ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర?.. బీజేపీ ఆరోపణలు

తెలంగాణా అన‌గానే కేసీఆర్‌, బ‌తుక‌మ్మ అన‌గానే క‌విత అని యావ‌త్ తెలంగాణా ప్ర‌జ ఠ‌క్కున  గుర్తు తెచ్చుకుంటారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్థాయినుంచి కేంద్రంలో త‌న ప్రాభ‌వం చూప‌డానికి విశ్వ య‌త్నం చేస్తుండ‌గా ఊహించ‌నివిధంగా క‌విత‌క్క యావ‌త్ తెలంగాణా ప‌రువు మ‌ద్యం పాల‌సీ వ్య‌వ‌హా రం లో క‌లిపేశారు. తెలంగాణ ఒక్క‌సారిగా ఖంగారుప‌డింది.. మ‌న క‌విత‌క్క  మ‌ద్యం పాల‌సీ కుంభ కోణం లో అనుమానితురాలా.. అని. వీలు దొరికితే, చిన్న అవ‌కాశం దొరికితే తండ్రీ కుమార్తెల‌ను ఎండ‌గ‌ట్ట డానికి ఎల్ల‌పుడూ సిద్ధంగా ఉన్న బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడో బ్ర‌హ్మాస్త్రం దొరికిన‌ట్ట‌యింది. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణంలో ఏకంగా క‌విత భ‌ర్త త‌ర‌ఫు బంధువుల ప్రేమం ఉంద‌న్న స‌మాచారం బ‌య‌ట‌ప‌డింది. దీంతో దీని వెనుక క‌విత హ‌స్తం ఉంద‌ని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.  ఈ మేరకు.. ఢిల్లీ (వెస్ట్‌) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆదివారం(ఆగస్టు 21) ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిం దని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని   ఆరో పించారు. తెలంగాణాలో, ప‌శ్చిమ‌బెంగాల్‌లోనూ ఇలాంటి విధాన‌మే ఉండ‌డంతో బీజేపీ ఆరోపణలు బలం చేకూరినట్లైంది.   తెలంగాణాకి చెందిన ఒక వ్య‌క్తి ఢిల్లీ ఒబెరాయ్ హోట‌ల్లో ఆర్నెల్ల‌పాటు రూమ్ బుక్ చేయ‌డం, అత‌నే ఏకంగా ప్రైవేటు విమానం ఏర్పాటు చేసిన మ‌రీ కేసీఆర్ కుటుంబ‌స‌భ్యు ల‌ను ఢిల్లీకి తీసుకురావ‌డం ఏమిట‌ని బీజేపీ నేత వ‌ర్మ ప్రశ్నించారు.  అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవి గోపీ కృష్ణ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులతో పాటు లిక్కర్‌ మాఫి యా, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆ గదిలో జరిగిన చర్చల్లోనే ఒప్పందం  కుదుర్చుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.  కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఇలాంటి విధానాన్నే పంజాబ్‌లో అమలు చేయించారనీ. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసో డియాతో కలిసి ఢిల్లీకి కూడా ఒక  ప్రణాళిక రూపొందించారనీ ఆరోపించారు. మద్యం మాఫియా కమీషన్‌ను పెంచడానికి చేసుకున్న రూ.150 కోట్ల ఒప్పందంలో తొలి విడత చెల్లింపు మనీశ్‌ సిసోడియాకు అందిం ద‌నివారు ఆరోపించారు. తెలంగాణ సీఎం కుటుంబసభ్యులను సిసోడియా కలిశారా లేదా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని.. నిజాలు అంగీకరించి,   వాస్తవాలను కోర్టు ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  ఇదిలా ఉండ‌గా, హైద‌రాబాద్ కోకాపేట‌కు చెందిన మ‌ద్యం వ్యాపారి అరుణ్ రామ‌చంద్ర పిళ్లైను ఢిల్లీకి కేసీఆర్ త‌న‌య క‌వితే తీసుకువ‌చ్చార‌ని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సింగ్‌ సిర్సా ఆరోపించారు. ఆమె ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో జ‌రిపిన స‌మావేశాల త‌ర్వాత‌నే పంజాబ్‌, తెలంగాణాలో ఉన్న మ‌ద్యం విధానాల‌ను ఆప్ నేత‌లు ఢిల్లీలోనూ అమ‌లు చేశార‌ని పేర్కొన్నారు. మద్యం వ్యాపారుల కమీషన్‌ను  12 శాతానికి పెంచడంతో పాటు, ఆక్షన్‌ లేకుండా హోల్‌సేల్‌ లైసెన్స్‌లు మంజూరు చేశారని మండిపడ్డారు.  కాగా,  కవిత, అరుణ్‌ రామచంద్రపిళ్లైతో పాటు అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, కవిత భాగ స్వామిగా ఉన్న అనూస్‌ బ్యూటీ పార్లర్‌ డైరెక్టర్‌, ఆమె పీఏ బోయినపల్లి అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ సోదరికి అల్లుడైన శరణ్‌ రెడ్డి తరచూ ఢిల్లీ వచ్చి ఈ డీల్స్‌ నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరబిందో శరత్‌చంద్రారెడ్డికి చెందిన చెందిన ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌.. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించి ఐదు చిన్న కంపెనీలకు ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌- బిడ్‌ వేసేటప్పుడు చెల్లించే సొమ్ము) చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఐదు కంపెనీల పేర్లనూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించడం గమనార్హం. కానీ ఇంత జ‌రిగినా తెలంగాణా సీఎం కేసీఆర్ కు చీమ‌కుట్టిన‌ట్ల‌యినా లేద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నా యి. మ‌ద్యం కుంభ‌కోణంలో ఆయ‌న త‌న‌య పాత్ర‌ను దేశ‌మంతా అనుమానిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న మా త్రం మౌనం వ‌హిస్తున్నారు. కవిత డీల్‌ కుదుర్చుకున్న తర్వాతే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ను కేసిఆర్‌ కలుసుకోవడం, పంజాబ్‌కు వెళ్లి రైతులకు డబ్బులు పంచి పెట్టడం జరిగిందని బీజేపీ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. 

