లోకేష్ వ్యాఖ్యలతో.. వైసీపీలో వణుకు

జగన్  సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతకాలంగా దండయాత్ర ప్రారంభించారు. వైసీపీ నేతల భారీ కుంభకోణాన్ని త్వరలో బయటపెడతానని లోకేష్ చెప్పడంతో..  వైసీపీ నేతల్లో వణుకు స్టార్ట్ అయింది. లోకేష్ దెబ్బకు.. జగన్ రెడ్డి అబ్బా అనే రేంజ్ లో ఆ కుంభకోణం ఏదో బట్టబయలవుతుందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. లోకేష బయట పెడతానన్న కుంభకోణం ఏమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థుల తప్పుల గురించి సమాచారం ఏదైనా తెలిస్తే అప్పుటికప్పుడే ఎండగట్టేస్తాయి పొలిటికల్ పార్టీలు. జగన్ ప్రభుత్వంలో రహస్యంగా జరిగిన ఒక స్కామ్ గురించి ముందే చెప్పి బహిరంగం చేస్తానన్న లోకేష్ ధైర్యానికి తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. ‘రాష్ట్రంలో దొంగలు పడ్డారు’ అనే సినిమా త్వరలో  విడుదల అవుతుందని, దాని రిలీజ్ డేట్ ముందే చెప్పారు  లోకేష్. చినబాబు వేసిన బాంబ్ కు వైసీపీ నేతలు మాడి మసైపోతారనే టాక్  ఆంధ్రాలో జోరుగా నడుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన నాటి నుండీ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేకుండాపోయిందని టీడీపీ నిప్పులు చెరుగుతూనే ఉంది. యువనేత లోకేష్ ఎప్పటికప్పుడు చేస్తున్న పోరాటంతో టీడీపీకి మైలేజ్ మరింతగా పెరిగిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఈ సారి లోకేష్ కొట్టే దెబ్బ వైసీపీ నేతలకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా చేయాలని టీడీపీ ప్రతి కార్యకర్తా భావిస్తున్నారని చెబుతున్నాయి. లోకేష్ బయటపెడతానన్న భారీ స్కామ్ ఏమిటో.. ఎలా ఉండబోతోందో అనే చర్చే ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో కొత్త చర్చకు తెర తీశాయి. ఇప్పుడు పట్టణాల నుండి రచ్చబండ వరకు లోకేష్ బయటపెట్టే స్కాం ఎలా ఉండబోదన్నదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. అంశపై పలువురు చర్చించుకుంటున్నారు.  

డుగ్గు డుగ్గుమ‌ని ఎన్‌ఫీల్డ్ మీదొచ్చేసింది!

పెళ్లి అన‌గానే అనేకానేక జాగ్రత్త‌లు తీసుకుంటూంటారు, మ‌గ‌, ఆడ పెళ్లివారు. ఇది ఇంటి ప‌రువుకి సంబంధించిన వ్య‌వ‌హా ర‌మూ కావ‌డంతో. పెళ్లి కూతురువాళ్లు పెద్ద ఎత్తున బాజాభ‌జంత్రీల‌తో పెళ్లి వేడుక ద‌గ్గ‌రికి వెళ్ల‌డం.. అంతా చూసి త‌రిం చాల్సిందే. పెద్ద‌ల్లో ఉండో గొప్ప ఆనందం చూసితీరాలి, పిల్ల‌లు .. రెండిళ్ల‌ వారూ క‌లిసిపోయి ఆడుకుంటూంటారు. ఇది చాలా స‌హ‌జంగా జ‌రిగేది. కానీ భారీ పెళ్లి డ్ర‌స్సు లో అమ్మాయి సిగ్గుప‌డుతూ రావ‌డం మాట అటుంచితే ఏకంగా పెళ్లి కూతురు బుల్లెట్ ఎక్కి వ‌చ్చింది! పెళ్లి మండపం ద‌గ్గ‌రికి పెళ్లి కూతురు రావ‌డం, పెళ్లి త‌ర్వాత అత్తారింటికి పంపే కార్య‌క్ర‌మాల‌తో రెండు కుటుంబాలూ కాస్తంత ఇమోష‌న్ కావ‌డం చాలా ప‌రిపాటి. అయితే కాల‌ క్ర‌మంలో అత్యాధునిక పోక‌డ‌లు చోటు చేసుకుని ఆ సంప్ర‌దాయాల‌ను కాస్తంత వెన‌క్కి నెడుతు న్నారు ఈ త‌రం త‌ల్లిదండ్రులు.  ఉత్త‌రాది పెళ్లిళ్ల‌లో బారాత్ పెద్ద స్థాయిలోనే జ‌రుగుతుంది. ఇరు కుటుంబాల వారూ ఎంతో గొప్ప‌గా చెప్పుకునే సంద‌ర్భం. పెళ్లి కొడుకు గుర్రం మీద వ‌స్తాడు. వెన‌క‌నే స‌గం ఊరు క‌దిలి వ‌చ్చిన‌ట్టు అత‌గాడి బంధుగ‌ణం అలంక‌ర‌ణ‌లు, ఆభ‌ర‌ణాల‌తో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతూంటారు. ఇదో సంప్ర‌దాయ వేడుకు. దీనికి అంద‌రూ మంత్ర‌ముగ్ధులు కావాల్సిందే.  కానీ ఇటీవ‌లే ఒక అమ్మాయి ఈ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిని పూర్తిగా కాద‌న్న‌ది. అంతేకాదు తానే మంచి డ్ర‌స్‌లో ఏకంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద పెళ్లి మండ‌పానికి వెళ్లింది. దారిలో అంతా అమితాశ్చ‌ర్యంతో చూసి ఉంటారు.  కానీ అలా అత్యాధునికంగా రావ‌డంలో, అంద‌ర్నీ అలా ఆక‌ట్టుకోవ‌డంలో ఆమె ఆనందానికి అంతే లేదు. బండి మీద రాగానే.. అదేవిటే, అలా దిగ‌బ‌డ్డావూ.. అంటూ వాళ్లింటో, వీళ్లింటో పెద్దామె ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేద‌ట‌! మేన‌మామ విసుక్కోలేదు, కాబోయే అత్త‌గారు మెటిక‌లు విర‌వ‌లేదు, మామ‌గారూ ఆగ్ర‌హించలేదు, పెళ్లి కొడుకు చిన్న‌బుచ్చుకోలేదు.. ఆమెను అలా రాగానే వెంట‌నే బండి నుంచి దింపి సాద‌రంగా, ఎంతో ప్రేమ‌తో అంద‌రూ పెళ్లి మండ‌పం మీద‌కి బంగారు త‌ల్లీ.. రావ‌మ్మా.. అంటూ దిష్టి తీసి మ‌రీ  తీసుకువ‌చ్చారు. అన్న‌ట్టు ఇలాంటి ప్ర‌య‌త్నాలు అక్క‌డేదో వూర్లో సాగింది.

డొక్కా డొంక తిరుగుడు.. ఉండవల్లికి విరుగుడు

వైసీపీలో ఏ నాయకుడిని ఎప్పుడు అందలమెక్కిస్తారో.. ఎప్పుడు అధ: పాతాళానికి తొక్కుస్తారో ఎవరూ ఊహించలేరు. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికే ఈ ఎత్తుపల్లాలు వైసీపీలో తప్పలేదు. పార్టీలో నంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత ఒక్కసారిగా జీరోగా మారిపోయారు. ఆ తరువాత మళ్లీ పార్టీలో ఆయనకు పూర్వవైభవం దక్కిందనుకోండి అది వేరే విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు వరుసగా వస్తాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా ఎంత మందో పార్టీలో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయిన వారు కనిపిస్తారు. ఇప్పుడు తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి అలా తయారైంది. జగన్ మనసు గ్రహించి మసులుకున్నఎమ్మెల్యేగా ఆమెకు మంచి గుర్తింపే దక్కింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆమె చెలరేగిన తీరు పార్టీ అధినేతను మెప్పించింది. రాజధాని కోసం గళమెత్తి ఆందోళనకు దిగిన వారందరినీ ఆమె పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు.  అమరావతి భూములన్నీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారివేనంటూ ఆరోపణలు గుప్పించారు. సరే ఆ వైభోగం ఇప్పుడు అయిపోయింది. ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తడంతో వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని దూరం పెడుతోంది. అంతేనే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని అన్యాపదేశంగా చెప్పేసింది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గ సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో పొమ్మన లేక పొగపెట్టినట్లేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఉండవల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలే వారి నియోజకవర్గానికి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తుంటారు. అయితే జగన్ మాత్రం ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను సమన్వయ కర్తగా నియమించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ఎమ్మెల్సీకీ రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆ తరువాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలోనే చేరారు. అలా చేరీ చేరగానే తాను రాజీనామా చేసిన ఎమ్మల్సీ పదవిని వైసీపీ నుంచి పొందారు. ఇప్పుడు గతంలో తాను రెండు సార్లు గెలిచిన తాడికొండ నియోజకవర్గానికి వైపీసీ సమన్వయ కర్తగా నియమితులయ్యారు. దీంతో ఉండవల్లి సీటుకు ఎసరు పెట్టేశారు. 

వైసీపీ కొంప‌ముంచిన భూమ‌న మ‌న‌సులో మాట‌!

