాగా న‌చ్చింది. త‌న భ‌ర్త‌తో విడాకుల పార్టీ అయిపోయింది. ఆ త‌ర్వాత రోజు ఆ వెయిట‌ర్‌నే పిలిచి ఇంట్లో చాలాసేపు మాట్లాడి మ‌నం ఇక నుంచి స్నేహితులం అంటూ చేయి అందించింది. అత‌ను చ‌క్క‌గా న‌వ్వాడు. వారు ప్రేమ‌లో ప‌డ్డా రు. అలాగ‌ని అత‌ను త‌ర‌చూ వెళ్లేవాడు కాదు. ఆమె ర‌మ్మంటేనే వెళ్లేవాడు. అత‌ని వ్య‌క్తిత్వం, హుందాత‌నం న‌చ్చాయి. ఒక రోజు హ‌ఠాత్తుగా మ‌నం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. అత‌ని నిర్ఘాంత‌పోయాడు. అప్ప‌టికి వారి స్నేహం, ప్రేమ వ‌య‌సు కేవ‌లం ప‌ది నెల‌లే! ఒక‌రోజంతా ఆలోచించి అత‌ను స‌రే అనేశాడు.  విడాకుల పార్టీ జ‌రిగిన హోట‌ల్లోనే గాబ్రిలా, లాండోల్ఫీని పెళ్లాడింది. దీన్ని గురించి చాలా రోజులు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నా రు  మెల్‌బోర్న్‌లో. పెళ్లిళ్లు ఇలా కూడా అవుతాయా పిన్నీ.. అన్న‌ది ప‌క్కింటి జూలీ. ఇపుడు గాబ్రిలా, జాన్ ల‌కు ఓ పిల్లాడు కూడా!

ప్రక్షాళన పేరిట వైసీపీ సిట్టింగులకు జగన్ ఉద్వాసన?

ప్రభుత్వ వ్యతిరేకత, కేసులు, పార్టీలో అసమ్మతి ఏపీ సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ముందుగా ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి వారికి స్థాన చలనం కల్పించడమే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 58 నియోజకవర్గాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే 11 లోక్ సభ నియోజకవర్గాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతేనని చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాల ద్వారా ఎమ్మేల్యేలను మార్చే నియోజకవర్గాల జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఆ జాబితా మేరకు ఉత్తరాంధ్ర నుంచి కురుపం, ఎచ్చర్ల, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎస్. కోట, బొబ్బిలి, గజపతినగరం, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ, పాయకరావుపేట, నర్సిపట్నం, అరకు వేలీ, గాజువాక, పాడేరు, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా నుంచి జగ్గంపేట, పిఠాపురం, పత్తి పాడు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నుంచి పాలకొల్లు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నుంచి సిట్టింగులకు కాకుండా కొత్త వారికి టికెట్లిచ్చి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అలాగే   విజయవాడ వెస్ట్, కైకలూరు, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ,  సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ, తెనాలి, బాపట్న, పొన్నూరు, వేమూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, కందుకూరు, మర్కాపురం, కొండెపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, పూతలపట్టు, శ్రీ కాళహస్తి, పలమనేరు సింగనమల, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం,  కల్యాణదుర్గం, కర్నూలు, పత్తి కొండ, నందికొట్కూరు, మైదకూరు, పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సిట్టింగులకు కాకుండా కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇక లోక్ సభ నియోజకవర్గాల సంగతి తీసుకుంటే.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, విజయవాడ, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, నర్సాపురం, ఏలూరు లోక్ సభ స్థానాలలో సిట్టింగులకు అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. ఆయా స్థానాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వివిధ సర్వే బృందాల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు 2024 ఎన్నికలో పోటీకి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇవే కాకుండా రానున్న రోజులలో మరిన్ని నియోజకవర్గాల విషయంలో కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆయా సిట్టింగుల పని తీరు, వారిపై నెలకొన్న ప్రజావ్యతిరేకత ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 

భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య త్రిస‌భ్య క‌మిటీ రద్దు

భార‌త్ ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్ పై ఫీఫా నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీల‌క చర్యకు ఉపక్రమించింది. ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణకుగానూ ఈ ఏడాది మే నెలలో నియమించిన త్రిసభ్య పాలనా కమిటీని రద్దు చేసింది. నిషేధం ఎత్తివేతకు ఫీఫా సూచించిన కీలక ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తెలిపింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ సారధ్యంలోని పాలనా యంత్రాంగం ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఫుట్‌బాల్‌ కార్యక్రమాలను ఆయా సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫీఫా కోరుకుంటుంది. ప్ర‌భుత్వాలు, కోర్టులు తృతీయ పక్షం జోక్యాన్ని అస్సలు ఫీఫా అంగీక‌రించ‌దు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చిం ది. 2020 డిసెంబరులోనే అధ్యక్ష ఎన్నికలు జ‌ర‌గ‌లేదు. అప్పటికే మూడు పర్యాయాలు అధ్యక్షునిగా ఉన్న ప్రఫుల్‌ పటేల్‌..  జాతీయ క్రీడాబిల్లు నిబంధన ప్రకారం ఇక  ఆ  పదవిలో కొనసాగేం దుకు ఎంత మాత్రం వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.   సమాఖ్య వ్యవహారాల  పర్యవేక్షణకు జస్టిస్‌ దవే నేతృత్వంలో సుప్రీం కోర్టు త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేసింది. ఈ పరిణా మాలను గమనిస్తున్న ఫీఫా కొంతకాలంగా  పరిస్థితులు మారకపోవడంతో వేటు వేసింది. ఇదిలాఉండ‌గా,  ఈ నెల 28న జరగాల్సిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల తేదీని వారం రోజులు పొడిగిస్తున్న‌ట్టు సుప్రీం  తెలిపింది. ఓటర్ల  జాబితాలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది సభ్యులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కాగా విచారణ సందర్భంగా సీవోఏ తరపున న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ హాజరయ్యారు. ఏఐఎఫ్ఎఫ్ మధ్యంతర ఆడిట్ రిపోర్టును అంద జేశారు. తుది నివేది క‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వెల్లడించింది. కాగా సుప్రీంకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలు ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం ఎత్తివేత దిశగా బాటలు వేయనుంది. ఫిఫా నిర్ణయంతో ఇప్పటికే జాతీయ జట్టుతో పాటు క్లబ్ జట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.

జాతీయ ప‌తాకాన్ని భ‌ద్ర‌ప‌ర‌చండి

స్వాతంత్య్ర‌దినోత్స‌వం అన‌గానే దేశమంతా దేశ‌భ‌క్తి ఒక్క‌సారిగా పెల్లుబుకుతుంది. ప్ర‌తీ న‌గ‌రం, ప‌ల్లె దేశ‌భ‌క్తి గీతాలు, ప‌తాకాల రెప‌రెప‌ల‌తో క‌నువిందు, వీనుల విందూ చేస్తుంటాయి. అదో పండుగ వాతావ‌ర ణంగా ఉంటుంది. నాయ‌కులు గొంత స‌వ‌రించుకుని కాస్తంత దేశ‌, ప్రాంతీయ చ‌రిత్ర గురించి నాలుగు మాట‌లు ఆవేశంగా మాట్లాడ‌టం, దేశ ప్ర‌ధాని చెప్పిన‌వ‌న్నీ పాటించి తీరాల‌ని హామీలు తీసుకోవ‌డం వంటివీ జ‌రుగుతుంటాయి. ఇది దాదాపు అనా దిగా వ‌స్తున్న‌దే. ఈసారి చిత్ర‌మేమంటే పండ‌గ అయి పోగానే ఎవ‌రికి వారు ఏమీ ప‌ట్ట‌న‌ట్టుం డ‌టంతో పాటు ప‌తాకాల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని అధికారులు సందేశం లాంటి హెచ్చ‌రికా చేయ‌డం.  ఎంతో దేశ‌భ‌క్తితో ప‌తాకాలు పెద్ద పెద్ద క‌ర్ర‌ల‌కు క‌ట్టి చిన్న చిన్న‌వాటిని దండ‌లుగా వీధంగా క‌ట్టి  నానా హ‌డావుడి చేసే వారంతా అప్ప‌టికి చూపే పార్టీ నాయ‌కుల‌ప‌ట్ల అభిమానం, స‌ర‌దా ఆ మ‌ర్నాటితో  ఆగి పోకూడ‌ద‌న్న‌ది ఇప్ప‌టి నేత‌ల ప్ర‌క‌ట‌న సారాంశం. అంతా అయిపోయింది ఇక ఇళ్ల‌కు ప‌దండ‌ర్రా అను కుని జెండాల‌ను వీల‌యినంత నిర్ల‌క్ష్యంగా ప‌డేయ‌డం ప‌రిపాటి. అలా చేయ‌డం త‌ప్పే. దేశ నాయ‌కుల ప‌ట్ల ఏమాత్రం గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డ‌మే. అస‌లు జాతీయ‌ప‌తాకాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే.  కానీ మొన్నీమ‌ధ్య దాకా ఈ సంగ‌తిని బ‌డి పిల్ల‌ల‌కు, కాలేజీ కుర్రాళ్లు గ‌ట్టిగా చెప్పిన నాయ‌కులు లేరు. అందుకే మొన్న‌టి దాకా చాలా కాలం నుంచే పెద్ద పెద్ద ప‌తాకాలు త‌ప్ప చిన్న‌వి, దుకాణాల్లో సూదితో పాటు కొను క్కున‌వ‌న్నీ నోటు బుక్కుల్లోకో, కాల‌వ‌ల్లోకో వెళిపోవ‌డం జ‌రిగింది.  నోటుబుక్కులో పెట్టుకుని ఇది నాది అంటూ క్లాసుల్లో గొడ‌వ‌ప‌డే పిల్ల‌లూ ఉంటారు. అదో స‌ర‌దా వారికి. అదీ తాత్కాలిక‌మే. రెండు మూడు రోజుల త‌ర్వాత అవీ వాటిస్థానం నుంచి జారిపోతాయి. ఎక్క‌డో పారేసు కుంటారు. కానీ ఇపుడు అలా జ‌ర‌గ‌డానికి ఏమాత్రం వీల్లేద‌ని రాజ‌కీయ నాయ‌కులు గ‌ట్టిగా చెబు తున్నారు. బ‌డిలో, ఆఫీసుల్లో, ఇళ్ల‌మీదా ఎగ‌రేసుకున్న పెద్ద పెద్ద జెండాలు మాత్రం జాగ్ర‌త్త‌గా బ‌ట్ట‌లు మ‌డ‌త పెట్టి న‌ట్టు చేసి ఇంట్లో, ఆఫీసుల్లో జాగ్ర‌త్త చేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది జాతీయ ప‌తాకాన్ని గౌరవించ‌డంలో భాగం. పాటించ‌డం ఆరోగ్య‌క‌రం. జాతీయ నాయ‌కుల‌ను ముఖ్యంగా స్వాతం త్య్రోద‌మ్యంలో ప్రాణాలు అర్పించిన దేశ‌భ‌క్తుల ప‌ట్ల అపార గౌర‌వం ప్ర‌క‌టించిన‌ట్లే. ఆలోచిం చండి. 