తెలంగాణ పరువు తీసిన బండి సంజయ్

తెలంగాణ పర్యటన సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరుగు పరుగుల వెళ్లి మరీ అమిత్ షా చెప్పులు తెచ్చి ఆయన కాళ్ల వద్ద వేసిన వీడియో ఇప్పుడు సోసల్ మీడియాలో   వైరల్ అవుతోంది.  దీంతో తెలంగాణ సమాజం బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అమిత్ షా వెనుక ఉన్న సంజయ్ హడావుడిగా  ముందుకు వెళ్లి మరీ షా పాదరక్షలు తెచ్చి ఆయన కాళ్ల వద్ద ఉంచడంతో తెలంగాణ సమాజం విస్తుపోతోంది. ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా కేంద్ర స్థాయిలో విరుచుకుపడే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ అంశంపై తీవ్రంగా ప్రతిస్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు.  బండి సంజయ్ తో చెప్పులు మోయించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని విరుచుకుపడ్డారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న బీజేపీ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని  , అమిత్ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని దుమ్మెత్తిపోశారు. బండి సంజయ్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీలో బీసీ నేత స్థానం ఏంటో చూడండి.. తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా?.. అమిత్ షా చెప్పులు మోయడమేంటి?’ అంటూ   ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే కేంద్రంపైన, మోడీ, షా ద్వయం పైనా ఒంటికాలిపై లేస్తున్న టీఆర్ఎస్ నేతలు మాత్రం షా చెప్పులు మోసిన బండి సంజయ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.  ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడ్ని- తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గాలూ సిద్ధంగా ఉన్నాయి’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో పాటు షా చెప్పులు మోసిన బండి సంజయ్ వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా? అంటూ కొందరు నెటిజన్లు బండి సంజయ్ వ్యవహార సరళిని తప్పుపడుతున్నారు. ఇలా ఉండగా.. అమిత్ షా చెప్పులు బండి సంజయ్ మోసిన పరిణామం వెనుక ఓ మర్మం దిగి ఉందని మరి మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో అధికారానికి, పెత్తనానికి సంబంధించి బండి సంజయ్- ఈటల రాజేందర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని అంటున్నారు. ముందు నుంచీ బీజేపీలో ఉన్న తన కంటే ఇటీవలే పార్టీలో చేరిన ఈటల రాజేందర్ కు ప్రాధాన్యత వస్తోందని బండి సంజయ్ కు మింగుడు పడడం లేదంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యంతో పాటు ప్రజాభిమానం కూడా ఉన్న ఈటలను ఎదుర్కోవడం సంజయ్ కి తెలియకపోలేదంటున్నారు. అందుకే బీజేపీకి నరనారాయణులుగా ప్రసిద్ధి చెందిన అమిత్ షా-నరేంద్ర మోడీ ద్వయాన్ని ప్రసన్నం చేసుకునేందుకే బండి సంజయ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బండి సంజయ్ లో ఆ క్రమంలోనే కాస్త పరిధులు దాటి మరీ అమిత్ షా చెప్పులు మోసే స్థాయికి దిగజారారంటున్నారు.

అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతం?

అమిత్ షా తెలంగాణ పర్యటన  మునుగోడులో ఆయన ప్రసంగం కంటే.. ఆ సభకు , తరువాత ఆయన భేటీ అయిన వ్యక్తుల కారణంగానే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ వ్యూహం, ఏ ఎత్తుగడతో అమిత్ షా రాజకీయాలతో సంబంధం లేని ఆ ఇరువురు వ్యక్తులనూ కలుసుకున్నారన్న చర్చ ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ జోరుగా సాగుతోంది. మొత్తం మీద అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశం మునుగోడు సభ ద్వారా బీజేపీ సత్తాను చాటాలన్నదే అయినా.. ఆయన సభ  తరువాత కలుసుకున్న వ్యక్తుల కారణంగా మునుగోడు కంటే బీజేపీ ఆ తరువాత జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించిందన్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు.  అమిత్ షా ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. అనంతరం ప్రముఖ నటుడు జూనిరయ్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీలూ కూడా స్వయంగా అమిత్ షా చొరవతో జరిగిన భేటీలే కావడం గమనార్హం. ఈ రెండు భేటీలూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎడతెగని చర్చలకు కారణమయ్యాయి. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకు వస్తుండడంతో ఈ భేటీలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఎర్పడింది. పరిశీలకులు మాత్రం తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులను బీజేపీ వైపునకు ఆకర్షించే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీరావు, ఎన్టీఆర్ లతో భేటీ అయ్యారని విశ్లేషిస్తున్నారు.  ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా కారణమేనన్న ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో కూడా ఉందనీ, దానికి తగ్గించి వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రులను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీ, ఎన్టీఆర్ లతో భేటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. అందుకే సెటిలర్లను ప్రభావితం చేసేంతగా ప్రజలలో ఆకర్షణ ఉన్న రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లను అమిత్ షా కలిశారని పేర్కొంటున్నారు. రామోజీరావుతో భేటీ కారణంగా సీమాంధ్రుల ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందని అమిత్ షా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసిన తరువాత ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. అటువంటి ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అమిత్ షా డిన్నర్ సమావేశంలో బేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. అమిత్ షా ఆయనను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని వార్తలు వచ్చినా అవేవీ ధృవపడలేదు. అంతే కాకుండా  తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయటం..  ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి గా తన ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే  చెప్పిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరే ఛాన్సులు ఇసుమంతైనా లేవని అంటున్నారు.  అలాగే కనీసం తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు తీసుకుంటే.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం ఇస్తుందనీ, తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం మద్దతు ఇస్తుందని అమిత్ షా ఎన్టీఆర్ కు ప్రతిపాదించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఈ వార్తలను అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ దృవీకరించలేదు. కానీ మొత్తం మీద ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలలో మార్పును సూచిస్తోందని మాత్రం పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు.  

