ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన వైద్య విద్యార్థులకు కేంద్రం షాక్
posted on Sep 16, 2022 @ 11:15AM
యుద్ధం కారుణంగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేసిన భారత విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్యార్థులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అక్కడ నుంచి వెనక్కు వచ్చేసిన వైద్య విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీలలో సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు యుద్ధానికి ముందు 22000 మంది వరకు ఉన్నారు.
వీరిలో అత్యధికులు మెడికల్ విద్యార్థులే. భారత్ లో ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ కు అయ్యే వ్యయం కంటే ఉక్రెయిన్లో తక్కువే కావడం, ఉక్రెయిన్ ఎంబీబీఎస్ చదివిన వారికి గుర్తింపు ఉండటం కారణంగా చాలా మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ మెడికల్ కాలేజీలలో మెరిట్ మేరకు సీట్లు లభించని వారు ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిండానికి మొగ్గు చూపుతారు. అందుకే ఉక్రెయిన్ లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వారి చదువుకు అవరోధం కలిగించింది. యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది.
అయితే మిగిలిన విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్తులకు మాత్రం ఇక్కడి మెడికల్ కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చట్ట ప్రకారం.. ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చేసిన వారిని ఇక్కడి కాలేజీలలో సర్దుబాటు చేసి వారి విద్య కొనసాగించేందుకు చట్టప్రకారం కుదరదని తేల్చేసింది. తమను భారత వైద్య కళాశాలలకు బదిలీ చేయాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది.
'ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులను ఇక్కడి మెడికల్ కాలేజీలు/యూనివర్సిటీల్లో సర్దుబాటు చేయడం లేదా ఇక్కడికి బదిలీ చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. విదేశీ వైద్య విద్యార్థులను భారత మెడికల్ కాలేజీలకు బదిలీ చేయడం లేదా సర్దుబాటు చేసే అంశానికి సంబంధించి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్-1956 లేదా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్- 2019లో ఏ విధమైన నిబంధనలు లేవు' అని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు మన దేశంలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఆర్థికంగా స్థితిమంతులు కావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారని వెల్లడించింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులకు భారత్ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలిపిస్తే ఇతర ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది.
అయితే.. ఉక్రెయిన్ విద్యార్థులు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంప్రదింపులు జరుపుతోందని కేంద్రం వెల్లడించింది.