కేసీఆర్ చెబుతున్నథర్డ్ ఫ్రంట్ లిక్కర్ కూటమే.. బండి
posted on Aug 22, 2022 @ 11:02PM
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడి వెనుక వాస్తవమేమిటో ఇప్పుడు బట్టబయలైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తానంటూ కేసీఆర్ పలికిన ప్రగల్భాల వెనుక అసలు ఉద్దేశమేమిటో ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందని ఆయన అన్నారు. ఆయన రాష్ట్రాల పర్యటనలన్నీ లిక్కర్ ఫ్రంట్ కోసమేనని బండి సంజయ్ అన్నారు.
మద్యం మాఫియా నడిపేందుకే ఆయన ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ పర్యటనలు చేశారని ఆరోపించారు. ఆయా రాష్ట్రాలలో పర్యటించి ఆయన చేసుకున్నవన్నటీ చీకటి ఒప్పందాలేనని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బండి అన్నారు. పంజాబ్ లో ని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
తన పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద సోమవారం (ఆగస్టు 22) మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ రామచంద్ర పిళ్లై, శరత్, స్రుజన్ రెడ్డి, అభిషేక్ లు కేసీఆర్ కుటుంబ బినామీలని అన్న సంజయ్, లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల పేరు చెప్పి కేసీఆర్ రాష్ట్ర పర్యటనలన్నీ లిక్కర్ సిండికేట్ చేసి, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇప్పించడానికేనని బండివ సంజయ్ ఆరోపించారు.
అమిత్ షా కు చెప్పులు అందించడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ… నాపై చిల్లరగాళ్ళు చేసే ఆరోపణలు పట్టించుకోను. అమిత్ షా పెద్ద మనిషి. చెప్పులు తీసిస్తే..పెద్ద ఇష్యూ నా? అన్నారు. తాను అమిత్ షాకు చెప్పులు అందించడాన్ని సమర్ధించుకున్నారు. అమిత్ షాకు తాను చెప్పులందించడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. అమిత్ షా తనకు గురువు. తండ్రిలాంటి వారనీ ఆయనకు చెప్పులందిస్తే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు.
గురుద్వారాలో చెప్పులు శుభ్రం చేస్తాం. ఇందాక పాదయాత్రలో ఓ పెద్దావిడ పోలియోతో ఇబ్బంది పడుతుంటే చెప్పులు తొడిగా..అందులో తప్పేముందని ప్రశ్నించారు. కలెక్టర్ లు కేసీఆర్ కాళ్ళు మొక్కారు దాన్ని ఏమనాలని ప్రశ్నించారు. లిక్కర్ దందా వ్యవహారాన్ని పక్కతోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని బండి అన్నారు.