మావోడు స‌క్ర‌మంగా ఉంటే, ఈపాటికి నేనేడో ఉండేవోడిని, ముచ్చ‌టగా కుర్చోరా అబ్బీ అంటే నా క‌మ‌తం నా యిట్టం.. అని వెన‌క‌టికి ఒకాయ‌న ఊరు వ‌దిలే ప‌రిస్థితి తెచ్చుకున్నాడు. నాయ‌కుడిని నాయ‌కులు, అభిమానులు ఆద‌రించాలి. ఆద‌రాభిమా నాలు కేజీల్లెక్కన మార్కెట్లో దొర‌క‌వు. సంపాదించుకోవాలి. తోటి వారే గేలిచేస్తే ఇక నాయ‌క‌త్వం ఎందుకు, కుర్చీల ద‌ర్జా ఎందుకు? ఇపుడు ఇదే ప‌రిస్థితి ఏపీలో వైసీపీ స‌ర్కార్ అనుభ‌వంలోకి వ‌చ్చింది. నైతిక‌త లేని రాజ‌కీయాలు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప‌త‌నం చెందిన వ్య‌క్తికి అధికారం వ‌స్తే చేయ‌గ‌లిగిందేమీ లేదంటూ ఏకంగా వైసీసీ ఎమ్మ‌ల్యే భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేదో ఆషామాషాగా, స‌ర్దాగా అన్న‌ది కాదు. మ‌న‌సులోంచి వ‌చ్చినదే. ఆయ‌న‌కు ఎప్ప‌టినుంచో ఉన్న అభిప్రాయ‌మే. కాబోతే పార్టీవారితో అన‌కుండా ఆ మాట సీజేఐ జ‌స్టిన్ ఎన్వీ ర‌మ‌ణ స‌మ‌క్షంలో అన‌డ‌మే వైసీపీలో గంద‌ర‌గోళానికి దారితీస్తోంది. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఎవ‌రి యిష్టా యిష్టాలు వారివి. అలాగ‌ని వేరేవాళ్ల‌మీద రుద్ద‌న‌వ‌స‌రం లేదు. కానీ ఇది భూమ‌న స్వంత అభిప్రాయం. ఇదే ఎక్క‌డినుంచో తెచ్చుకున్న‌ది కానే కాదు. అదే ప్ర‌క‌టించ‌డం ప్ర‌మాక‌రంగా మారింది. పైగా భూమన చేసిన వ్యా ఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తక ప్రతులను శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణాకర రెడ్డి మాట్లాడారు. పదవుల కోసం తల వంచేవాడిని కాదని, పదవుల కంటే నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపడమే గొప్పగా భావించేవాడినన్నారు. ఎమర్జెన్సీ సమ యంలో అరెస్టయి జైలు జీవితం గడిపిన సమయంలో ఎందరో మహామహులతో పరిచయం కావడం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.  గొప్ప గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణం కూడా అంతే గొప్పగా ఉండాలన్నారు. గాంధీ ఆత్మకథకు సంబం ధించి విస్మరించిన ఈకోణాన్ని ఇపుడు పదేపదే చదవాల్సిన అవసరముందన్నారు. గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితు డినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను ఇపుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట నిందితుడిగా చేతులు కట్టుకుని ఒప్పుకుంటున్నానన్నారు.  2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తీరని అన్యాయం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డానన్నారు. సభ సాక్షిగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నా నన్నారు.  స‌రే, భూమ‌న త‌న త‌ప్పుల‌ను కాయండ‌ని అన్నారు. తాను త‌ప్పుచేశాన‌ని అంగీక‌రించారు. ఇది గొప్ప మ‌న‌సుకి, వ్య‌క్తిత్వానికి తార్కాణం అంటున్నారంతా. త‌ప్పును ఇలా అంద‌రి స‌మ‌క్షంలో అంగీక‌రించ‌డానికి ఎంతో ధైర్యం కావాల‌ని,భూమ‌న త‌న త‌ప్పు ను అంగీక‌రించడం చిన్న విష‌యం కాద‌ని ఏకంగా జ‌స్టిస్ ర‌మ‌ణ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు.  ప్రస్తుత రాజకీయాల తీరుపై జస్టిస్‌ రమణ వేదనా భరితమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఏవగించుకుని, అసహ్యించుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, విలువలు, నిజాయితీ కలిగిన వ్యక్తులను, అవినీతికి పాల్పడని వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముం దన్నారు. సత్యశోధన... ప్రతి రాజకీయ నాయకుడూ చదవాల్సిన మొదటి, చివరి పుస్తకంగా ఆయన అభివర్ణించారు. అయితే ఇదంతా భూమ‌న ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నాయ‌కుడిని మొట్టికాయ‌లు వేయించాల‌న్న ఆలోచ‌న‌తో చేశారా అన్న అనుమానం విశ్లేష‌కుల‌కు ఉండ‌నే ఉంది. అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో భేటీ అయి మ‌రీ త‌న మ‌న‌సులో ఏమున్న ది, ఎంత‌లా బాధ‌ప‌డుతున్నాన‌న్న‌ది స్ప‌ష్టం చేయ‌వ‌చ్చు. కానీ పార్టీ సీనియ‌ర్ల‌కు త‌న‌ను క‌లిసి చ‌ర్చించేందుకు అవ‌కాశం ఇవ్వ డం లేదా, పార్టీవ‌ర్గాల‌ను, అభిమానుల‌ను రోడ్ల‌మీద ప‌డి పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌న్న ఆదేశాల‌తోనే దూరంగా పెడుతు న్నారా, హెచ్చ‌రిక‌ల‌తో ఎలాంటి ఫిర్యాదులు, అభ్య‌ర్ధ‌న‌ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం లేదా అన్న‌ది తేల‌వ‌ల‌సి ఉంది. మంత్రులు, ఎమ్మె ల్యేలు ఇక మిగిలిన పాల‌నా కాలాన్ని ఎలాగో అలా నెట్టుకెళ్లి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి గ‌ట్టి కృషి చేసి తీరాల‌ని గ‌ట్టి హెచ్చ‌రి క‌లు చేస్తుండ‌డం, పార్టీ ప‌రంగా రాష్ట్రంలో త‌గ్గుతోన్న ప్ర‌తిష్ట కూడా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌నే అనాలి. అధికారంలో ఉండ‌గానే నాలుగు ప‌నులు చేసి న‌లుగుర్ని ఆక‌ట్టుకోవాల‌న్న ధ‌ర్మ‌సూత్రాన్ని నాలుగు రాళ్ల సంపాద‌నే అనే స్వీయ సూత్రాల ఆలోచ‌న‌తో క‌ట్టిప‌డేయ‌డం ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌కు వైసీపీ సర్కార్ దూర‌మ‌యింద‌నే విశ్లేష‌కులు అంటున్నారు.

అన్న‌కు మించి చెల్లి!

అన్న‌ద‌మ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కాచెల్లెళ్ల మ‌ధ్య కొన్ని పోలిక‌లు చిత్రంగా క‌లుస్తాయి. చ‌దువు, సంస్కారం అవ‌త‌ల పెడితే, అస‌లు వ్య‌వ‌హార‌తీరు, ఆలోచ‌నా తీరు స‌రిగ్గా న‌ప్పేట్టు ఉంటారు ఉత్త‌ర కొరియా అధినేత కిమ్, ఆయ‌ న సోద‌రి యో జోంగ్‌. అస‌లే కొరియా ద్వీప‌ క‌ల్పంలో ఉద్రిక్త‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగు తోంది. ఇక లాభం లేద‌ని ద‌క్షిణ కొరియా వారు ఒక ప్ర‌తిపాద‌న చేశారు. కానీ కిమ్ కంటే మొండివాడు ఎవ‌రుంటారు? అందుకునే ద‌క్షి ణాది వారి మాట వినేదే లే.. నేను త‌గ్గేదేలే.. అనుకుని కిమ్ అణ్వాయుధాల‌ను ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నాడు. ద‌క్షిణాదివారు ఎవ‌రికి ఏమ‌ని న‌చ్చ‌జెప్పాల‌నుకున్నారు. ముందే ఉలిపిక‌ట్టె, కోపిష్టి అలాంటివారికి పోనీ ఈ పూట వింటాడేమోన‌నుకోవ‌డినికి ఆయ‌నే మ‌న్నా పెద్ద‌బావ‌గారా.. చేప‌ల‌పులుసు తిన్న వ్యామోహంలో ఓకే అన‌డానికి! ప్రత్యర్థులపై విరుచుకుపడటంతో ఉత్తర కొరియా  అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నకు తగ్గ చెల్లెలు అనిపిం చుకుంటోంది. ఈ విషయంలో ఆయన కంటే జోంగ్ రెండాకులు ఎక్కువే చదివిందనీ తేల్చింది.  తాజాగా, చర్చల విష యమై దక్షిణ కొరియా చేసిన ప్రతిపాదనపై తనదైన శైలిలో కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చింది. అణ్వాయుధాలను వదిలిపెడితే ఆర్థిక సా యం చేస్తామని దక్షిణ కొరియా చేసిన ప్రకటనపై ఆమె ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణ కొరియా ఆఫర్‌ అని.. చర్చలపై కలలు కనడం మానుకోవాలని బదులిచ్చారు. కేవలం తిండి కోసం ఎవరూ తమ లక్ష్యాలను వదలుకోరని.. ఇదో పనికిమాలిన ప్లాన్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కొంచెం నోరుమూసుకుంటే మంచిదని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని వ్యాఖ్యానించిన కియ్ యో.. వాటిని పిల్లచేష్టలతో పోల్చారు. యూన్ ప్రతిపాదన నీలి సముద్రాన్ని ఎండబెట్టి మల్బరీ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నించినంత తెలివితక్కువగా ఉంది.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను వదిలించుకునే ఉద్దేశం లేదు.. ఇవి ఆయుధాలు రాజకీయాలకు సంబంధించిన బేర సారాలు కాదు.. యూన్ సుక్ యోల్‌ను మేం మనిషిగా ఇష్టపడం.. మేలో పదవీ బాధ్యతలు స్వీకరించిన సంప్రదాయవాద దక్షిణ కొరియా నేత విషయంలో ప్యాంగ్‌యాంగ్ కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని ప్రతిజ్ఞ చేశారు. ఒక వేళ ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదిలిపెడితే సాహసోపేతమైన చొరవ తీసుకుని ఆహారం, ఎనర్జీ, మౌలిక సౌకర్యాల సాయానికి ముందుకొస్తామని ఈ వారం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌ను ఉత్తర కొరియా తిరస్క రించింది. మరోవైపు, కిమ్ యో జోంగ్‌ వ్యాఖ్యలపై స్పందించిన దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం.. కిమ్‌ సోదరి కామెంట్లు విచారకరమని పేర్కొంది. అయినా సరే ఇప్పటికీ తమ ఆఫర్‌ అందుబాటులో ఉందని పునరుద్ఘాటించింది.