లుకౌట్ ఎందుకు,  ఢిల్లీలోనే ఉన్నా..  సిసోడియా

ఊళ్లో ఉన్న దొంగ‌ని ప‌ట్టుకోవ‌డానికి విదేశాల‌కి వెళ్లి స‌మాచారం ప‌ట్టుకొచ్చాడ‌ట ఒకాయ‌న వెన‌క‌టికి. తీరా చూస్తే ప‌క్క‌వీధిలో పోలీసాయ‌న ఆయ‌న్ను స్టేష‌న్‌కి పిలిపించి అడ్ర‌స్ రాసుకుని పంపించేశాట్ట‌.  సీబీఐ అంత‌టి సంస్థ మ‌నీష్ సిసోడియా దేశం విడిచి వెళ్లిందీ లేనిదీ తెలుసుకోకుండానే లుకౌట్ నోటీసు జారీ చేయ‌డం కంటే హాస్యాస్ప‌దం వేరొక‌టి ఉండ‌దు. ఢిల్లీలో స్వేచ్ఛ‌గా తిరుగుతున్న త‌న‌కు అలా నోటీ సులు ఇవ్వ‌డం కేంద్రం ఓవ‌రాక్ష‌న్ అవుతుంద‌ని సిసోడియా ఘాటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ త‌మ అధీ నంలో పెట్టుకుని ఎవ‌రు ఎక్క‌డున్న‌దీ తెలుసుకోలేని స్థితిలో ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని ఆప్ అధి నేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా విమ‌ర్శించారు.  అయితే.. అనంతరం దీనిపై సీబీఐ వివరణ ఇచ్చింది. ఇప్పటికైతే ఈ కేసులో ఎవరిపైనా లుకౌట్‌ నోటీసు జారీ చేయలేదని తేల్చిచెప్పింది. అందునా.. ప్రజాసేవకులు (ఈ కేసులో మంత్రి సిసోడియా) ప్రభుత్వాని కి తెలపకుండా దేశం విడిచి వెళ్లరు కాబట్టి, వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియా తో మాట్లాడుతూ,  కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐని రాజ‌కీ యంగా వాడుకోవ‌డం ఇక నైనా ఆపాల‌ని అన్నారు.  కాగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ-కేజ్రీ మధ్యే పోరాటం జరుగుతుందన్న భయం బీజేపీలో ఉందని, అందుకే ఈ సీబీఐ దాడులు జరుగుతు న్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీ వ‌ల చేసిన వ్యాఖ్యల పై బీజేపీ  స్పందించింది. ఎక్సైజ్ విధానం కుంభ‌కోణానికి సంబంధించి మూలాల‌న్నీ కేజ్రీవాల్ వేపే వెళుతున్నాయ‌ని ఆయ‌న‌తో స‌హా ఎవ‌రూ చ‌ట్టానికి అతీతులు కార‌ని ఎవ‌ర్నీ వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా హెచ్చ‌రించారు. అంతేగాక‌, ఈ కేసుతో సంబంధం ఉన్న డజను మంది స్టాండప్‌ కమెడి యన్లు, సోషల్‌ ఇన్‌ఫ్లూ యెన్సర్లు, యూట్యూబర్లను సీబీఐ దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.  అలాగే, హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్‌, రిటైల్‌ మద్యం వ్యాపారుల ప్రమేయం, ఒకే ముంబై చిరునా మా ను కలిగి ఉండి.. అల్లిబిల్లిగా అల్లుకున్న కార్పొరేట్‌ సంస్థల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి సీబీ ఐ వారిపై దృష్టి సారించింది. కాగా,  ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు (ఈ డీ) సీబీఐ అప్పగించినట్టు సమాచా రం. ఈడీ ఈ ఫైళ్లను పరిశీలించి.. మనీలాండరింగ్‌ జరిగిన సూచ నలు కనిపిస్తే కేసు నమోదు చేస్తుందని తెలుస్తోంది.

సెల్ఫీ, టిక్‌టాక్‌ల‌కు నేపాల్ చెక్‌!

అదేమిటే ఆ పిల్ల మూతి అలా పెట్టేసుకుంది.. అని ఇంకా ఏదో అంటోంది అమ్మ‌మ్మ‌గారు. అది ఫోటో పోజులే.. అన్న‌ది మ‌న‌వ‌రాలు. ఫోటోకి మొహం అలా చేసుకోవాలా అన్న‌ది ఆమె లాంటి చాలామంది పెద్ద‌వాళ్ల‌కి ఇప్ప‌టికీ ఉన్న అనుమానం. ఏమైన‌ప్ప‌టికీ సెల్ఫీలు, టిక్‌టాక్‌లు మోజు మ‌హా పెరిగిపోయి, ఏకంగా సినిమాహాలుకి, దేవుడి గుడికి పెద్ద‌గా తేడాలేకుండా చేస్తున్నారే అన్న‌ది పెద్దావిడ‌. అదీ నిజ‌మే. ఎక్క‌డికి వెళ్లినా ఠ‌క్కున ఫోన్ తీయ‌డం సెల్ఫీ తీసుకునే ప్రాంతం వెతుక్కోవ‌డం త‌ప్ప అక్క‌డికి ఎందుకు వెళ్లిందీ వాళ్ల‌కి అక్క‌ర్లేకుండా పోయింది. కోతికి కొబ్బ‌రికాయ‌లా ఇప్పుడీ టిక్‌టాక్ పిచ్చి ఒక‌టి. కేవ‌లం టిక్ టాక్ కోసం పెద్ద పెద్ధ శ‌బ్దాల‌తో ఇబ్బందులు క‌ల్పిస్తున్నామ‌న్న సెన్స్ బొత్తిగా ఉండ‌టం లేదు. అందులో ఆనందం ఏమిటో గాని టిక్‌టాక్ క్రియేట‌ర్స్‌గా స్నేహితుల్లో, బంధువ‌ర్గంలో కాల‌ర్ ఎగ‌రేసి తిర‌గ‌డం ఈనాటి ఫ్యాష‌న్‌. కానీ వీరి ప‌ప్పులు నేపాల్ లో మాత్రం కుద‌ర‌డం లేదు. అక్క‌డ నిషేధం విధించారు.  నేపాల్‌లో ప్రార్ధ‌నా మందిరాలు, గుడికీ వెళ్లి మ‌రీ టిక్‌టాక్ షోల‌తో యువ‌త వాటి ప్రాధాన్య‌త‌ను దెబ్బ తీస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం భావించింది. అందుకే ఇటీవ‌ల కొన్ని ప‌విత్ర‌స్థలాల‌ను, గుళ్ల‌కు టిక్ టాక్ క్రియేట‌ర్ల ను రానీకుండా అడ్డుకుంటున్నారు. రామ‌జాన‌కీ దేవాల‌యం, లుంబినీ, ఖాట్మండులోని బౌద్ధ నాధ్ స్థూపం.. ఇలాంటి కొన్ని కీల‌క ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు యువ‌త‌ను అస్స‌లు అంగీక‌రించ‌డం లేద‌ట‌. శాంతికి నిల‌య‌మైన ప్రాంతంలో పెద్ద పెద్ద శ‌బ్దాలు, పాట‌ల‌తో హోరెత్తించి ప్రతిష్ట‌ను దెబ్బ తీస్తు న్నార‌ని ప్ర‌భుత్వం భావించి టిక్‌టాక్ షోలు చేసేవారు, సెల్ఫీలు అతిగా తీసుకోనేవారిని దూరంగా పెట్టింది. వారికి ప్ర‌భుత్వం, ప్రాంతీయ అధికారుల అనుమ‌తి ఉంటేనే లోనికి రానీయాల‌ని ష‌ర‌తు విధించింది.  నేపాల్ తీసుకున్నపాటి నిర్ణ‌యం మ‌న‌వాళ్లూ తీసుకుంటే బావుండును. మొన్నా మ‌ధ్య హ‌నుమంతుడి విగ్రహం బావుంద‌ని ప‌క్క‌నే నిల‌బ‌డి సెల్ఫీ తీసుకున్నాడో ప్ర‌బుద్ధుడు. అది గుడిలోనిది కాదు విడిగా  ఒక గుట్ట‌మీద ఎక్క‌డో తీసుకున్న‌ది కాబ‌ట్టి జ‌నం అంత‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌లేదు. అస‌లు కుర్రాళ్ల‌కి గుడి, దేవుడు, భ‌క్తి అనేది పూర్తిగా అర్ధంలేని అంశాలుగానూ మారిపోయాయి. న‌లుగురు క‌లిస్తే వెంట‌నే సెల్ఫీ తీసి స్నేహ‌లోకానికి పంప‌డం జ‌న్మ‌హ‌క్కుగా మారిపోయింది. ఇది వారి ప్ర‌వ‌ర్త‌న‌ను, విద్యా సంస్కా రాన్ని తెలియ‌జేస్తుంది. దేనిక‌యినా ప‌రిమితి అంటూ ఉంటుంది. వీరి పిచ్చికి ప‌రిమితి అనేది ఉండ‌దేమో. అందుకే నేపాల్ ప్ర‌భుత్వమే నిర్ణ‌యం తీసుకుంది. గ‌తేడాది బాలీలో ఒక ప‌విత్ర వృక్షం క్రింద న‌గ్నంగా కూచుని ఒకా య‌న ధ్యానం చేస్తున్నాను, యోగా చేస్తున్నాన‌నంటూ ఫోటో దిగి వారి దేశానికి పంపాడట‌! ఇలాంటి వేషా లేస్తేనే మ‌రి ప్ర‌భుత్వాలు, పోలీసులు గ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, వీల‌యితే జైల్లో వేయ‌డాలు చేయ‌ గ‌ల‌రు. మ‌రంచేత‌, కెమెరా ఉంద‌ని, చేతిలో మొబైల్ ఉంద‌ని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ సెల్ఫీలు, టిక్ టాక్‌ ల‌కు ధైర్యం చేయ‌వ‌ద్దు అనేది త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు చెబితే బావుంటుందేమో!