ఉగ్ర కేసులో ఇమ్రాన్ కు ముందస్తు బెయిలు

పాకిస్థాన్ లో అధికారం పులి మీద స్వారీ లాంటిదని అంటారు. అధికారంలో ఉన్నంత కాలం ఎదురు లేకుండా సాగినా ఒక సారి అధికారం కోల్పోయిన తరువాత పాకిస్థాన్ లో మనుగడ దినదిన గండంగా మారిపోతుంది. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం మేడిపండు చందమని చెబుతుంటారు. అక్కడి సైనికాధికారుల మద్దతు ఉన్నంత వరకూ పాక్ అధ్యక్షలకు పాలన నల్లేరు మీద బండి నడకేననీ, ఒక సారి సైనికాధికారుల సానుకూల దృష్టి నుంచి బయటకు వచ్చారా.. ఇక వారికి చుక్కలు కనిపిస్తాయనీ అంటుంటారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుల పరిస్ధితిని గమనిస్తే అది వాస్తవమేనని రూఢి అవుతుంది. ఇప్పుడు  పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అధికారం కోల్పోయిన తరువాత ఆయన అడుగడుగుకూ ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనపై ఉగ్ర కేసు నమోదైంది.  శనివారం (ఆగస్టు 20) ఇస్లామాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ సహా పలు ప్రభుత్వ సంస్థలను బెదరించేలా ప్రసంగించారంటూ ఆయనపై ఉగ్ర కేసు నమోదు చేశారు.  అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిలు ఇవ్వాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్ బెయిలు పిటిషన్ విచారించిన ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. గురువారం వరకూ ఈ కేసులో ఆయనను అరెస్టు చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇమ్రాన్ ఖాన్ పై మోపిన అభియాగాలు అక్రమమని ఇమ్రాన్ తరఫు న్యాయవాది వాదించారు.  అవినీతి, అవినీతి రాజకీయ నాయకులపై విమర్శలు చేసినందుకే ఇమ్రాన్‌ఖాన్‌పై కేసులు బనాయించారని  ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ   పోలీసులు నమోదు చేసినతప్పుడు అభియోగాలతో ఇమ్రాన్ నుఅరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు గురువారం వరకూ అరెస్టు చేయరాదని ఆదేశాలు ఇచ్చింది.

