ఆ భేటీ కచ్చితంగా రాజకీయమే.. ఉండవల్లి
posted on Aug 22, 2022 @ 11:17PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మధ్య భేటీ వెనుక ఉన్నది కచ్చితంగా రాజకీయమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి విదితమే.
వీరి భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. అమిత్, ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? వీరి భేటీ వెనుక రాజకీయ కోణం ఉందా? అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే వీరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రాధాన్యం లేనిదే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ఎందుకు సమావేశమౌతారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిరువురి భేటీ కచ్చితంగా రాజకీయమే నంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను బీజేపీ వినియోగించుకునే దిశగా వీరిరువురి మధ్యా చర్చలు జరిగి ఉండొచ్చని అరుణ్ కుమార్ అన్నారు. కచ్చితంగా ఎన్టీఆర్ కు పొలిటికల్ ఇంట్రస్ట్ ఉందనీ, 2009 ఎన్నికల్లో చాలా కష్టపడి తిరిగాడు. జనంలో కలిసిపోయి ఆయన ప్రసంగం తాను కూడా విన్నానని చెప్పారు.
ఎన్టీఆర్ కు మంచి ఎక్స్ ప్రెషన్ స్కిల్స్ ఉన్నాయి. పోలికలు సీనియర్ ఎన్టీఆర్ వి. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ అగ్రనేత అమిత్ షా కలిశాడంటే కచ్చితంగా అందుకు రాజకీయ కారణమే ఉంటుంది, వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, వారి భేటీ మాత్రం కచ్చితంగా రాజకీయమే” అని ఉండవల్లి అరుణ్ అభిప్రాయపడ్డారు