వైసీపీ సిట్టింగ్‌ లకు స్థాన చలనం తప్పదా?.. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టేందుకే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్న జగన్ అందుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తానని ఇప్పటికే కరాఖండీగా చెప్పేశారు. విజయం సాధించే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన ఆయన ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టేశారని అంటున్నారు. పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలను అసలు పరిశీలనలోకే తీసుకునే అవకాశాలు లేవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అయితే సిట్టింగ్ లు తమ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఓ ఆరు నెలలు సమయం కూడా ఇచ్చారు. అయితే ఆయన ఇప్పటికే సిట్టింగుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ఆరు నెలల సమయం అన్నది కేవలం ఎమ్మెల్యేలను స్వాంతన పరచడానికేననీ ఆయన తీసుకుంటున్న చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడంతోనే జగన్ తన దృష్టిలో పనితీరు బాగా లేదనుకున్న సిట్టింగ్ లకు ప్రత్యామ్నాయాలను ఇప్పటి నుంచే అన్వేషిస్తున్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు. తాడికొండ నియోజవకర్గానికి అదనపు సమన్వయ కర్తను నియమించడం ద్వారా సిట్టింగు ఎమ్మేల్యేలందరికీ స్పష్టమైన సంకేతాన్ని జగన్ పంపారని అంటున్నారు. తాడికొండ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను నియమించిన విధంగానే పని తీరు బాగాలేని పలు నియోజకవర్గాలకు కూడా ప్రత్యామ్నాయాలను జగన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాస్పద విడియో కారణంగా పార్టీ పరువును మంటగలిపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో సారి పోటీకి అవకాశం ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన స్థానంలో ఉషశ్రీ చరణ్ ను రంగంలోనికి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కల్యాణ దుర్గం నుంచి కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి కుమార్తెకు అవకాశం ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కూడా స్థాన చలనం తప్పదని చెబుతున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకూ స్థానం మార్పు తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న త‌రుణంలో ఆయ‌న్ను వేమూరు నుంచి బ‌రిలోకి దింపి మంత్రి మేరుగ‌ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అలాగే అంబటి రాంబాబును అవనిగడ్డ నుంచి రంగంలోనికి దింపాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను డిసెంబ‌రుక‌ల్లా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద సిట్టింగ్ ల స్థానాల మార్పు పార్టీలో తీవ్ర అలజడికి, అసంతృప్తికి దారి తీసే అవకాశాలున్నాయని అంటున్నారు. తాడికొండ విషయంలో ఉండవల్లి శ్రీదేవి తన అనుచరులతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి జ్వాలల మాదిరిగానే.. సిట్టింగుల విషయంలో ఒక సారి జగన్ తన నిర్ణయం ప్రకటించగానే పార్టీలో అసంతృప్తి మంటలు ఎగసి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అద్భుత నటుడు జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో ఎన్టీఆర్ తో లంచ్ భేటీ తరువాత.. ఆయనతో భేటీ ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఆయనో అద్భుత నటుడని పేర్కొన్న అమిత్ షా.. ఆయన ఇటీవల నటించిన సినీమాలో ఆయన నటన చూసిన తరువాత ఆయనను ఒక సారి కలవాలని భావించాననీ, ఆయనతో భేటీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ పేర్కొన్నారు.   మునుగోడులో బీజేపీ బహిరంగ సభ అనంతరం అమిత్ షా హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను తనతో డిన్నర్ సమావేశానికి అమిత్ షా ఆహ్వానించిన సంగతి విదితమే.  ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌కు అమిత్ షా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. అలాగే  జూనియర్ ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. వీరి మధ్య ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగింది.  అందులో దాదాపు 20 నిమిషాల సేపు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్‌ షా, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి భోజనం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్టీఆర్ నటన, రాజకీయ జీవితం గురించిన ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర, దానవీర శూర కర్ణ తదితర సినిమాలను తాను చూసినట్లు అమిత్ షా చెప్పారనీ, అలాగే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అధికారుల పనితీరు బాగుండేదనీ అన్నట్లు సమాచారం. అదలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాల భేటీపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరువురి మధ్యా ప్రస్తావన కు వచ్చిన అంశాలపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారనీ, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించారనీ చెబుతున్నారు. ఒక వేళ బీజేపీలోకి రావడం ఇష్టం లేకుండా తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రానున్న రోజులలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరయ్యే అవకాశాలను మెరుగుపరిచాయని విశ్లేషకులు అంటున్నారు.

పొద‌ల్లో దొరికిన పెద్దామె!