చిక్కులు తెంచుకునేందుకే మోదీతో జ‌గ‌న్‌ భేటీ

ప‌లు స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో ఊపిరాడ‌క,  ప‌రిష్కారాల‌ను అర్ధించేందుకు  ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌ధాని మోదీతో  సోమ‌వారం (ఆగ‌ష్టు22)  స‌మావేశ‌మ‌య్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  సవ రించిన అంచనాలు ఆమోదించాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. అందుకు సంబంధించిన  నిధులు  కూడా విడుదల చేయాలని అభ్యర్థించి నట్టు చెబుతున్నారు. నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించిన అంశాలను కూడా చ‌ర్చించార‌ని  వైసీపీ పార్టీ నేతలు చెబుతున్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు, నిధుల విడుదల అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.  సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.  30 నిముషాలపాటు ఇరువురి సమా వేశం జరిగింది. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న  వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉన్న కేసులకు తోడు వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసులో త్వరలోనే కీలక పరిణామా లు జరుగుతాయంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వైసీపీ నేతలకు లింకులు ఉన్నట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. విజయ సాయి బం ధువులు సహా పలువురు వైసీపీ నేతల ప్రమేయంపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. ఏపీలో లిక్కర్ సహా ఇతర మాఫియాలు పాలిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి ఠాకూర్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలి సిందే. డర్టీ వీడియోతో ఎంపీ గోరంట్ల వ్యవహారం కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగు తోంది. ఈ అంశా ల్లో త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌న్న ల‌క్ష్యంతోనే జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మ య్యార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.  ఎంపీ మాధవ్‌పై చర్యల కోసం ఇప్పటికే ప్రధాని, లోక్ సభ స్పీకర్, జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యా దు లు వెళ్లువెత్తాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే  ఆదేశిం చింది. ఈ పరిణామాలకు తోడు ఇటీవల ఢిల్లీలో చంద్రబాబు, మోదీ షేక్ హ్యాండ్‌తో వైసీపీ ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లో అమిత్ షా, రామోజీరావు భేటీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామా లన్నీ వైసీపీలో కలవరం రేపుతున్నాయి.

బీజేపీ నేత‌ల‌పై  క‌విత  ప‌రువున‌ష్టం దావా 

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణంలో ఆమెకు సంబంధం ఉంద‌ని  బీ జేపీ ఎంపీ ప‌ర్వేష్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మంజింద‌ర్ సిర్సాలు సాక్ష్యాల‌తో స‌హా నిరూపించ‌డానికి సిద్ధపడ్డారు. కానీ అందులో వాస్త‌వ‌ మేమీ లేద‌ని వారిపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డానికే క‌విత నిర్ణ‌యించుకు న్నారు. త‌న‌పై నిరాధార ఆరో ప‌ణ‌లు చేసినందుకు వ్య‌తిరేకంగా  ఇంజంక్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వాల‌ని కూడా కోర్టును ఆశ్ర‌యిం చ‌నున్నారు.  ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం విష‌యంలో ఇప్ప‌టికే కేసీఆర్ కుటుంబ స‌భ్యుల మీద భారీ ఆరోప‌ ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత భ‌ర్త సంబంధీకుల ప్ర‌మేయం ఉంద‌ని, ఆమె దీనికి సంబంధించిన ఒప్పందాల‌ను ద‌గ్గ‌రుండి న‌డిపించిద‌నే ఆరోప‌ణ ఉన్న‌ది. ఈ వ్య‌వ‌హారంలో కీల‌క‌పాత్ర ఆమెదేన‌ని ఢిల్లీ (వెస్ట్‌) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీం దర్‌ సిర్సా ఆది వారం ఢిల్లీలో మీడియా కి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ కోకాపేట‌కు చెందిన మ‌ద్యం వ్యాపారి అరుణ్ రామ‌చంద్ర పిళ్లైను ఢిల్లీకి కేసీఆర్  త‌న‌య క‌వితే తీసుకువ‌చ్చార‌ని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సింగ్‌ సిర్సా ఆరోప‌ణ‌. ఆమె ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో జ‌రిపిన స‌మావేశాల త‌ర్వాత‌నే పంజాబ్‌, తెలంగాణాలో ఉన్న మ‌ద్యం విధానాల‌ను ఆప్ నేత‌లు ఢిల్లీలోనూ అమ‌లు చేశార‌ని ఆయ‌న అన్నారు. మద్యం వ్యాపారుల కమీషన్‌ను  12 శాతానికి పెంచడంతో పాటు, ఆక్షన్‌ లేకుండా హోల్‌సేల్‌ లైసెన్స్‌లు మంజూరు చేశారని మండిపడ్డారు. అస‌లు క‌విత రాక‌తోనే పంజాబ్‌లో మ‌హ‌దేవ్ లిక్క‌ర్స్ సంస్థ మూసివేయించ‌డానికి కేజ్రీవాల్‌, మ‌నీశ్ సిసోడియా లకు  రూ.4.5 కోట్లు ఇప్పించార‌ని ఆయ‌న ఆరోపించారు.  ఇదిలా ఉండ‌గా, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని కేసీఆర్ త‌న‌య క‌విత ఢిల్లీ బీజేపీ నాయ‌కుల మీద ప‌రువున‌ష్టం దావా వేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.