మనుగోడులో విజయమే లక్ష్యం.. కీలక వేళ కలహాలా.. టీకాంగ్రెస్ నేతలకు ప్రియాంక దిశా నిర్దేశం
posted on Aug 23, 2022 8:04AM
మునుగోడు ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని ప్రియాంక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం(ఆగస్టు 22) సాయంత్రం 10 జన్‌పథ్‌లో ప్రియాంక గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మాణిక్యం ఠాగూర్‌తో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, మునుగోడు ఎన్నికలపై చర్చించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విషయాల మీదా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మునుగోడులో విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని ప్రియాంక దిశా నిర్దేశం చేశారు. కీలక సమయంలో కలహాలేమిటని మందలించారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా సీనియర్ నేతలకు మీడియాతో మాట్లాడారు.ప్రియాంక గాంధీతో సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందన్నారు. త్వరలో అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు. సమష్టిగా కృషి చేసి మునుగోడులో కాంగ్రెస్ అబ్యర్థిని గెలిపించాలని, క్రమశిక్షణతో మెలగాలనీ ప్రియాంక సూచించారని చెప్పారు.
వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత, తమ పార్టీ కార్యకర్త అన్న రేవంత్, సమయాభావం వల్ల ఆయన ఈ సమావేశానికి రాలేదని సమర్ధించుకున్నారు. వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఆయనను కూడా సంప్రదిస్తామని చెప్పారు.
ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి పర్యవేక్షిస్తారని మధుయాష్కిగౌడ్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ప్రియాంక పాల్గొంటారని, తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ముందుగా అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం దృష్టి పెట్టిందని వివరించారు. నేతల మధ్య చిన్నచిన్న స్పర్ధలు మినహా విభేదాల్లేవు ఆయన చెప్పుకొచ్చారు. సమావేశంలో ప్రియాంక గాంధీ నేతలతో విడివిడిగా మాట్లాడారని వెల్లడించారు. భేటీకి హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తాను, దామోదర రాజనర్సింహ వెళ్లి మాట్లాడతామని మధుయాష్కీ అన్నారు.