ఉగ్ర కేసులో ఇమ్రాన్ కు ముందస్తు బెయిలు
posted on Aug 22, 2022 @ 5:10PM
పాకిస్థాన్ లో అధికారం పులి మీద స్వారీ లాంటిదని అంటారు. అధికారంలో ఉన్నంత కాలం ఎదురు లేకుండా సాగినా ఒక సారి అధికారం కోల్పోయిన తరువాత పాకిస్థాన్ లో మనుగడ దినదిన గండంగా మారిపోతుంది.
పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం మేడిపండు చందమని చెబుతుంటారు. అక్కడి సైనికాధికారుల మద్దతు ఉన్నంత వరకూ పాక్ అధ్యక్షలకు పాలన నల్లేరు మీద బండి నడకేననీ, ఒక సారి సైనికాధికారుల సానుకూల దృష్టి నుంచి బయటకు వచ్చారా.. ఇక వారికి చుక్కలు కనిపిస్తాయనీ అంటుంటారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుల పరిస్ధితిని గమనిస్తే అది వాస్తవమేనని రూఢి అవుతుంది. ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
అధికారం కోల్పోయిన తరువాత ఆయన అడుగడుగుకూ ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనపై ఉగ్ర కేసు నమోదైంది. శనివారం (ఆగస్టు 20) ఇస్లామాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ సహా పలు ప్రభుత్వ సంస్థలను బెదరించేలా ప్రసంగించారంటూ ఆయనపై ఉగ్ర కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిలు ఇవ్వాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు.
ఇమ్రాన్ బెయిలు పిటిషన్ విచారించిన ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. గురువారం వరకూ ఈ కేసులో ఆయనను అరెస్టు చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇమ్రాన్ ఖాన్ పై మోపిన అభియాగాలు అక్రమమని ఇమ్రాన్ తరఫు న్యాయవాది వాదించారు.
అవినీతి, అవినీతి రాజకీయ నాయకులపై విమర్శలు చేసినందుకే ఇమ్రాన్‌ఖాన్‌పై కేసులు బనాయించారని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ పోలీసులు నమోదు చేసినతప్పుడు అభియోగాలతో ఇమ్రాన్ నుఅరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు గురువారం వరకూ అరెస్టు చేయరాదని ఆదేశాలు ఇచ్చింది.