పిల్లాడు పెర‌ట్లో ఆడుతూంటే చెట్టు ద‌గ్గ‌ర మ‌ట్టిలో స్టీలు స్పూను క‌నిపించింది. అమాంతం దాన్ని తీసుకుని త‌ల్లి ద‌గ్గ‌రికి వెళ్లాడు. దీనికోసం రెండ్రోజులుగా వెతుకుతున్నా ఎలా దొరికింది అంటే పిల్లాడు వివ‌రంగా చెప్పాడు. ఇది త‌ప్ప‌కుండా ప‌నిపిల్ల ప‌నే అని  విసుక్కుంది, మ‌రో ఇంట్లో దాదాపు ఇలానే ఒక గిన్నె క‌ని పించింది. ఆ ఇంటి ఇల్లాలు వాళ్ల ప‌నిపిల్ల ప‌నే అనుకుని తిట్టి త‌రిమేసింది. ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం. కానీ ఈథ‌న్ అనే రెండేళ్ల పిల్లాడికి ఏకంగా ఒక పెద్దామె క‌నిపించింది! జార్జియాకి చెందిన బ్రిటానీ మూర్‌, ఆమె పిల్లాడు రెండేళ్ల ఈథ‌న్‌ని ఇంటి పెర‌ట్లో ఆడిస్తోంది. బంతి విసి రితే వాడు తెస్తున్నాడు. కొంత సేప‌య్యాక ఆట‌లో భాగంగా బంతికోసం పెర‌ట్లో ఓ మూల‌గా పొద‌ల మాటు న ఏదో క‌దులుతున్న అనుమానం వ‌చ్చి అలా చూస్తుండిపోయాడు. చెట్లు కదులుతున్నాయ‌ని వాడికి అమితాశ్య‌ర్య‌మేసిందేమో! ముందుకు వెన‌క్కి క‌దిలి అక్క‌డికి వెళ్లాలా వ‌ద్దా అని సంశ‌యించాడు. ఆఖ‌రికి బాగా ద‌గ్గ‌రికి  వెళ్లి చూశాడు. వాడికి మ‌నిషి పాదాలు క‌నిపించి గ‌ట్టిగా అరిచాడు. త‌ల్లి ప‌రుగున వెళ్లింది. అక్క‌డేదో  క‌రిచిందో, కుట్టిందో అని. తీరా చూస్తే మ‌నిషి పాదాలు క‌నిపించాయి. ఆమె కూడా భ‌యం భ‌యంగానే పొద‌లు తొల‌గించి చూస్తే ఓ పెద్దామె స్పృహ లేకుండా  ప‌డి ఉంది.  వెంట‌నే భ‌ర్త‌ని పిలిచి ఆమెను ఇంట్లోకి తీసికెళ్లింది. ఆమె పై దుమ్ము ధూళీ తుడిచి మొహం మీద నీళ్లు చ‌ల్లితే ఆ పెద్దామె తేరుకుంది. చుట్టూ ఉన్న‌వారిని ప‌రికించి చూసింది. వీళ్లెవ‌రో కొత్త‌వారిలా ఉన్నారు, త‌న‌నెందుకో ఇక్క‌డికి ప‌ట్టుకొచ్చార‌నే అనుకుంది. మీరెవ‌రు, న‌న్నెందుకు ఇక్క‌డికి తీసుకు వ‌చ్చారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌నీ హెచ్చ‌రించింది. అమ్మ‌.. మ‌స‌లావిడా.. పొద‌ల్లో ప‌డి ఉంద‌ని లోప‌లికి తీసుకొచ్చి సేవ‌లు చేస్తే ఎంత మాటంటోంది వ‌దినా.. అన్న‌ది బ్రిటానీ త‌న ప‌క్కింటావిడ‌తో! కొంత‌సేప‌టికి బ్రిటానీ భ‌ర్త పోలీసుల్ని పిలిచాడు. ఆమెను ప‌రిశీలించి, ఆమె బంధువుల గురించి అడి గారు. ఇంత చేస్తే ఆమె నాలుగ‌యిదు వీధుల అవ‌త‌ల ఉండే పెద్దావిడ అని తేలింది. ఆమె బంధువు, ముని మ‌న‌వ‌రాలూ వ‌చ్చి అంద‌రికి సారీ చెప్పింది. ఆమెకు దారుణ‌మైన మ‌తిమ‌రుపు. అలా తిరుగుతూ ఎవ‌రింట్లోకో వెళ్లి క‌బుర్లు చెబుతూనే ఉండిపోతూంటుందిట‌. మ‌రి వీళ్ల ఇంట్లో పెర‌ట్లోకి ఎలా వ‌చ్చింద‌నే ఇప్ప‌టికీ అనుమాన‌మే. ఏమైన‌ప్ప‌టికీ  ఆ 86 ఏళ్ల పెద్దామె పేరు నీనా.  కానీ ఆమెను ర‌క్షించి బ‌య‌టికి తీసుకొచ్చిన రెండ ఏళ్ల ఈథ‌న్ ని మాత్రం ఆ ఇంటివాళ్లంతా ఎంతో సత్క రించారు.  ప‌క్కింటాళ్లంతా బుగ్గ‌లు గిల్లారు, పోలీసులు శ‌భాష్ బేటా అన్నారు.  నీనా మాత్రం న‌వ్వి ఊరుకుంది. 

వాజ్ పేయి, అద్వానీల వల్లే బీజేపీకి ఈ అధికారం.. గడ్కరీ

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందంటే అందుకు మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీలే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వారి వల్లే బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదిగిందన్నారు. గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికిన తరువాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణమన్నారు. లోక్ సభలో కేవలం రెండు స్థానాలున్న బీజేపీ ఈ రోజు జాతీయ స్థాయిలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కంచుకోగలిగిందంటేఅందుకు వారి కృషే కారణమనిపేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ముంబైలో ఒక సదస్సులో వాజ్ పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తించారు. ‘చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని వాజ్ పేయి అన్నారనీ, ఆ రోజు ఆ సదస్సులో తానూ ఉన్నాననీ గుర్తు చేసుకున్నారు.  నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. 1980లో ముంబైలో బీజేపీ నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు.   వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో పార్టీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో ఆలోచిస్తారనీ, వారి విజన్  శతాబ్దం మేలు గురించి కూడా ఆలోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. 

గుజరాత్ లో అధికారామే ఆప్ లక్ష్యం

గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీని దాటి పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన  ఆప్ త్వరలో గుజారాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో సత్తాచాటాలని భావిస్తోంది.  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి తీసేసినట్లునని భావిస్తోంది.  ఈ నేపథ్యంలోనే    ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు సోమవారం (ఆగస్టు 22)న గుజరాత్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. మంగళవారం (ఆగస్టు 23)న భావ్ నగర్ లో పర్యటించనున్నారు. తమ రెండు రోజుల గుజరాత్ పర్యటనపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. విద్య, వైద్యానికి సంబంధించి గుజరాత్ ప్రజలకు  స్పష్టమైన హామీ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరే గుజరాత్ లో కూడా మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆప్ కు అధికారం ఇస్తే గుజరాత్ లో ప్రతి ఒక్కరూ ఉచితంగా మంచి విద్య, వైద్యం పొందుతారని కేజ్రీవాల్  ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రోజుల పర్యటనలో గుజరాత్ యువతతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. 

మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా

తాడికొండ వైసీపీలో విభేదాలు రొడ్డెక్కాయి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నాయకురాలు, మాజీ హోంమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయిన మేకతోటి సుచరిత నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి అదనంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను పార్టీ అధిష్టానం అదనపు సమన్వయకర్తగా నియమించింది. ఈ నిర్ణయాన్ని ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు ఆందోళనలకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జిల్లా అద్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తన అనుచరులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి మేకతోటి సుచరిత నివాసం ముందు బైఠాయించి ధర్నాకు దిగడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కినట్లైంది. కాగా సుచరిత స్వయంగా ఉండవల్లి శ్రీదేవిని బుజ్జగించి నిరసన విరమింప చేశారు. అదనపు సమన్వయ కర్త నియామకం విషయాన్ని అధిష్ఠానంతో మాట్లాడి పరిష్కరిస్తానని సుచరిత హామీ ఇవ్వడంతో ఉండవల్లి శ్రీదేవి తన ఆందోళన విరమించారు. కాగా ఎమ్మెల్యే స్వయంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలి నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగడంతో మేకతోటి సుచరిత నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

మునుగోడుతో కేసీఆర్ పతనానికి శ్రీకారం.. అమిత్ షా

మునుగోడులో బీజేపీ ఆదివారం (ఆగస్ట 21) నిర్వహించిన సమరభేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మునుగోడులో శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల వర్షం కురిపిస్తే.. ఆదివారం నాటి సమర భేరి సభలో అమిత్ షా కేసీఆర్ ను విమర్శలతో చెరిగేశారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అన్నారు. సమరభేరి సభా వేదికపై అమిత్ షా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీజేపీ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని చెప్పిన అమిత్ షా రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోక తప్పదని మునుగోడు సభను చూస్తుంటే అర్ధమౌతోందని అన్నారు. రాజగోపాలరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకే తాను మునుగోడు వచ్చినట్లు చెప్పిన అమిత్ షా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడం లేదని విమర్శించారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా?తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన సీఎం చేశారా?  మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్‌ షా నిలదీశారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  నోటి కొచ్చిన హామీ ఇవ్వడం, అమలు చేయకపోవడం కేసీఆర్ నైజమని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని అమిత్ షా విమర్శించారు.

ఎన్టీఆర్, అమిత్ షా భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ అమిత్ షా ఆహ్వానం మేరకు నోవాటెల్ హోటల్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హోంమంత్రి ఆయనను కలవాలని భావించారనీ, అందుకే ఆహ్వానించారనీ బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.   మరోవైపు.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా మునుగోడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం రామోజీఫిల్మ్ సిటీలో రామోజీరావును కలిశారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.   తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 

హిమాచల్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ పదవికి ఆనందశర్మ గుడ్ బై

 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై పార్టీ అధినేత సోనియా గాంధీకి ఆయన ఆదివారం (ఆగస్టు 21) లేఖ రాశారు.  ఈ లేఖలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న ఆనందశర్మ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని  తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన ఆనంద్ శర్మ.. స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం పట్ల పార్టీలోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్టీరింగ్ కమిటీ పదవికి రాజీనామా చేయడానికి కారణాలేమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ నవంబర్‭లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం మాత్రం కాంగ్రెస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‭లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది.  బీజేపీ  ఇప్పటికే  ప్రచారంలోదూసుకుపోతుండగా,   ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది.  కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేందుకు ఉత్సాహంతో ఉంది. ఎటు నుంచి ఎటు చూసినా ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీయే ప్రచారంలో కానీ, ప్రతిష్టలో కానీ వెనుకంజలో ఉంది. గోరు చుట్టుమీద రోకలి పోటులా ఇప్పుడు ఆనందశర్మ స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలగడం ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ‌త ఏప్రిల్ నెల‌లో పార్టీ స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్ గా నియమితులైన ఆనందశర్మ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీ కంటే తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ అస‌మ్మ‌తి వ‌ర్గంగా పేరొందిన జి-23లో జట్టులోని మరో మ‌రో స‌భ్యుడు గులాం నబీ ఆజాద్ జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌లో త‌న‌ను విస్మ‌రించారంటూ ఆనంద్ శ‌ర్మ సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ఆనందశ‌ర్మ గ‌తంలో కేంద్రంలో మంత్రిగా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ఉప నాయ‌కుడిగా ఉన్నారు.ఏప్రిల్ 26న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు.  పార్టీ స‌మావేశాల‌కు  చి ఆహ్వానం లేక పోవ‌డం , ఏ విషయంలోనూ తనను సంప్ర‌దించ‌క పోవ‌డంతో ఆనందశర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

వైసీపీలో కుమ్ములాట ‘ద‌ర్శి’ నీయం!