మ‌త రాజ‌కీయాల‌కంటే మునావ‌ర్ ప్ర‌మాదకారా?!

అత్త‌మ్మ తిట్టినందుకు కాదు తోటికోడ‌లు న‌వ్వింద‌ని కోప‌గించుకుందిట‌.. వెన‌క‌టి ఒకామె. అలా ఉంది ఎమ్మెల్యే రాజాసింగ్ వ్య‌వ హారం. దేశంలో మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షో అంటే గొప్ప క్రేజ్ ఉంది. ఆయ‌న త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లోనూ షో కి అంగీక‌రించ డంతో ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. టికెట్లు ఇప్ప‌టికే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. దేశంలో మునావ‌ర్ కి షారూ ఖ్ ఖాన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. మునావ‌ర్ షోని అడ్డుకుంటామ‌ని బీజేపీ ఎమ్మ‌ల్యే రాజాసింగ్, బీజేవైఎం  నేత‌లు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రతా చర్యల దృష్ట్యా శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదా స్పదంగా మారాయి. కర్ణాటక లో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్ కొనసాగుతోంది. హైదరాబాద్‌ లోనూ మునావర్ షో లు నిర్వహించకూడదంటూ రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు  పోలీసు బందోబస్తు ఉంటుందని డీసీపీ వెల్లడించారు.  దేశ‌రాజ‌కీయాల్లో స్వేచ్ఛ‌కు ఆట్టే తావు లేదు. త‌న‌కు న‌చ్చిన విధంగానే కామెంట్లు రాయాలి, చెప్పాలి, ఉద‌హ‌రించాలే గాని వేరే మార్గంలో తిట్టినా, ప్ర‌చారం చేసినా ప్ర‌భుత్వం అస్స‌లు అంగీక‌రించ‌దు. విప‌క్షాల నుంచి బూతు పురాణాన్ని విమ‌ర్శ‌నాస్త్రాలుగా అంగీక‌రిస్తున్న ప్ర‌బుత్వాలు వారి ప‌థ‌కాలు, పాల‌నా విధానాన్ని విమ‌ర్శిస్తూ చేసే కామెడీ షోకి అడ్డుప‌డ‌టం కేంద్ర ప్రభుత్వం బ‌ల హీన‌త‌నే చూపుతుంది. దేశంలో విప‌క్షాలు, ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్తితుల్లోనూ బీజేపీవారిని భ‌జ‌న చేయాల‌న్న ధోర‌ణినే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం హెచ్చ‌రించ‌డం ఇలాంటి వ్య‌తిరేక‌త‌ల‌కూ దారితీస్తున్న‌ది.  పూర్వం కార్టూన్ల‌కు నాయ‌కులు న‌వ్వుకుని అవునా, ఇలా అన్నానా.. అంటూ స‌ద‌రు కార్టూనిస్టుని, ప‌త్రిక‌నూ మెచ్చుకునే వారు. అంటే నాయ‌కుడిలో లోపాలు తెలియ‌జేయ‌డం మీడియా ప‌రిమితుల్లోనే చేస్తుంది. కానీ కామెడీ షోలు, టీవీలో వ‌చ్చే ప్ర‌త్యే క టాక్ షోల‌లో  పార్టీ లేదా ప్ర‌భుత్వ విధానాల మీద చేసే కామెంట్ల‌ను అలానే తీసుకోవాలి గాని చాలా సీరియ‌స్‌గా తీసుకు ని హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంలో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను తామే తీసుకున్న‌ట్టే అవుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. కాగా మునావ‌ర్ షో విష‌యానికి వ‌స్తే, అత‌ను భార‌తీయ‌త‌ను వెక్కిరిస్తున్నాడంటూ చేస్తున్న విమ‌ర్శ‌లు అత‌న్ని త‌ప్ప‌కుండా శిక్ష‌కు గురిచేస్తాయి. కానీ కేంద్రం అలాంటి చ‌ర్య‌లు, హెచ్చ‌రిక‌లూ జారీ చేసిన దాఖ‌లాలు లేవు. అయితే త‌మ‌ను ప‌ల్లెత్తు మాట అన్నా, చిన్న గీత అంత విముఖ‌త ప్ర‌ద‌ర్శించినా బీజేపీ బొత్తిగా భ‌రించ‌లేని ఉలిపిక‌ట్టెగా మారింది. క‌నుక మునావ‌ర్ లాంటివారి షోలు నిర్వ‌హించ‌డానికి అనేక‌మంది అనుమ‌తులు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి. దేశంలో స్వాతంత్ర్యం లో స్వేచ్ఛ లేద‌న్న‌ది బీజేపీ వార‌కే స్ప‌ష్టం చేస్తున్నారు. వారి నీడ‌న ప‌డున్నామ‌న్న ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించే రాజ‌కీయాలు దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మే. మోదీ, షా ద్వ‌యం ఇలాంటి కాషాయ‌రంగు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికితేనే మ‌న‌, మ‌న‌వాళ్లు అన్న ధోర‌ణికి ప‌ట్టు ఉంటుంది. స్వేచ్ఛ లేని చోట ప్ర‌జా జీవితం స్తంభిస్తుంది. స్వేచ్ఛ పేరుకే ఉన్న పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని,  స‌సేమీరా గౌర‌వించ‌రు.  

పనికి మాలిన పోలీసు అధికారి సునీల్ కుమార్!

న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు అధికార వైసీపీ చేయని ప్రయత్నం లేదు.. ఉపయోగించుకోని వ్యవస్థ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. గోరంట్ల మాధవ్ ను కాపాడుకోవడం కోసం తప్పుమీద తప్పు చేస్తూ వైసీపీ సర్కార్ జనం ముందు దోషిగా నిలబడింది. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో ఏం సంబంధమూ లేని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన వివరణపై తెలుగుదేశం నాయకులు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. మాజీ పోలీసు అధికారి, తెలుగుదేశం నాయకుడు అయిన వర్ల రామయ్య గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ యాదవ్ తీరు అధికార పార్టీకి కొమ్ముగాయడం కోసమే ఏపీసీఐడీ ఉందా అన్న అనుమానాలకు తావిస్తోందని   విమర్శలు గుప్పించింది.  అసలు విషయాన్ని వదలి మాధవ్ ను కాపాడేందుకు మసిపూసి మారేడు కాయ చేసే విధంగా  సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారనీ, ఆయనో పనికిమాలిన పోలీసు అధికారి అని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య అన్నారు.  మాధవ్ అశ్లీల చిత్రంపై సమగ్ర విచారణ జరిపితే ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన సునీల్ కుమార్, ఫకీరప్పతో ఈ వ్యవహరంలో మాధవ్ కు అనుకూలంగా మాట్లాడిన   పోలీసు అధికారులంతా జైలుకు వెళతారని వర్ల అన్నారు. ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్న పోలీసు అధికారులు..  ఎటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఫారిన్ ఏజన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు.  వాస్తవానికి మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంలో పోలీసుల విచారణకు ఎటువంటి ఫిర్యాదు అవసరం లేదు.  ఐపిసి సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 294 (ఎగ్జిబిషన్ ఆఫ్ అబ్ సీన్ యాక్ట్), 506 (క్రిమినల్ ఇంటిమినేషన్), 590 (ఎక్స్ పోజింగ్ అబ్ సీన్ ఆబ్జెక్ట్స్, అబ్ సీన్ వర్డ్స్ యాక్ట్ టు ఉమెన్), ఐటి సెక్షన్ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపడం పోలీసు విధుల్లో భాగమని గుర్తు చేశారు. ఆ అశ్లీల వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగినా చట్ట ప్రకారం శిక్షార్హమేనని వర్ల అన్నారు.  ఫిర్యాదు చేయకపోతే ఏమీ చేయలేమని పోలీసులు చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. పట్టాభి రిపోర్టు తెచ్చారు కాబట్టి ఆ రిపోర్టు ఒరిజినల్ కాదని చెప్పించి సిఎం కళ్లలో ఆనందం చూడాలన్న తాపత్రేయమే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లో కనబడుతోందని అన్నారు. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సునీల్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలో కూడా స్టాఫోర్డ్ ఎక్కడా ఆ నివేదిక అబద్దమని చెప్పలేదు. ఈ విషయాలు మాట్లాడుతున్న తనపై కూడా  రేపో,మాపో   కేసు పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు.   ఇక తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనిత అయితే  తప్పుడు పనిచేసిన  ఎంపీ గోరంట్ల మాధవ్ ను రక్షించాలనే తపనతో   ప్రభుత్వం పోలీసు శాఖను వాడుకుంటున్న తీరు   ‘పాపం పోలీసులు’అనిపించేలా ఉందని  అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదికను   పట్టాభి బయట పెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారని అసలు సీఐడీకి ఈ కేసు ఎవరు అప్పగించారని నిలదీశారు. సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును  పోలీసులు   డీజీపీకి రిపోర్టు ఇచ్చిన తరువాత సీఐడీకి రిఫర్ చేస్తేనే ఆ ఫైల్ సీఐడీకి వెళుతుందని అధికారులు చెప్పినట్లు తెలిపారు.  డీజీపీ, సీఐ పకీరప్ప పక్కకు వెళిపోయి, అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ బయటి కొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని ప్రశ్నించారు.  ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోనవసరం లేదని సునీల్ కుమార్ చెప్పి, ఆ ల్యాబ్ కు మెయిల్ ఎందుకు పంపిచారని నిలదీశారు.  తనకు సంబంధించి అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే గోరంట్ల మాధవ్ ఫిర్యాదు ఎందు చేయలేదని అడిగారు.  

