సానియా చేతికి గాయం.. యూఎస్ ఓపెన్ కు దూరం
posted on Aug 23, 2022 @ 10:17AM
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది. దీంతో ఆమె యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి దూరమైంది. తన మోచేతికి గాయమైందని సానియా మీర్జా స్వయంగా వెల్లడించింది. గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. రెండు వారాల కిందట కెనడాలో టెన్నిస్ ఆడుతుండగా ఆమె మోచేతికి గాయమైంది.
అప్పుడు పెద్ద గాయం కాదని భావించినా నొప్పి తగ్గకపోవడంతో స్కాన్ చేయించుకుంది. స్కానింగ్ లో గాయం తీవ్రత తెలియడంతో కొన్ని వారాల పాటు ఆటకు దూరం అవ్వాలన్న వైద్యుల సూచన మేరకు తాను యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.
గాయం కారణంగా తాను ఆట నుంచి రిటైర్ అయ్యే ప్రణాళికలో కొన్ని మార్పులు అనివార్యమౌతాయని భావిస్తున్నట్లు తెలిపిన సానియా మీర్జా ఇప్పటి వరకూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ, త్వరలోనే అప్ డేట్ చేస్తాననీ పేర్కొంది.
కాగా సానియామీర్జా గాయం వార్త వినగానే ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.