రేవంత్ విషయంలో తగ్గేదే లే.. వెంకటరెడ్డి
posted on Aug 23, 2022 7:50AM
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. ఆయన పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లాంటి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి విజయం అత్యంత అవసరం. ఇక్కడ విజయం సాధిస్తేనే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. పైగా సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో పార్టీలో అందరూ సమష్టిగా పని చేసి పార్టీకి విజయాన్ని చేకూర్చాల్సివన పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనెవరి మాటా విన అంటూ భీష్మించుకు కూర్చున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తమను కాదని.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ ను వీడేదే లే అంటున్న కోమటిరెడ్డి.. రేవంత్ లో సఖ్యతగా పని చేయడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని ఇప్పటికే ప్రకటించిన వెంకటరెడ్డి.. ఆ మాటకు కట్టుబడే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికపై కీలక భేటీకి డుమ్మా కొట్టార. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో హస్తినలో మునుగోడుపై కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన వెంకటరెడ్డి ఈ భేటీకి రేవంత్ కూడా వస్తున్నారంటూ భేటీలో పాల్గొనకుండానే వెనుదిరిగి వచ్చేశారు. అక్కడితో ఆగకుండా రేవంత్ మాణిక్కం ఠాగూర్ లపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు ప్రియాంక అధ్యక్షతన మునుగోడు ఉప ఎన్నికపై కీలక సమావేశానికి కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూరు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. తన సోదరుడి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక సందడి ఆరంభమైన తరువాత వెంకటరెడ్డి ఇంత వరకూ మునుగోడు వైపు వెళ్లలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖలో రేవంత్ తో వేదిక పంచుకోలేననీ, మునుగోడులో ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాకూర్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆయనను తెలంగాణ నుంచి పంపించేయాలనీ కమల్ నాథ్ వంటి వారు ఆ స్థానంలో ఉంటే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని అన్నారు. ఇక రేవంత్ వల్ల పార్టీ భ్రష్టుపడుతోందని ఆరోపించారు. తమ కుటుంబంపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అందుకే ఆయనతో కలిసి పని చేయలేననీ స్పష్టం చేశారు. అయితే వెంకటరెడ్డి ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటోంది. వెంకటరెడ్డిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.