పని తీరే ప్రామాణికం.. గెలుపు గుర్రాలకే టికెట్టు.. చంద్రబాబు స్పష్టీకరణ

పార్టీ అధినేత‌తో నాలుగు మాట‌లు మాటాడినంత మాత్రాన ఆయ‌న దృష్టిలో గొప్ప నాయ‌కుడు అయిపోరు, నాలుగు ఫోటోలు తీసుకున్నంత మాత్రాన జ‌నాల్లో ప‌ర‌ప‌తి పెరిగిపోతుంద‌నుకోవ‌డ‌మూ పొర‌పాటే. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే   పార్టీ కోసం పాటుప‌డాలి. పార్టీ విజ‌యం కోసం కృషి చేయాలి. ఎన్నిక‌లు ఏవ‌యినా స‌రే పార్టీకి త‌న వం తు కృషి చేయ‌డ‌మే పార్టీ అధినేత‌ను గౌర‌వించ‌డంతో స‌మానం. ఏపీలో మారుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల దృష్ట్యా తెలుగు దేశం పార్టీకి అధికారంలోకి రావ‌డానికే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో ఇంత కాలం పార్టీని పట్టించుకోకుండా మొహం చాటేసిన నేతలంతా మేమే తోపులం అంటూ ముందుకు వస్తున్నారు.  చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొని తమకే టికెట్ ఖరారైపోయిందంటూ లీకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఈ విషయంలో పార్టీ నాయకులకు, క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికీ టికెట్ కన్ ఫర్మ్ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. నియోజకవర్గ సమీక్షకు హాజరైనంత మాత్రాన టికెట్ కన్ ఫర్మ్ అయినట్లు కాదని, పార్టీ టికెట్ దక్కాలంటే పనితీరే ప్రామాణికమని తేల్చేశారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వ  తీరు ప‌ట్ల ప్ర‌జ లు విసుగెత్తారు. జగన్ పథకాలు, ప్ర‌కటనలు ఒట్టి డొల్ల అన్న గ్రహింపునకు జనం వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం దూకుడు పెంచింది. ప్ర‌తీ ప్రాంతంలోనూ చిన్న‌, పెద్ద నాయ‌కుల‌ను స‌మ‌ర స్పూర్తితో ముంద‌డుగు వేయా ల‌ని ఆ పార్టీ అధినే చంద్ర‌బాబునాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిగో ఈ సమీక్షలను ఆసరాగా చేసుకునే కొందరు తమకు పార్టీ టికెట్ అధినేత ఖరారు చేసుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వదంతులు వ్యాపింప చేస్తున్నారు. వీటికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టిగా చెక్ పెట్టారు.  వదంతులు నమ్మొద్దనీ, ఎవరికీ తాను పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదనీ విస్పష్టంగా చెప్పారు. ఈ సారి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారు.   పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవడం భ్రమేనని తేల్చేశారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో   భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి.. వారి పనితీరును సమీక్షించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని..పార్టీ నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో..సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. మొదటి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం,సంతనూతలపాడు నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అయ్యారు. ఆయా ఇంఛార్జ్ లతో ప్రత్యేకంగా జరిగిన ముఖాముఖిలో...పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ...నేతల పనితీరుపై చర్చించారు. నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇంచార్జ్ లతో మాట్లాడి...సూచనలు చేశారు. రానున్న ఏడాది కాలమే అత్యంత కీలక మని అలస త్వం వీడి ప్రణాళికతో పని చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే పలు కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొన డంతో పాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి పైనా స్థాని కంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.  నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు.ఫలానా వారికి పార్టీ టికెట్ ఖరారైంది అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారందరికీ టికెట్ ఖాయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని విస్పష్టంగా తేల్చేశారు. ఈ సారి తాను గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లిస్తానని స్పష్టం చేశారు. నేతల పని తీరుపై ప్రతి మూడు నెలలకు ఒక సారి సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ టికెట్ విషయంలో పని తీరే ప్రామాణికమని, గెలిచే వారికే టికెట్లని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. రానున్న రోజులలో నియోజవకర్గాల ఇన్ చార్జిలతో ఇదే తరహా సమీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. 

నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిపై  నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.  నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం విదితమే.  నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో  విచారణ కొనసాగుతోంది. అయితే  2019 నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో  బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు నిత్యానందపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిత్యానంద ‘కైలాసం’ పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు అప్పట్లో కలకలం రేపాయి. తాను ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నట్లు నిత్యానంద ప్రకటించారు. ఆ దీవికే  కైలాసం అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్‌ ప్రభుత్వం పేర్కొంది. విచారణకు హాజరు కావాలని గతంలోనూ ఆయనకు బెంగళూరులోని కోర్టు వారెంట్‌ జారీ చేయగా, ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. గతంలో నిత్యానంద స్వామి అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత భారత్ విడిచి పారిపోయారు. దీంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం 2020లో రద్దు చేసింది. బిడది ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఆయన ఆశ్రమంలో ఉంటున్న ఓ వివాహిత మహిళ 2010లో బిడది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యానందతో పాటు ఆయన శిష్యులు కొందరిని అరెస్టు చేసి రామనగర జైలుకు పంపించారు. కొంతకాలం పాటు నిత్యానంద జైలు జీవితం గడిపారు.   బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద ఆ తరువాత  2019 వరకు కోర్టు విచారణ హాజరయ్యారు.  2019 వరకు బహిరంగంగా కనిపించిన నిత్యానంద ఆ తరువాత పరారైయ్యారు. కైలాసం అనే దేశాన్ని సొంతంగా స్థాపించుకున్న నిత్యానంద ఆ  దేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రకటనలు గుప్పించారు.   దేశం వదిలిపారిపోయిన నిత్యానందకు వ్యతిరేకంగా ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.   ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది.   నిత్యానంద బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నిత్యానంద కోర్టుకు హాజరుకాకపోతే షూరిటీ ఇచ్చిన వ్యక్తి ఆస్తిని జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది అంటున్నారు. మొత్తం మీద నిత్యానందకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ కావడంతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. జాతి విద్వేష దురహంకారం!

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. జాతి విద్వేష దురహంకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  న్యూయార్క్‌ సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీ తులసీ మందిర్‌ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంన్ని కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆ ఫుటేజీల్లో స్పష్టం అవుతోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహ ధ్వంసానికి పూనుకోగా, ఆ తరువాత  మరికొందరు వచ్చి  చేరారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరువాత వారంతా రెండు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు.  ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారంతా పాతిక, 30 ఏళ్ల మధ్యవయస్కులేనని చెబుతున్నారు. కాగా ఈ ఘటనను భారత్ తీవ్రండగా ఖండించింది.  న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళింది. న్యూయార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరగడం గడిచినరెండు వారాల్లో ఇది రెండో సారి. తాజాగా దాడిలో  దుండగులు పెయింట్‌తో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.  ఆగస్టు 3న కూడా ఇదే విగ్రహంపై దాడి జరిగింది. గాంధీ విగ్రహంపై దాడి ఘటనను న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్‌ రాజ్‌ కుమార్‌ ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

టిక్కెట్ ఇవ్వలేదు.. చురకలు వేశారు!

