జనగామలో బండి సంజయ్ అరెస్టు
posted on Aug 23, 2022 @ 11:05AM
ఢిల్లీ మద్యం స్కామ్ లో తెలంగాణ ప్రమేయం గురించిన వార్తలు వచ్చినప్పటి నుంచీ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఢిల్లీ మద్యం స్కాంలో టీఆర్ఎస్ అధినేత తనయ కవిత ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే సోమవారం బీజేపీ కార్యకర్తలు కవిత నివాసం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. కాగా బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా బండి సంజయ్ మంగళవారం ( ఆగస్టు 23)న జనగామలో దీక్ష చేయాలని బండి నిర్ణయించారు.
ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్రలో ఉన్న సంగతి విదితమే. ఆ యాత్రలో భాగంగా జనగామలో దీక్ష కు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.