ఒకే పార్టీ వారు మ‌రీ చిన్న‌పిల్ల‌ల్లా గొడ‌వ‌ప‌డ‌టం వైసీపీలో ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.. వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు తాజా ఉదాహ‌ర‌ణ ద‌ర్శి నియోజ‌క‌వర్గం. ఇక్క‌డ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు మధ్య ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరింది. ఇంటి గృహ‌ప్ర‌వేశాల కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుగాక‌పోవ‌డం వంటి ప‌నుల ద్వారా వారి మ‌ధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్న‌దీ తెలియ‌జేశారు.  సహజంగా సొంత పార్టీలో గాని, ప్రత్యర్థి పార్టీలో నాయకుల్లో రాజకీయంగా మనస్పర్థలు ఉన్నా వారి కుటుంబాల్లో జరిగే కార్యక్ర మాలకు అందరినీ ఆహ్వానించటం, ఎదుటి వారు వెళ్లటం జరుగుతుంది. కానీ గత ఏడాదిగా దర్శిలో మద్దిశెట్టి, బూచేపల్లి మాత్రం ఆ విధంగా వ్యవ హరించటం లేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టి గృహప్రవేశానికి వెంకాయమ్మ కాని శివప్రసాద్‌రెడ్డి గాని హాజరు కాలేదు. ఇటు బూచే పల్లి గృహప్రవేశానికి మద్దిశెట్టి గాని ఆయన సోదరులు కాని రాలేదు. పైగా రాష్ట్ర నాయకుల రాకపోకల్లో కూడా వ్య త్యాసం కనిపిం చింది. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ తలనొప్పి మనకెందుకులే అని రెండు చోట్లకు వెళ్లలేదు. అలాగే కొందరు వైసీపీ నేతలు కూడా అదే పంధా అనుసరించారు.  దీనికి తోడు బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం చీమకుర్తి రానుండటం బూచేపల్లి వర్గంలో జోరును పెంచింది. మరోవైపు మద్ది శెట్టి కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మద్దిశెట్టి గృహప్రవేశానికి ముఖ్యఅతిధిగా వారి సామాజికవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి బొత్సా సత్య నారాయణ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. బూచేపల్లి గృహప్రవేశానికి మాజీమంత్రి, పార్టీ నేత బాలినేనితో పాటు జగన్‌ ప్రత్యేకంగా ప్రోత్సహించే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకావటం విశేషం. కారణాలు ఏమైనా బూచేపల్లి కార్య క్రమంలోనే ముఖ్య నాయ కులు, అధికారులు ఎక్కువగా కనపడ్డారు. ఎమ్మెల్యే గృహప్రవేశానికి వెళ్లలేకపోయిన బాలినేని ఆ తర్వాత వెళ్లి వచ్చేందుకు ప్రయత్నించగా తాను అందుబాటులో లేనని మద్దిశెట్టి చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ రెండు  కార్య క్రమాలను పరిశీలిస్తే వైసీపీలోని కాపులు ఎమ్మెల్యే గృహప్రవేశ కార్యక్రమంలో, రెడ్లు అత్యధికులు బూచేపల్లి గృహ ప్రవేశ కార్యక్రమంలో కనిపించారు.  కాగా  బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం జగన్‌ 24న చీమకుర్తి రానుండటం ఆయనకు కలిసొచ్చింది. అయితే చీమకుర్తి ఎస్‌ఎన్ పాడు నియోజకవర్గంలో ఉండగా దర్శిలో బూచేపల్లి కార్యకర్తల సమావేశం నిర్వహించ టం విశేషం. రెండు రోజుల క్రితం దర్శిలోని ఆయన కొత్త గృహంలో బూచేపల్లి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్‌ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే కు ఈ సమావేశం సమాచారం తెలుసో లేదో కూడా తెలియదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మ్మెల్యే, ఇన్‌చార్జులదే పూర్తి అధికా రం అనేది వైసీపీ విధానం. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా బూచేపల్లి సమా వేశం నిర్వహించటం అందునా చీమకుర్తిలో జరి గే సీఎం సభను జయప్రదం చేయమని కోరడం విశేషం. తద్వారా అటు దర్శిలో ఇటు చీమకుర్తి ప్రాంతంలో బూచే పల్లి కుటుంబం పట్టు నిరూపించుకునే లక్ష్యంతో ఆయన ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇది పార్టీ నిబంధలనకు విరుద్ధమని ఎమ్మెల్యే ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాక బూచేపల్లి వర్గీయులను దెబ్బతీసే ఎత్తుగడలకు కూడా ఆయన సిద్దమయ్యారు.  ఎంపీపీ, జడ్పీటీసీ శుక్రవారం కురిచేడు మండలం కల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహిం చా రు. ఆ కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీలు ఇద్దరూ గైర్హజరయ్యారు. జడ్పీటీసీ తొలి నుంచి బూచేపల్లి వర్గీయుడే. అయితే ఎమ్మె ల్యే మద్దిశెట్టి సామాజికవర్గానికి చెందిన ఎంపీపీ కూడా రాకపోవటం విశేషం. ఎంపీపీ కోటేశ్వరమ్మ, ఆమె పక్షాన రాజకీయం చేసే చంద్రశేఖర్‌రావులు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే తోటి ఉన్నవారు బూచేపల్లి గృహ ప్రవే శా నికి హాజరవ్వటం  అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ విషయంపై ఎమ్మెల్యే కూడా ఎంపీపీని పార్టీ నాయకుడు చంద్ర శేఖర్ రావును మందలించటమే కాక దూరంగా ఉండమని పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. అలాగే వారికి గడప గడపకు సమాచారం ఇవ్వలేదంటున్నారు. ఇటు బూచేపల్లి కూడా జనసమీకరణ పేరుతో ఏర్పాటుచేసే సమావేశాలకు ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా బూచేపల్లితో సన్నిహితంగా ఉండేవారికి చెక్‌ పెడుతున్న సంకే తాన్ని మద్దిశెట్టి ఇచ్చేశారు. దీంతో ఇటు మద్దిశెట్టి అటు బూచేపల్లి రాజకీయంగా ఢీ అంటే ఢీ అనుకునేందుకు సిద్ధమైనట్లు తేట తెల్లమవుతుంది

విద్యుత్ కొనుగోళ్ల‌కు కేంద్రం ఓకే

గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధిం చిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రా నికి సమాచారం అందడంతో  ఇంధన ఎక్స్ఛేంజీ విద్యుత్తు కొనుగోలుకు అనుమతులను పునరుద్దరించింది.  విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది.   తొలుత తెలం గాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.  శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్‌ నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్‌ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్రం నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్‌ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యు త్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవ‌ల‌ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది 2021 ఆగస్టు 18న ఈ డిమాండ్ 8,500 మెగావాట్లు మాత్రమే   ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేక పోవడం, ఉష్ణోగ్ర తలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది.  ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా,  పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్‌ నుంచి చెల్లింపుల్లో జాప్యానికి సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి విదితమే.

బాబాను ఆశ్ర‌యించాడు.. స‌స్పెండ్ అయ్యాడు!