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు .. సోమలింగం అన్నారుట వెనకటికో. ‘కుర్ర’ మనిషి. ఇప్పుడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ టికెట్ తమకు ఖరారై పోయిందని, కొందరు నేతలు చేస్తున్న సందడి,‘సోమ లింగం’ సామెతను గుర్తుకు తెస్తోంది. నిజమే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాతీర్పును కోరేందుకు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేష్ పార్టీని సన్నద్ధం చేస్తున్నారు.  మహా నాడుతో శంఖారావం పూరించిన టీడీపీ అధినేత ధరల పెరుగుదల, చార్జీల మోతకు వ్యతిరేకంగా, ‘బాడుడే బాదుడు’ వంటి కార్యక్రమాలతో  ముందుకు పోతున్నారు. మహానాడు ఉత్సాహాన్ని ముందుంచి పార్టీని పగులు తీయిస్తున్నారు.  అలాగే, నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితి స్వయంగా సమీక్షించేందుకు,ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు, నేతలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిజానికి పరిపాలన విషయంలో కానీ, రాజకీయంగా అయినా, సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, చంద్రబాబుకు కొత్త కాదు. నిజానికి, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అయినా అందరినీ సంప్రదించిన తర్వాతనే తీసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, కొందరు నాయకులు, ముఖ్యంగా నియోజక వర్గ ఇన్ చార్జిలుగా ఉన్నకొందరు   తమకు టికెట్ ఖరారై పోయిందని ప్రచారం చేసుకుంటున్నారు.    అయితే, ఈ సమావేశాలు ప్రధానంగా నియోజక వర్గంలో  పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని, ముందుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే తప్ప, అభ్యర్ధుల ఎంపిక కోసం చేస్తున్న కసరత్తు కాదని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి,  ఎన్నికలు ఇంకా రెండేళ్ళ దూరంలో ఉన్న సమయంలో ఏ పార్టీ కూడా ఇప్పుడే అభ్యర్ధులను ఖారారు చేయదు. ముఖ్యంగా  పొత్తుల విషయంలో స్పష్టత రావలసి ఉన్న నేపధ్యంలో, అలాంటి తొందరపాటు నిర్ణయం ఏ పార్టీ నాయకుడు తీసుకోరు. పొత్తుల విషయంలోనే తొందర వద్దని గట్టిగా చెప్పిన  చంద్రబాబు నాయుడు, ఇప్పుడే అభ్యర్ధులను ఎలా ఖారారు చేస్తారని, ప్రశ్నిస్తున్నారు అందులోనూ, ఆచి తూచి అడుగులు వేసే అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు, అసలే అలాంటి తప్పు చేయరని, పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి, గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత ముందుగా అభ్యర్ధులను ప్రకటించలేదని  ముఖ్య నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి, ఈ ప్రచారం వెనక కొందరు ఇంటి దొంగల కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వీస్తున్న టీడీపీ అనుకూల పవనాలను పసిగట్టి కొందరు  ఉద్దేశపూర్వకంగా వాతావరణాన్ని చెడగొట్టేందుకు, అప్పుడే టికెట్ ఖారరై పోయిందనే ప్రచారం సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఇప్పడు చంద్రబాబు నాయుడు, పని తనం బాగాలేదని భావించిన నియోజక వర్గ ఇంచార్జిలను హెచ్చరించేందుకే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు, మాజీ డిప్యూటీ స్పీకర్,  అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సహా మరికొందరు ఇన్ చార్జిలకు చంద్రబాబు నాయుడు గట్టిగా  చురకలు వేసినట్లు, పని తీరుపై తలంటు పోసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రకటించిన కార్యక్రమాల అమలులో వెనకబడిన వారిని పేరు పెట్టి మరీ చంద్రబాబు నాయుడు, గట్టిగా హెచ్చరించినట్లు చెపుతున్నారు.  నిజానికి, మండలి బుద్ధ ప్రసాద్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. చివరకు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు కూడా అయన హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఊపు తెచ్చిన, బాడుడే బాదుడు కార్యక్రమంలోనూ మండలి బుద్ధ ప్రసాద్  పాల్గొన్న దాఖాలాలు లేవు. అలాగే, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పార్టీ ఆదేశాలను బుద్ధ ప్రసాద్ అంతగా పట్టించుకోలేదని,పార్టీ నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, “పార్టీ ఆదేశాలను అందరూ పాటించాలి, ముఖ్యంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల విషయంలో ఉపేక్ష వహిస్తే సహించేది లేదు. మీ నియోజక వర్గంలో కార్యక్రమాలు నిర్వహించక పోతే, మీకంటే ఎక్కువగా పార్టీ నష్ట పోతుంది. మీ పని తీరుకు ఇవన్నీ ప్రామాణికంగా ఉంటాయి..మూడు నెలలలో మరోసారి మీతో మాట్లాడతాను, అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే, కఠిన నిర్ణయాలు తప్పవు”  అని చంద్రబాబు నాయుడు మండలి ముఖం మీదనే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవం ఇలా, ఉంటే మండలి బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవడం ఏమిటని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, స్వతహాగా కాంగ్రెస్ డీఎన్’ఎ నింపుకున్న  మండలి బుద్ధ ప్రసాద్ మరో దారి లేక తెలుగు దేశం పార్టీలో చేరారే కానీ, ఆయన టీడీపీతో ఏ స్థాయిలోనూ మమైకం కాలేదని ఆయన సన్నిహితులే అంటారు. ఆయన, పార్టీలో చేరి ఇంచుమించుగా పదేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసిన, మంచి చెడు పంచుకున్న సందర్భాలు దాదాపుగా లేవని అంటారు. అంతేకాకుండా మరోసారి, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే, టీడీపీ ఇక అవనిగడ్డఫై ఆశలు వదులుకోక తప్పదని  స్థానిక నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

మ‌రోసారి మ‌రో వెయ్యికోట్ల  అప్పు

అప్పు ఇచ్చేవాడు ఉండాలి, తీసుకునే ధైర్య‌మూ ఉండాలేగాని తీసుకోవ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కి  ఓ లెక్కా! రాష్ట్రంలో ఆర్ధిక ప్ర‌గ‌తి శూన్యం అన్న‌ది ఇప్ప‌టికీ పెద్ద చ‌ర్చ‌గానే ఉంది. ఆర్ధిక‌బ‌లం నిర్వీర్యం  కావ‌డంతో ఇక కాపురం అప్పుల మీదే సాగించాలి. అప్పుల అప్పారావు అని వెన‌క వెన‌క ఎంద‌రో జోకులు వేసుకుంటున్నా, పార్టీ వారు నొస‌ట చిట్లించినా, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కి ఇది త‌ప్ప‌ని స్థితి. మ‌ళ్లీ  రిజ‌ర్వు బ్యాంక్ నుంచి మ‌రో వెయ్యికోట్లు రుణ స‌మీక‌ర‌ణ చేశారు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దీనిప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.  దీనిపై అధికార పార్టీ, ప్రతిక్షాల  మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా  అప్పుల  విషయంలో జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేశారు. 13 ఏళ్ల కాలపరిమితితో 7.72 శాతం వడ్డీకి ఈ సెక్యూరిటీల వేలం నిర్వహిం చారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు రుణం పొందినట్టు ఆర్బీఐ వెల్లడించింది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్లలకు వేలం నిర్వహించారు. 13  ఏళ్ల కాల పరి మితితో  7.72 శాతం వడ్డీకి వేలం చేపట్టారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల రుణం పొందిం ది. దీనిపై రిజ ర్వు బ్యాంక్ అధికారిక ప్రకటన వెలువరించింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21 వరకు రూ.21 వేల 500 కోట్ల రుణాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుంది.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆరు నెలల గడ వక ముందే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా మరోసారి భారీగా రుణం తీసుకుంది. ప్రతి మంగళవారం సెక్యూరిటీల వేలాన్ని ఆర్బీఐ నిర్వహిస్తోంది. ఈ వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొని రూ.వెయ్యి కోట్ల అప్పు ను తీసుకుంది. ఇప్పటివరకు వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపి స్తోంది. ఏపీలో ప్రతి ఒక్కరిపై వేలల్లో అప్పులు ఉన్నాయని అంటోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీ పీ.. అప్పటి నుంచి పథకాల పేరుతో అప్పులు చేస్తోందని మండిపడుతోంది. కార్పొరేషన్‌ నిధులను సైతం దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తోంది. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోం ది. తాజాగా మరోమారు ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. ఎందు కోసం అప్పులు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21 వరకు రూ.21,500 కోట్ల రుణాన్ని పొం దింది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కొద్దిపాటి వెసులుబాటు మాత్రమే మిగిలి ఉంది. 6 నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా కేంద్రం అనుమతించిన మొత్తం లో భారీగా రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణం తీసుకుంది. ఈసారి 16 ఏళ్లకు 7.74% వడ్డీతో 500 కోట్లు, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు తెచ్చింది. 105 రోజుల్లోనే రూ. 31 వేల కోట్ల అప్పు సమీక రించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి  ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. ఇప్పటికే రూ. 31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. 

వీధి కుక్కా మజాకానా ..పోలీసాయ‌న్ని కాపాడింది!

