ఢిల్లీ లిక్కర్ కుంభకోణం.. ఏపీలో ఈడీ సోదాలు!
posted on Sep 16, 2022 @ 12:33PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు మరింతగా పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లోని20 ప్రాంతాలు సహా ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తుండడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్లు అధికార వైసీపీ ముఖ్య నేత సతీమణి సహా నెల్లూరు జిల్లాలోని కొందరు వ్యాపారవేత్తల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు కూడా.
ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి నెల్లూరు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఇప్పటికే రెండుసార్లు సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇల్లు, నానక్ రామ్ గూడలోనిరాబిన్ డిస్టలరీస్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్ పీ పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్ బోయిన్ పల్లి, గండ్ర ప్రేమ్ సాగర్ రావును డైరెక్టర్లుగా రామచంద్ర పిళ్లై నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసాని హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేస్తుండడం గమనార్హం. మద్యం వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్ లే టార్గెట్ గా ఈడీ దాడులు జరుగుతున్నాయి.
అంతకు ముందు సెప్టెంబర్ 6న మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో 35 చోట్లకు పైగా ఈడీ సోదాలు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను మూడు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. సత్యేంద్ర జైన్ ను విచారిస్తున్న సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్ స్కామ్ చైన్ ను బట్టబయలు చేసేందుకు ఈడీ అధికారులు పెద్ద ఎత్తున ఒకే సారి 40 చోట్ల తనిఖీలు చేస్తుండడం సంచలనంగా మారింది.