ఎవరికీ పట్టని అమిత్ షా మునుగోడు సభ
posted on Aug 23, 2022 7:18AM
మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు. ఈ సభకు ముందు బీజేపీ భారీ ఎత్తున ఆర్బాటం చేసింది. అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ప్రచారం చేసింది. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి మాత్రమే కాక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కమల దళంలోని వలసలు ఉంటాయని పేర్కొంది. భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది.
దీనికి తోడు మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరిగిన తరువాత బీజేపీ సభ ఉండటంతో సర్వత్రా ఈ రెండు సభలపైనా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉందనీ, మునుగోడులో అమిత్ షా సభ కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుందని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా సభ అయిపోయిన తరువాత.. బీజేపీ తీరు ఆ సభ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా మునుగోడు లో చేసిన ప్రసంగం ఏం ప్రకంపనలు సృష్టించలేదు. ఎప్పుడూ చేసేలాగే కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ పాలన, అవినీతిపైనా ఊకదంపుడు విమర్శలతో సరిపెట్టారు. అందుకే సభ తరువాత ఎవరూ అమిత్ షా ప్రసంగం గురించి కానీ, మునుగోడులో బీజేపీ సభ గురించి కానీ మాట్లాడటం లేదు.
ఇక చేరికల విషయంలో బీజేపీ చేసిన ఆర్భాటమంతా తుస్సు మంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మినహాయిస్తే.. ఆ సభా వేదికపై కమలం కండువా కప్పుకున్న వారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అధికారికంగా సభా వేదికపై కమలం తీర్ధం పుచ్చుకున్నారు కానీ ఆయన మునుగోడు శాసనసభా సభ్యత్వానికీ, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడానికి చాలా ముందు నుంచీ కమలం గూటి పలుకులే పలుకుతున్నారు కనుక ఆయన అధికారికంగా కాషాయ కండువా కప్పుకోవడం వల్ల బీజేపీ గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.
ఇక అమిత్ షా తెలంగాణ పర్యటన మునుగోడు సభ వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల ఎక్కువ చర్చలో నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా సికిందరాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు చెప్పులు అందించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లు విమర్శలతో విరుచుకుపడ్డాయి. అమిత్ షాకు చెప్పులు అందించడాన్ని బండి సంజయ్ సమర్ధించుకుంటూ.. తండి, గురువులాంటి వారు అమిత్ షా అంటూ చెప్పుకున్నా.. పెద్దగా ఫలితం లేకపోయింది. ఆయన చెప్పులు అందించడం రాష్ట్రంలో బీజేపీకి చేయాల్సిన నష్టం చేసేసింది.
ఈ సందర్భంగా పలువురు గతంలో అమిత్ షా ఒక సభలో పార్టీ సీనియర్ నేత అద్వానీ పక్కన కాలుపై కాలు వేసుకు కూర్చున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తన కాలు అద్వానీకి తగిలేలా ఉంచిన అమిత్ షా అహంకారాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గులాంగిరీని వారించకపోవడం కూడా అమిత్ షా అహంకారానికి నిదర్శనంగానే అభివర్ణిస్తున్నారు. దీంతో అమిత్ షా తెలంగాణ పర్యటన ఈ సంఘటనతో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక మరో సంఘటన కూడా అమిత్ షా తెలంగాణ పర్యటనను చర్చలో నిలిపింది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం. కోరి పిలిపించుకుని మరీ అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. పరిశీలకులు సైతం పలు వశ్లేషణలు చేశారు. అయితే చెప్పువ వివాదం వల్ల కానీ, ఎన్టీఆర్ తో భేటీ వల్ల కానీ బీజేపీకి తెలంగాణలో ఒనగూరు ప్రయోజనం ఏమిటన్నదానిపై మాత్రం పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఏ లక్ష్యంతో అయితే అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చి మునుగోడు సభలో పాల్గొన్నారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఇక సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన దాఖలాలు లేవు. కుప్పలు తెప్పలుగా నేతలు వచ్చి పార్టీ కండువాలు కప్పించుకుంటారని చేసిన ప్రచారం కూడా తేలిపోయింది. వాస్తవానికి మునుగోడు బీజేపీ సభకు అనుకున్నంతగా జనాలు రాలేదు.
అక్కడ సభకు కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి రాలేదు. . ఈ పరిస్థితిని ఊహించే జూనియర్ బీజేపీ ఎన్టీఆర్ తో అమిత్ షాతో భేటీ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న బీజేపీ బలప్రదర్శన చేశామని చెప్పుకోవడానికి బదులు…. తమ సభకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో సభ విఫలమైందన్న సంగతిని బయటపెట్టుకుందని పరిశీలకులు అంటున్నారు.వాస్తవానికి మునుగోడులో బీజేపీకి బలం లేదు. క్యాడర్ లేదు. రాజగోపాలరెడ్డి చేరికను బలుపుగా భావించి బలప్రదర్శనకు రెడీ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అయితే రాజగోపాలరెడ్డి చేరిక బలుపు కాదనీ వాపు మాత్రమేననీ పరిశీలకులు విశ్లేషిన్తున్నారు.