ఒక పోలీసాయ‌న‌.. రాత్రి కాస్తంత పొద్దు బోయాక ఇల్లు చేరాడు. టోపీ తీసి టేబుల్ మీద ప‌డేసి  అలానే మంచం మీద ప‌డుకున్నాడు. చాలాసేప‌టికి ఇంట్లో వారు లేపితే కాస్తంత తిని  ప‌డుకు న్నాడు. అంత‌లో పేద్ధ శ‌బ్దం. బ‌య‌ట‌పెట్టిన టూవీల‌ర్ పేలిపోయింది. ప‌రుగున పోలీసాయ‌న బ‌య‌టికి వ‌చ్చేడు. బండి కాలి బొగ్గ‌యింది. త‌న‌కు తెలిసిన వెధ‌వ‌ల్ని త‌ల‌చుకున్నాడాయ‌న‌. . ఇది చాలా స‌హ‌జంగా మ‌నం చూసే సిని మాలో సీన్‌. స‌రే ఆన‌క ఆయ‌నే బెల్టు స‌ర్దుకుని వెంటాడి వాడేవ‌డినో ప‌ట్టేసుకుంటాడు. కానీ  ఈమ‌ధ్య అమృత్‌స‌ర్‌లో దాదాపు ఇదే సీన్ కానీ ఇంతగా ఏమీ జ‌ర‌గ‌లేదు. కార‌ణం ఓ కుక్క‌! అమృత్‌స‌ర్ ఎస్ ఐ దిల్బాగ్ సింగ్‌. మొన్నామ‌ధ్య అర్ధ‌రాత్రి ఇల్లు చేరాడు. స‌బ్ ఖుష‌ల్ మంగ‌ళ్ హై అన్న న‌మ్మ‌కంతో ఇంట్లో వారితో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పి ప‌డుకున్నాడు. పోలీసాయ‌న ఇంట్లోకి వెళితే బ‌య‌టికి రాడ‌న్న ధీమాతో ఇద్ద‌రు దొంగ‌స‌చ్చినోళ్లు చాలా సినిమాటిక్‌గా చీక‌ట్లో న‌క్కి న‌క్కి వ‌చ్చి జీపు చ‌క్రాల మ‌ధ్య బాంబు పెట్టి మ‌రీ జారుకున్నారు. ఇంకేముంది తెల్లారితే ఆయ‌న మ‌ర‌ణ‌వార్త చ‌క్క‌గా విన‌వొచ్చు, ప‌త్రిక‌ల్లో చూడొచ్చ‌నే అనుకున్నారు. కానీ అలా ఏమియూ జ‌ర‌గ‌లేదు. బాంబులు పెట్టిన‌వాళ్లు చేతులు చూసుకునే ఉంటారు.. ఇదే చేత్తోనే బాంబు అమ‌ర్చాం గ‌దా బావా! అని అనుకునే ఉంటారు.  వాళ్లు బాంబు అమ‌ర్చారు. కానీ అటుగా తీరిగ్గా వెళుతోన్న ఓ వీధి కుక్క వీరి  వేషాలు గ‌మ‌నించింది. వాళ్లు వెళ్ల‌డం చూసి అది కూడా అంతే భ‌యం భ‌యంగా జీపు దగ్గ‌రికి వెళ్లింది. అసలే ఆక‌లితో ఉందేమో, బాంబు ని చూసి ఏ పండో కాయో అనుకుని అమాంతం పీకి అవ‌త‌ల ప‌డేసింది. తిన్న‌దో, అది ఏమ‌యిం దో తెలియ‌లేదు. కానీ ఎస్‌.ఐ మ‌రి కొన్నాళ్లు బ‌త‌క‌డానికి మాత్రం నూక‌లు మిగిల్చింది. పోలీసాయ‌న గ‌తంలో ఏదో ఒక‌రోజు ఏ జంక్ష‌న్‌లోనో దానికి ఏ అర‌టిపండో, ఏదో పెట్టే ఉంటాడు.  అది ఇప్ప‌టికి ఫ‌లితా న్నిచ్చింది. ఇక్క‌డే దేముడున్నాడ్రా మావా ఆడే సూసుకుంటాడంతా.. అన్న సింగు గారి ప‌క్కింటాయ‌న మాటా క‌రెక్టే!

హ‌మ్మ‌య్య‌,, రంజ‌న్ దొరికాడు! 

ఫ‌లానా ఆయ‌న కాశ్మీరు వెళ్లారు, ఫ‌లానా ఆయ‌న మౌంట్ అబూ వెళ్లార‌ని చెప్పుకుంటూ వారి యాత్రా క‌థ‌నాలు విన‌డానికి స్నేహితులు, బంధువులు ఎదురుచూస్తుంటారు. కానీ, బీహార్ మాజీ ఎమ్మెల్యే రంజ‌న్ తివారీ కోసం ఎవ‌రు ఎదురు చూడ‌లేదు.. పోలీసులు త‌ప్ప‌! అవును. చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీద‌నే కాల్పులు జ‌రిపి పారిపోయాడీ ఘ‌నుడు. అలా వెళ్లిన‌వాడు నిన్న‌నే భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌ట్టుబ‌డ్డాడు.  పోలీసులు తివారీ కోసం 1988 నుంచి వేటాడుతూనే ఉన్నారు. అడిగో, ఇడిగో అంటున్నారే గాని ఎక్క‌డా దొర క్కుండా త‌ప్పించుకుని త‌న యాత్ర మాత్రం కొన‌సాగించేడు తివారి. బీహార్ తూర్పు చంపార‌న్ జిల్లా గోవింద్గంజ్ మాజీ ఎమ్మెల్యే రంజ‌న్ తివారీ గోర‌క్‌పూర్‌లో పోలీసుల‌పై కాల్పులు జ‌రిపారు. ప‌ట్టు బ‌డకుండా త‌ప్పించుకు పారిపోయాడు. కానీ వెంబ‌డించేవారు ఆయ‌న స్నేహితులు కారు.. పోలీసులు. ఏ మాత్రం విసిగెత్త‌కుండా రెండు ద‌శాబ్దాలుగా వేటాడేరు. ఎవ‌రికి క‌నిపించినా ప‌ట్టివ్వండి అని ఏకంగా రూ.25 వేలు బ‌హుమానంగానూ ప్ర‌క‌టించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ పోలీసులు క‌లిసి రంజ‌న్ వేట కొన‌ సాగించారు.  మొత్తానికి ఇర‌వ‌య్యేళ్ల ప్రయత్నాలు ఫ‌లించాయి. ఉత్తరప్రదేశ్  పోలీసులపై  కాల్పులు జరిపిన కేసులో  రంజన్ తివారీ తాజాగా భారత్-నేపాల్ సరిహద్దులో పట్టుబడినట్టు చెప్పారు. ప్రాథమిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయనను యూపీ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా ఖ‌ట్మండ్  పారిపోవాలని ప్లాన్ చేశారని రక్సౌల్ ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.

రామోజీతో అమిత్ షా భేటీ.. ఆంతర్యం ఏమిటి?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు. దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిరువురి భేటీ అజెండా ఎమిటన్నది ఇతమిద్థంగా తెలియరాలేదు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీజేపీల మధ్య సత్సంబంధాలు నెలకొనే వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రామోజీరావు, అమిత్ షాలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్యా భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం బీజేపీ- టీడీపీ మధ్య సంబంధాలే అని అంటున్నారు. బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు పార్టీలకూ అవసరమన్నది విశ్లేషకులు మాట. బీజేపీ ముందున్న లక్ష్యం తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం అయితే.. తెలుగుదేశం ఏకైక లక్ష్యం ఏపీలో వైసీపీని  మట్టి కరిపించి అధికారంలోకి రావడం. ఇందుకు ఏపీలో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకీ, తెలంగాణలో తెలుగుదేశం అవసరం బీజేపీకి ఉందన్నది వారు బెబుతున్న  మాట. అది వాస్తవం కూడా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లీడర్ కొరత ఉన్నా క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉందన్నది అందరూ అంగీకరించే మాట. చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే ఆ ప్రభావం తెలంగాణలోని కనీసం పాతిక నియోజకవర్గాలలో బలంగా ఉంటుంది. ఆ బలమే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీకి అవసరం. అలాగే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే.. జనసేన సహకారం అవసరమనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా ఉండేందుకు ఇది అనివార్యమనీ విశ్లేషకులు అంటున్నారు. జనసేన తెలుగుదేశంకు దగ్గర కావాలంటే.. బీజేపీ నుంచి అభ్యంతరాలు ఉండకూడని పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ సహకారం ఏపీలో తెలుగుదేశం పార్టీకి అవసరం. ఆ పరస్పర అవసరాలే అనివార్యంగా రెండు పార్టీలనూ దగ్గరకు చేరుస్తున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే రామోజీరావుతో అమిత్ షా భేటీ కానుండటం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఒకసారి అమిత్ షా రామోజీరావుతో భేటీ అయ్యారు. అప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా  ఉన్నారు. అప్పుడు కూడా అమిత్ షా తాను స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇప్పుడు కూడా అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రామోజీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై .. రామోజీరావుతో అమిత్ షా ఈ బేటీలో  చర్చ జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  

