సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు సరే.. దళిత సీఎం మాటేమిటి సారూ!
posted on Sep 16, 2022 @ 10:38AM
అవ్వా కావాలి.. బువ్వా కావాలి అంటే కుదరదన్నది నానుడి. రాజకీయాలలో కూడా అంతే ప్రత్యర్థిపై పై చేయి సాధించడానికి ఒక ఎత్తు వేస్తే.. అది ప్రత్యర్థినే కాదు తననూ ఇరుకున పెడుతుంది. తప్పదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూ అది అనుభవంలోకి వచ్చింది. దళిత బాంధవుడిగా ఒక ముద్ర కోసం ఆయన అనూహ్య వేగంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఫలించింది.
అదే సమయంలో బూమరాంగ్ కూడా అయ్యింది. కేసీఆర్ తన వ్యూహ వేగం కారణంగా ఒకే సమయంలో కేంద్రంపై పై చేయి సాధించారు.. రాష్ట్రంలో తన విమర్శకులకు షాక్ ఇచ్చారు. ఒకే ఒక్క ప్రకటన జాతీయ స్థాయిలో కేసీఆర్ ఇమేజ్ ను పెంచేసింది. దళిత బాంధవుడిగా గుర్తింపు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గతంలో తాను ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదన్న ప్రశ్ననూ బలంగా తెరమీదకు తీసుకువచ్చింది. తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం కేసీఆర్ కు జాతీయ స్థాయిలో మైలేజ్ పెంచేసింది. నిజమే కానీ అదే సమయంలో తెలంగాణలో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఒక ఆయుధాన్నీ ఇచ్చింది.
ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని చకచకా ఆలోచించి.. తాము కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ రాలేదు. కానీ కేంద్రం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అండేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మాత్రం అన్ని వైపుల నుంచీ బలంగా వచ్చింది. దీనిని అవకాశంగా తీసుకుని కేసీఆర్ సచివాలయానికి అండేడ్కర్ పేరు పెట్టేశారు. అదే సమయంలో కేంద్రం కూడా తన బాటలోనే నడవాలని ఒక డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ఒకే దెబకు రెండు పిట్టలను కొట్టేయవచ్చని భావించారు. అంతా బానే జరిగింది కానీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించగానే తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ గతంలో తానే ఇచ్చి విస్మరించిన హామీ ఇప్పుడు గతంలో న్నడూ లేనంత బలంగా తెరమీదకు వచ్చింది.
సచివాలయానికి అంబేడ్కర్ పెరు పెట్టడం కాదు.. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటలను నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ ప్రత్యర్థులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. సచివాలయానికి ఎవరూ కోరకుండానే అంబేడ్కర్ పేరు పెట్టిన కేసీఆర్, తాను స్వయంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో .. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను సీఎంను కానని దిళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని లేకపోతే తల నరుక్కుంటానని ఘనంగా ప్రకటించిన కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు సార్లు ఆ అవకాశం వచ్చినా తానే సీఎం అయ్యారు తప్ప దళితుడికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అంతే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ విజయం తథ్యమనీ, తానే సీఎంను అవుతాననీ ప్రకటిస్తున్నారు తప్ప దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న తన హామీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి బీజేపీని డిఫెన్స్ లో పడేశానని కేసీఆర్ సంబరపడుతున్న వేళ దళిత ముఖ్యమంత్రి అంశం బలంగా తెరమీకు వచ్చింది. దళితుల్ని ఆకట్టుకని జాతీయ స్థాయిలో మైలేజీ సంపాదించాలని ఆయన వేసిన త్తుగడ ఈ రకంగా బూమరాంగ్ అయ్యింది. ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఆ అంశాన్నే ఆయుధంగా మార్చుకుని కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నది. మొదటి సారి సీఎం అయిన సందర్భంగా దళిత ముఖ్యమంత్రి విషయంపై కేసీఆర్ కొత్త రాష్ట్రానికి తన వంటి అనుభవజ్ణుడైన వ్యక్తి సీఎం కావాల్సిన అవసరం ఉందనీ అందుకే దళిత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చలేదనీ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత ఈ విషయంపై ఎవరు ప్రశ్నించినా విమర్శించినా స్పందించలేదు. అయితే ఈ సారి ఆయన బీజేపీని ఇరుకున పెట్టే లక్ష్యంతో వ్యూహాత్మకంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతూ తీసుకున్న నిర్ణయం దళిత ముఖ్యమంత్రి అంశాన్నిప్రత్యర్థి పార్టీలకు ఒక బలమైన ఆయుధంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.