జ్యోతిష్కులు, బాబాలంటే క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వారి మాటే శాస‌నంగా మారింది. చాలామంది అనేక విష‌యాల్లో వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటించేస్తుంటారు. అదంతా న‌మ్మ‌కంతో కూడిన ప‌ని. అలాగ‌ని మ‌నం చేయ‌ద‌గ్గ ప‌ని కూడా బాబా ద‌గ్గ‌రికి వెళ్లి నేను ఇలా చేద్దామ‌నుకుంటున్నాను, అయిపోద్దా సామీ.. అని అడ‌గ‌డం అన్యాయం. ఆయ‌నేదో చెబుతాడు, మ‌నం ఏదో వింటాం, అవ‌త‌ల అస‌లు ప‌ని కాబోతే కొంప అంటుకునేది మ‌న‌దే!.. స‌రిగ్గా ఇలానే జ‌రిగింది ఏఎస్ ఐ అనిల్ శ‌ర్మ విష‌యంలో. గ‌త నెల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ భామిత జిల్లా ఛ‌త్రాపూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి హ‌త్య‌కు గురైంది. ఆమె త‌ల్లిదండ్రులు అనుమా నితులుగా ముగ్గురి పేర్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి విచారిస్తే వారికి, ఈ కేసుకీ సంబంధం లేద‌ని తేలి వ‌దిలేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద ర్నీ ఇలానే విచారించి వ‌దిలేశారు. పై అధికారులు, అమ్మాయి బంధువుల గోడు భ‌రించ‌లేక‌పోయాడు అనిల్ శ‌ర్మ‌. లాభం లేద‌ని త‌న‌కు తెలిసిన ఒక బాబాగారి ద‌గ్గ‌రికి వెళ్లాడు. మంత్రాలేసి ఏమ‌న్నా చెబుతాడేమోన‌ని. ఆయ‌న నాలుగు నిమ్మ‌కాయ‌లు  తె ప్పించి విభూది విసిరి ఏదో చెబుతాడ‌ని గంపెడాశ‌తో కొద్దిరోజులు పోలీసాయ‌న ఆయ‌న చుట్టూ తిరిగాడు. ఆయ‌న ఏమి చెప్పాడో లేదో తెలీదుగాని పోలీసాయ‌న త‌న ప‌నికి సాములోరి సాయం కోర‌డ‌మేమిట‌ని తెలిసిన జ‌నం ప్ర‌చారం చేసి మ‌రీ తిట్టారు.  ఒక వీడియోగ్రాఫ‌ర్ వీడియో తీసి మ‌రీ ప్ర‌చారం చేసి ఘ‌న‌విజ‌యం సాధించినంత ఆనందించాడు. ఆ ఏ ఎస్ ఐని పై అధికారి నిజం గానే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి శ‌ర్మ‌నీ, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన ఇత‌ర పోలీసుల్ని కూడా స‌స్పెండ్ చేశారు. ఆ త‌ర్వాత వారం రోజుల‌కు అస‌లు నిందితుడు దొరికాడు. అత‌నెవ‌రో కాదు అమ్మాయి మేన‌మామ తీర్ధ అహిర్వార్. అత‌న్ని జైల్లో వేసి విచారిస్తు న్నారు. అయితే ఇత‌న్ని తామే ప‌ట్టుకున్నామ‌ని, ఎలాంటి సాములోరి స‌ల‌హాలు, సూచ‌న‌లు లేవ‌ని స‌ద‌రు పోలీసు అధికారి ప్ర‌క‌టించడం కొస‌మెరుపు. 

యు.ఎస్‌లో పెరుగుతోన్న హానా క్రేజ్‌

చిన్న‌పుడు మ‌న ఇళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చి జోస్యం చెబుతాం రండి.. చిల‌క జోస్యం చెబుతాం రండి.. అంటూ రంగుల దుస్తుల్లో వ‌చ్చే వాడంట వాడి మాట‌ల‌కు, పాట‌కు అంత క్రేజ్ ఉండేది. పంజ‌రంలోంచి చిల‌క‌ను బ‌య‌టికి తీసి దాని ముందు ప‌ది కాయితాలు ప‌డేస్తే ఏదో ఒక కాయితం ప‌ట్టి వాడికి ఇస్తే, ఏదో చ‌దివి చెబుతూంటాడు. చిత్రంగా అంద‌రికీ మేలే జ‌రిగే మాట‌లే చెబుతాడు. వాడికి నాలుగు డ‌బ్బులు కావాలిగనుక‌!  నిజంగా భ‌విష్య వాణి చెప్పేవారు చాలా అరుదు. మ‌నిషిలో ఏదో అతీత‌శ‌క్తి ఒక్కోసారి అలా మాట్లాడిస్తుంద‌నే వాద‌నా ఉంది. కానీ అదో నిమిషాల స‌మ‌య‌మే మాట్లాడ‌నిస్తుంది. కొంద‌రు గుర్తుంచుకుని రాసి పెడ‌తా రు. వాటిలో ఒక్క‌టి రెండు త‌ప్ప అన్నీ జ‌రుగు తాయి. ఇపుడు లేటెస్ట్‌గా అలాంటివారి జాబితాలోకి చేరింది హానా కారొల్‌. ఈ 19 ఏళ్ల అమెరికా అమ్మాయి 2022లో జ‌రిగే ప‌ది అద్భుతాల‌ను ఏకంగా నోట్‌బుక్‌లో రాసింద‌ట‌. ఎలిజిబ‌త్ రాణి మ‌ర‌ణం, హేలీ బీబ‌ర్ గ‌ర్భందాల్చడం కూడా అందులో ఉన్నాయి. ఆధునిక భావాలున్న ఈ అమ్మాయి ఎక్కువ‌గా పాప్ క‌ల్చ‌ర్ అంటే ఇష్ట‌ప‌డుతుంది, సెల‌బ్ర‌టీస్‌ని క‌లుస్తూంటుందిట‌.  అయితే క్ర‌మేపీ కేవ‌లం ఫోటోలు చూసి మ‌రీ చెప్ప‌గ‌లిగే స్థాయికి ఎది గింది. నెల‌కు ల‌క్ష‌న్న‌ర సంపాదిస్తోంది. ఎవ‌ర‌యినా ఫోటో పంపితే దాన్ని ప‌ట్టుకుని ఒక్క ప‌ది ప‌దిహేను నిమిషాలు ఏకాంతంలో ఆ ఫోటోనే చూస్తూంటే త‌న‌కు తెలియ‌కుండానే ఆ వ్య‌క్తి గురించి తెలిసిపోతోంద‌ని చెబుతోంది  హానా. ఫోటోలు పంపేవారి ప్రేమ జీవితం, పెళ్లి, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి అనేక అంశాలు చెబుతుంది. చాలామంది త‌న‌కు వీరాభిమానులుగా మారార‌ని అంటోంది. అయితే ఇంత పేరు ప్ర‌తిష్ట‌లు గ‌డించినా హానా మాత్రం చాలా మామూలు అమ్మాయిలానే జీవించాల‌నుకుంటోంది. ఎవ‌రో వ‌చ్చి త‌న‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం, స‌న్మా నాలు చేసి చెక్ ఇవ్వ‌డాలు ఇలాంటివి త‌న‌కు న‌చ్చ‌వ‌ని చెబుతోంది. భ‌విష్య‌త్ చెప్ప‌డం అనేది త‌న‌కు కొంత తెలియ‌కుం డానే జ‌రిగిపోతోంది గ‌నుక తాను ప్ర‌త్యేకించి అందుకు శిక్ష‌ణ తీసుకోలేదంటుంది హానా. భోజ‌నం చేసినంత సులువుగా జ‌రిగి పోతోంది.. మాన‌సిక ఒత్తిడికి కూడా గురి కావ‌డం లేద‌ని ఆమె అన్న‌ది.

జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా ఆహ్వానం.. కారణమేమిటంటే?

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా నుంచి ఆహ్వానం అందింది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన అమిత్ షా నోవాటెల్ హోటల్ లో బస చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు రావాలని అమిత్ షా నుంచి ఎన్టీఆర్ కు తనతో ఢిన్నర్ సమావేశానికి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు, అందుకు జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్లు  విశ్వసనీయంగా తెలిసింది. దీంతో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.   తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.