ఇదేం స్వాతంత్య్రం. ఇదేమి స్వేచ్ఛ‌? ..  స్మిత స‌బ‌ర్వాల్‌

వంట‌చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, అస‌లు ఏ ప‌ద‌విలో ఉన్నా, మంచి మ‌న‌సున్న మ‌హిళ‌లు ఎవ్వ‌రూ మ‌న‌సుకు క‌ష్టాన్ని క‌లిగించే అంశాన్ని ఊరికే వ‌దిలేయ‌రు. గ‌ట్టిగానే తిర‌స్క‌రిస్తారు, వ్యాఖ్యానిస్తారు, కొంద రైతే తిట్టినా తిడ‌తారు. కానీ స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయం లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బిల్కిస్​ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార టీఆర్‌ఎస్ పార్టీ  కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.  రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పెట్టడంపై తనకు నమ్మకం కలగడం లేదంటూ వరుస ట్వీట్లు చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా తాను ఈ వార్త  చూసి ఆందోళన చెందానంటూ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ లో ఉన్నా కూడా మాకు మాట్లాడే  హక్కు ఉందంటూ స్మితా పేర్కొనడం కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఐఏఎస్ అధికారిణిగా సర్వీ సులో ఉన్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో  ఆమె చేసిన ట్వీట్ అధికార, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికారి అయినంత మాత్రాన ఇటువంటి సంద‌ర్భాల్లో మౌనంగా ఉండ‌ మంటే ఎలా?  అధికారిలోనూ మాన‌వ‌త్వం ఉంటుంది, తోటి మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయానికి తిర‌గ‌బ‌డే త‌త్వం ఉంటుంది. దోషుల‌ను విడుద‌ల చేయ‌డం అదీ స‌త్ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల అంటూ టాగ్ పెట్ట‌డం ఆమెను నిజం గానే ఆగ్ర‌హానికి గురిచేసి ఉంటుంది.  బిల్కిస్ వివాదం పై శుక్రవారం మరో ట్వీట్ చేశారు స్మితా సభర్వాల్. భయాందోళనలకు గురి కాకుండా.. స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయిందని ట్వీట్‌లో ఆవే దన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేమని  స్మిత  సబ ర్వాల్ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా బిల్కిస్ బానో అనుభవిస్తోన్న గాయాల బాధ మరోసారి చెలరేగిందని బిల్కి స్ బానో చెప్పారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసిన 11 మంది దోషులు జైలు నుంచి విముక్తు లు అయ్యారని తెలిసి, మాటలు రావట్లేదని రాసుకొచ్చారు. మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన  వారంద రూ సమాజంలో అడుగు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది. ఇంత కాలం‘నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు’ అన్నట్లు వ్యవహరించిన  తెలంగాణ కాంగ్రెస్ నేతలు..  తీరా పార్టీ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న సమయంలో.. గ్రూపులు కట్టి మరీ పరువును నడిబజారులోకి ఈడ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షపాత్ర పోషించకపోవడమే కాకుండా.. బీజేపీ బలపడేందుకు కాంగ్రెస్ నేతలే ఒకరకంగా కారణమనే విశ్లేషణలు వస్తున్నాయి. అయినా.. కాంగ్రెస్ నేతల్లో అస్సలు రిపెంటెన్స్ కనిపించడం లేదని అంటున్నారు.  టీ. కాంగ్రెస్ లో ఇప్పుడొకరు తాను ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటుంటే.. మరొకాయన నేనే  పెద్ద తోపు.. తురుం అని చెప్పుకుంటున్నారు. అలా వారు చెప్పుకోడానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం ఇష్టం లేకపోవడమే కారణమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా ఇన్నేళ్లుగా నోరెత్తి ప్రశ్నించని కాంగ్రెస్ బడా నేతలు.. రేవంత్ రెడ్డి చేసే పోరాటంలో తప్పులు వెతికే పనిలో పడ్డారని సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయిస్తే అన్న వెంకట్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడ లేదని, కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు అయిన బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరడం వెనుక సొంతపార్టీని బలహీనపరిచే కుట్ర ఉందని పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. ఇదంతా గమనించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయారు. పార్టీకి నష్టం కలిగిస్తే కబడ్దార్ అంటూ  వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఊరుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడులో సభ పెట్టి, లాగి బండకేసి కొడతా అన్నారు. మరో నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏకంగా పార్టీ నుండి వెళ్లిపొమ్మని పరుష పద జాలంతో విమర్శలు గుప్పించారు. దీంతో రగిలిపోయిన వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం ఓ మెట్టు దిగిన రేవంత్ రెడ్డి సారీ కూడా చెప్పారు. అయితే.. రేవంత్ రెడ్డి సారీ తనకు చాలదని.. దయాకర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలనే కొత్త షరతును వెంకటరెడ్డి తెరమీదకి తీసుకువచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న  పరిణామాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ నేతల చిల్లర పంచాయితీతో జనం విసుగెత్తిపోతున్నారు. వారి తీరు పక్క పార్టీలకు మేలు చేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ పాత కాపులు చంపి, పాతరేసిన సమయంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. అధికార పార్టీ నేతలను ఓ రేంజ్ లో ఎండగడుతున్న రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంతే టార్గెట్ గా పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ముందు బయటికి వెళితే.. అన్న వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉండి చేయగలిగినంత నష్టం చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  కోమటిరెడ్డికి అసలు రేవంత్ రెడ్డి సారీ ఎందుకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి యాభై కోట్లు పెట్టి కొన్నారని ఆ మధ్యన రేవంత్ రెడ్డి, మాణిక్ ఠాగూర్ పై విమర్శలు చేసిన వెంకటరెడ్డిని అనాడే సస్పెండ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. ఎంతమంది ఎన్నిసార్లు అవమానించినా రేవంత్ రెడ్డి పార్టీ కోసం సర్దుకుపోయారే తప్ప చేతకాక కాదని ఆయన వర్గీయులు అంటున్నారు. పీసీసీ పీఠం దక్కలేదన్న ఉక్రోషంతోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇది స‌మాజం సిగ్గుప‌డాల్సిన స‌మ‌యం 

అడ‌వి మృగాలు అనేకం. మాన‌వ స‌మాజంలోనూ మృగాలున్నాయి. రెండుకాళ్ల‌మీద న‌డుస్తాయి, ఆక‌లేస్తే అన్నం తిన్నా తిన‌క‌పోయినా, శ‌రీరానికి ఆక‌లేస్తే మాత్రం విరుచుకుప‌డ‌తాయి. వ‌య‌సు, తార‌ త‌మ్యాలూ మ‌ర్చిపోతారు. దారుణానికి ఒడిగ‌డుతున్నామ‌న్న ధ్యాస ఉండ‌దు క‌నుక మ‌నుషులు అని అన‌లేం. కానీ మ‌న‌మ‌ధ్య‌నే తిరుగుతున్నారు. వీళ్ల‌కి చ‌ట్టం, పోలీసులు, లాఠీలు, జైళ్లూ.. అస‌లు ఉరిశిక్ష అన్నా పెద్ద‌గా భ‌యం లేద‌నే అనిపిస్తుంది. ఇటీవ‌లి కాలంలో వీరి సంఖ్య‌, కేసులు, బాధితుల మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇది స‌భ్య‌స‌మాజం అవ‌మానంతో త‌ల‌దించుకోవాల్సిన స‌మ‌యం. న‌గ‌రం లోనో, ప‌ట్ట‌ణం లోనో, మారుమూల గ్రామంలోనో ఒక అత్యాచారం జ‌రుగుతుంది. అది కేసు అవుతుంది. త్వ‌ర‌గానో, కొంత ఆల‌స్యంగానూ ఒక‌రిద్ద‌రినో, ఒక్క‌డినో పోలీసులు ప‌ట్టుకుంటారు. కానీ చ‌ట్టాల లొసు గులు అనే తార్రోడ్డు ఏకంగా జైళ్ల‌లోంచి వారు నిదానంగానే పాన్ తింటూ బ‌య‌టికి వ‌చ్చేంత‌గా ఉప‌యోగ‌ ప‌డుతున్నాయి. ఇంతకంటే అన్యాయం మ‌రోటి ఉండ‌దు.   కాలుకు కాలు, చేతికి చేయి తీసేసే చ‌ట్టం కేవ‌లం  సినిమాల్లో  పెద్ద హీరోగారు  చేస్తేనే  ఆమోద‌యోగ్యం. బ‌యట ఎవ‌రు చేసినా వారికీ జైలే!  కేసు పూర్వాప‌రాలు చ‌ర్చించి న కోర్టులు వేసే శిక్షతోనే ఆ అఘాయి త్యానికి ప్రాణం విడిచిన అమ్మాయి, మ‌హిళ‌కు శాంతి క‌లుగుతుందా అన్న ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రూ స‌మాధానం ఇవ్వ‌రు, ఇవ్వ‌లేరు. కానీ నిందితులు అని నెంబ‌ర్ల‌తో బోర్డు క‌ట్టిన వారిని మాత్రం కొన్నాళ్ల‌కు విడుద‌ల చేసి.. ఇక‌నైనా చ‌క్క‌గా బ‌త‌కండ‌ర్రా.. అని  మ‌రీ బ‌డికి పంపిన‌ట్లు మ‌ళ్లీ స‌మాజంలోకే వ‌దులుతున్నాయి కోర్టులు, జైళ్లు! బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష ప‌డిన 11మందీ జైల్లో ఎంతో స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో మెలిగార‌ట‌. అంచేత వారిని విడిచిపెట్టారు.  గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోను, 2002 గోద్రా అల్లర్ల సమయంలో సామూ హిక అత్యాచారం చేశారు. నాడు ఆమెకు 19 ఏళ్లు. తన రెండేళ్ల కూతురితో పాటు మరో 14 మంది బంధు వులను కూడా చంపేశారు. బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఒకరైన రాధేశ్యాం షాహా, 15 ఏళ్లు కారాగారంలో  ఉ న్నందున శిక్షను తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది గా గుజరాత్ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఇలాంటి అద్బుతాలు మ‌న దేశంలోనే జ‌రుగుతాయి. అం దుకే ఎవ‌రు ఎంత ఘోరానికి పాల్ప‌డినా పారిపోవ‌డాలు, త‌ప్పించుకోవడం చేయ‌రు. వీల‌యితే నేరుగా పోలీసు స్టేష‌న్‌కే వెళుతున్నారు. స‌త్కారాలు, తిండి బాగుంటాయి గ‌నుక‌. కొన్నాళ్లు క‌ళ్లు మూసు కుంటే వారే అబ్బే పొర‌పాటు ప‌డ్డాం.. వీడు నిఖార్స‌యినోడు.. అని స్టాంప్ వేసి మ‌రి బ‌య‌టికి పంపేస్తారు.. ఇం దుకే అస‌లు చ‌ట్టాల‌మీద‌, పోలీసు వ్య‌వ‌స్థ మీదా సామాన్యుల‌కు బొత్తిగా న‌మ్మ‌కం పోయింది.  ఆమ‌ధ్యెపుడు మ‌హారాష్ట్రలో దూడ‌ను దొంగ‌త‌నం చేసేడ‌ని ఒక కుర్రాడిని రైతు తిట్టి కొట్టి వ‌దిలేశాడు. పోలీసులు మాత్రం చిత‌క‌బాది జైల్లో ప‌డేసారు. అత‌న్ని వ‌దిలేరో లేదో ఇంకా తెలియ‌లేదు. కానీ బిల్కిస్ బానో కేసులో నిందితుల‌ను మాత్రం వ‌దిలేశారు. ఆ హీరోలు వీరే...జస్వంత్ నాయీ, గోవింద్ నాయీ, శైలేశ్ భట్, రాధేశ్యామ్‌సాహా, విపిన్ చంద్ర జోషి, కేశర్ భాయీ వొహా నియా, ప్రదీప్ మోడియా, బాకా భాయీ వొహా నియా, రాజూ భాయీ సోనీ, మితేశ్ భట్,  రమేశ్ చందన,  గీత. 11 మంది దోషులు 14 ఏళ్ల శిక్షను పూర్తి చేసుకున్నారు. చట్టప్రకారం కనీసం 14 ఏళ్లు జీవితకాల శిక్ష అనుభవించిన వారు శిక్షను తగ్గించమని విజ్ఞప్తి చేయొచ్చు. ఖైదీల అర్హతల ఆధారంగా ప్రిజన్ అడ్వైజరీ కమిటీ సలహా మేరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంద‌ని గుజరాత్ హోంశాఖ అద నపు కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపినట్లు. సుప్రీం కోర్టు సూచన మేరకు పంచమహాల్ కలెక్టర్ సుజల్  నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. బిల్కిస్ బానో కేసు జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సలహా మేరకు వారిని విడుదల చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వు లు జారీ చేసింది. అంటే జైల్లో చెట్ల పెంప‌కం, అంట్లు తోమ‌డం వంటివి చేసే స‌త్పు రుషులు అనిపించు కున్నారా అని దేశ‌మంతా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద విమర్శలు వస్తున్నాయి.  బిల్కిస్ బానో కేసు కంటే తక్కువ తీవ్రత కలిగిన నేరాలు చేసిన వారు జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. బిల్కిస్ బానో దోషు లను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా వ్యవస్థ మీద బాధితులకు నమ్మకం పోతుంది' అని మానవ హక్కుల లాయర్ షంషద్ పఠాన్ పీటీఐతో అన్నారు.  మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు.

