అనుకున్నావని జరగవు అన్నీ!
posted on Sep 16, 2022 @ 5:02PM
మావా, ఆ శెట్టిగారబ్బాయి ఐద్రాబాద్‌లో కంపూటర్ పనిచేస్తా కోట్లు గడిస్తన్నాడంట? ఏంది సంగతి? ఒకా నొక మధ్యాన్నం టీకొట్టు దగ్గర ఒకాయన మరో పెద్దాయన్ని అడిగాడు. దీనికేంది, చెరువుకాడ ఇడ్లీలమ్మే ముసలాముందా.. ఆమె కొడుకు దుబాయ్ యెల్లాడు.. తెలిసిందా? అన్నాడా పెద్దాయన. చుట్టు పక్కల వారంతా టీలు, కాఫీలు తాగడం ఆపేసి మరీ ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యమన్నారు. హౌ అను కున్నా డు టెన్త్ నాలుగోసారి పాసయిన కుర్రాడు. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడుగదా.. కాలంతో పాటు ముం దడుగేస్తే ఇదేశాలకీ యెల్తాడు, తెల్సా అన్నాడు చుట్టెలిగించుకుంటూ మరో వ్యక్తి.
ఏవిటి ఇన్ని అసాధ్యాలు సాధ్యమయ్యాయా? ప్రశ్నలు సతాయిస్తుంటే మరో వ్యక్తి ఆ శెట్టిగారబ్బాయి గురించే ఆలోచించి బుర్రపాడుచేసుకున్నాడు. లక్ష్యం గట్టిదయినపుడు అన్నీ సాధ్యమేనన్నారు పెద్ద లు.ఎదురింటి అబ్బాయి చిన్నపుడు అల్లరచిల్లరగా తిరిగేడని అలానే ఉంటాడనుకోవడానికి వీలు లేనికాలం ఇది. కాస్తంత చదువు, బోలెడు తెలివి, కొండంత ధైర్యం అన్ని నూర్చితే ఎంత పెద్ద స్థాయి కయినా వెళ్లొచ్చని అనేకమంది నిరూపించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదురా నాన్నా.. అంటూ పాత సినిమాలో రంగారావు చెప్పినట్టు ఎప్పుడూ ఎవ్వరూ ఒకేలా ఉండరు. సామాజికంగా, ఆర్ధికంగా ఎదగడానికే ప్రయత్ని స్తారు. నలుగురిలో శభాష్ అనిపించుకోవాలనే తాపత్రయపడతారు. కాబోతే బహు కొద్దిమందికే అంతకంటే ఉన్నతస్థాయి ప్రాప్తిస్తుంది. కొందరు ఆశలకు తగ్గ స్థితిలో కదుర్చుకోగల్గుతారు. లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. అది సాధ్యమా అసాధ్యమా అన్నది ప్రయత్నాల మీద ఆధార పడీ ఉంటుంది. అలాగని మరీ తాహతకు మించీ ఆలోచించకూడదు. కొందరికి వ్యాపారం నప్పుతుంది, మరికొందరికి ఉద్యోగాలే సుఖమనిపిస్తే, ఇంకొందరికి రాజకీయాలూ వృత్తిగా చేసుకుంటారు. కానీ ఆయా రంగాల్లో ఆశిం చిన స్థాయికి చేరుకునేది మాత్రం ఏ ఒక్కరిద్దరికో దక్కుతుంది. కలలు కనొచ్చు, కలలు కనమంటారు. వాటిని సార్ధకం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, అనుసరిస్తున్న మార్గాలే కీలకం.