ఆర్ఎస్ఎస్ ఆదేశాలు మోడీషా లెక్క చేయరు..!

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం లేకపోవడాన్ని పరిశీలకులు సైతం అనూహ్య పరిణామంగానే పరిగణిస్తున్నారు. మోడీ కేబినెట్ లో అమిత్ షా తరువాత గట్టిగా వినిపించే పేరు నితిన్ గడ్కరీ మాత్రమే. అంతే కాదు ఆయన నాగపూర్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. నాగపూర్ పెద్దలు అనగానే ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అన్న విషయం తెలిసిందే. మోడీ 2.0కు ముందు ప్రధాని పదవి కోసం ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీ పేరును ఒకింత సీరియస్ గానే పరిగణించింది. ఆర్ఎస్ఎస్ మార్గదర్శనం, ఆదేశం, సూచనలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నడుస్తుంటుందన్నది పెద్దగా రాజకీయ పరిజ్ణానం అవసరం లేని వారికి సైతం అవగాహన ఉన్న అంశం. అయితే అదంతా గతం.. ఇప్పుడు బీజేపీ సర్కరా్ మొత్తం డబుల్ ఇంజిన్ (మోడీ, అమిత్ షా) కనుసన్నలోనే సాగుతోందన్నది జగద్వితితం. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ తో ఉన్న ఆ యస్ బాస్ బంధాన్ని మోడీ షా ద్వయం విచ్ఛిన్నం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా? ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ నాగపూర్ ఆదేశాలను ఖాతరు చేయడం లేదనడానికి గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం లేకుండా పోవడమే తార్కానమని చెప్పడానికే. ఇంతకీ గడ్కరీ పట్ల మోడీకి లేదా మోడీ షా ద్వయానికీ ఎందుకంత ఆగ్రహం అంటే ఎవరైనా వెంటనే గడ్కరీ ఒక్కరే మోడీ కేబినెట్ లో ఎంతో కొంత స్వతంత్రంగా పని చేసే మంత్రి కావడమే అని చెబుతారు. అయితే అది కొంత వరకూ మాత్రమే వాస్తవం, పూర్తి వాస్తవమేమింటంటే.. ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం తో బాటు.. నాగపూర్ కు సన్నిహితంగా ఉంటారు. ఆయనకు మోడీ, షాల ఆదేశాల కంటే నాగపూర్ (ఆర్ఎస్ఎస్) ఆదేశాలే శిరోధార్యం. ఆయనకునచ్చని వ్యవహారం ఉంటే మోడీ, షాలను విమర్శించేందుకు కూడా ఇసుమంతైనా వెనుకాడరు. అటువంటి గడ్కరీకి పార్టీ అత్యున్నత నిర్ణాయక బోర్డులో స్థానం లేకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ వర్గాల కథనం ప్రకారం గడ్కరీకి చాలా కాలం కిందటే.. ఆర్ఎస్ఎస్ ఆదేశాలను, సూచనలనూ స్వీకరించి, ఔదాల్చే పరిస్థితిలో మోడీ సర్కార్ లేదని అర్ధమైంది. అందుకే ఇటీవల రాజకీయాలపై తన వైరాగ్యాన్ని బాహాటంగా వెల్లడి చేశారు. అలా వెల్లడించడం ద్వారా పార్టీలో తన ప్రధాన్యతను తనంత తానుగానే తగ్గించేసుకున్నారు. రాజకీయాల్లో విలువలు పతనమయ్యాయి, అధికారం కోసం ఎంతకైనా తెగబడి పరిస్థితి దాపురించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. నేరుగా మోడీ, షా ద్వయాన్ని ఉద్దేశించినవేనని విపక్షాలు నిర్ధారించేశాయి. అయినా కూడా గడ్కరీ విపక్షాల సూత్రీకరణను ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు.  ఈ పరిస్థితులను, పరిణామాలను గమనించిన వారెవరికైనా పార్లమెంటరీ బోర్డులో గడ్కరీ స్థానం గల్లంతవ్వడం ఆశ్చర్యం కలిగించదు.. సరికదా ఆయన ఇంకా మోడీ కేబినెట్ లో కొనసాగుతుండటమే ఆశ్చర్యం కలిగించక మానదు. ముఖ్యంగా మహారాష్ట్ర పరిణామాల తరువాత గడ్కరీకి పార్టీలో, ప్రభుత్వంలో తన స్థానం ఏమిటన్నది ప్రస్ఫుటమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనమైన రోజుల వ్యవధిలోనే గడ్కరీ రాజకీయ నిర్వేదం ప్రకటించారు. కేబినెట్ లో తన స్వతంత్ర వైఖరి తన పదవికీ, ప్రాధాన్యతకూ ఎసరు పెట్టక తప్పదని ఆయనకు నాడే అర్ధమై ఉంటుందని పరిశీలకులుఅంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు చేస్తున్నది అశ్వమేథ యాగం.. పూర్వం రాజులు తమ రాజ్య విస్తరణ కోసం ఈ యాగం చేసే వారట. ఒక గుర్రాన్ని వదిలి అధి తిరిగిన ప్రాంతమంతా తమ అధీనంలోకి తీసుకునే వారట. తమ ఆధిపత్యాన్ని అంగీకరించని వారు ఆ గుర్రాన్ని బంధిస్తే అక్కడ యుద్ధం చేసి గెలిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే వారన్నమాట. ఇప్పుుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలోనేఅత్యంత పెద్ద డెమొక్రటిక్ కంట్రీలో బీజేపీ ఒకదాని తరువాత మరొకటి అన్నట్లుగా రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల ఏర్పాటు కోసం సరికొద్ద అశ్వమేధ యాగం చేస్తోంది. ఇందు కోసం ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలన్ని కూలుస్తోంది. అధికార పార్టీలో చీలికలను ప్రోత్సహిస్తోంది. తిమ్మిని బమ్మిని చేస్తోంది. ఏం చేసైనా సరే రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంటే చాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ విషయాన్నే గడ్కరీ ఎత్తి చూపారు. అధికారం కోసం ఎంతకైనా తెగించేయడమేనా అని ప్రశ్నించారు. ఫలితం అనుభవించారు అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటమే కాకుండా మూడో సారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉండటం ఇదే తొలిసారి అని అంటున్నారు. అటువంటి ఘనత సాధించిన మోడీ అధికార పరిధిని, విస్తృతిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎలా అన్నది బీజేపీ శ్రేణుల ప్రశ్న. మొత్తం మీద ఇప్పుడు నాగపూర్ తెరవెనుక మద్దతు మోడీ సర్కార్ కు అవసరం లేదు. ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చాటేందుకే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం ఇవ్వకుండా అవమానించడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే గియితే త్వరలోనే మోడీ కేబినెట్ లో కూడా గడ్కరీ స్థానం గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ అని కూడా అంటున్నారు. ప్రశ్నించే వారూ, పోటీకి వచ్చేవారూ కనుచూపు మేరలోనైనా ఉండడానికి మోడీ షా ద్వయం అంగీకరించదని అంటున్నారు.