ఉదాహరణకు రాజకీయాలు అందరికీ సరిపడవు. కొందరికే అచ్చోస్తాయి. అలాగని ప్రతీ ఒక్కరూ ప్రధానో, ముఖ్యమంత్రో కాలేరు. అయితే ఆమధ్య, మోదీ ప్రధాని కావటం గురించి కథలు కథలుగా చెప్పుకోసా గారు. ఎక్కడో గుజరాత్‌లో ఓ పట్టణంలో చాయ్ దుకాణం నడిపినవాడు ప్రధాని ఎలాగయ్యాడ్రా మావా?! అని రోజుల తరబడి చర్చోపచర్చలు జరిగాయి. ఆయన ఒకప్పుడు చాయ్ దుకాణమే నడిపి ఉండవచ్చు. కానీ రాజకీయాల్లోకి రావడం, అందరి మధ్యా శభాష్ అనిపించుకోవడం అంచలంచెలుగా ఎదగడం అన్నీ వెరసి ఆయన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టాయి. అంతేగాని చాయ్ కలుపుతూ ఢిల్లీకి వెళ్లి కుర్జీ బాగుందని కూర్చోలేదు. ఇటీవలి కాలంలో చాలామంది సక్సెస్ స్టోరీస్ అంటూ రిక్షావాడి కూతురు కలెక్టర్ కావడం, ఆటోవాడి కుమారుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడని.. ఇలా చదివే ఉంటారు. ఒక వ్యక్తి ఒక సమయంలో ఉన్న స్థాయికి ఆ తర్వాత కాలక్రమంలో వచ్చే పరిణామల్లో జీవనగమనంలో వచ్చే మార్పుల కు సంబంధం ఉండనక్కర్లేదు. చదువు, లక్ష్యాన్ని సాధించాలన్న బలమైన ఇచ్ఛ అవసరం. కాలక్రమంలో అన్ని మద్ద తులూ లభిస్తాయి.
పూర్వం ఒకడు నాడా ఉందని గుర్రం కొనడానికి వెళ్లాట్ట. అలా ఉంది కేసీఆర్ తంతు.. మద్దతు ఇస్తారని తాను ప్రధాని కావడానికి తెలంగాణా సీఎం కేసీఆర్ లా మాత్రం ఎవ్వరూ త్వరపడరు. వాస్తవానికి మద్దతు, ప్రధాని పదవీ రెండూ భ్రమే. ఉన్న ప్రాంతాన్ని, తనవాళ్లనీ కాదని లోకమంతా తన తెలివి ప్రదర్శించి కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకోవడం మడతమంచం మీద పడుకుని కలలు కనడం లాంటిది. మధ్యాన్నభోజనం తర్వాత వచ్చే కునుకులాంటిది. ఆనక ఎవరో గిల్లినట్టు వాస్తవం ముల్లయి గుచ్చుకుని ఓరే నాన్నా.. ముందు నీ ఊళ్లో లైటుస్థంబాలు, రోడ్లు సంగతి ఆలోచించు అని గుర్తుచేస్తుంది. తాహతకు మించి నింగికి ఎగరాలనుకోవడం బుద్ధిలేనితనమే. కేసీఆర్ మొదటి యాత్రలో అందర్నీ కలిశారు. ఏమ యింది. చిర్నవ్వులు, పూలగుత్తులు, నాలుగు షేక్‌హ్యాండ్లు, ముప్పయి ఫోటోలు తప్ప జరిగిందేమీ లేదు. ఆయన కలిసినవాళ్లంతా ఆయనకంటే దేశముదురులు అన్న సంగతి ఆయనకు తెలియకా కాదు. ఏదో ఒక రాయి వేయడానికి వెళ్లారు. అదే రాయి దారి తప్పి మళ్లీ ఆయనకు బూమరాంగ్ అయింది. అయినా పులుపు ఎక్కడ ఛస్తుంది. చతికిలపడినవాడు మళ్లీ చాప చుట్టుకుని మరోప్రయత్నంగా బట్టలు సర్దుకుం టున్నారు. ఖుదాకీ కసమ్ మోదీని దించడం ఖాయం అని సగం తెలుగు, సగం ఉర్దూలో సవాలు చేసి నంత మాత్రాన అన్నీఅయిపోతే.. మోదీకి పంచాయితీ ప్రెసిడెంటుకీ తేడా ఏవుంటది?