ఏపీ అసెంబ్లీ... టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెండ్
posted on Sep 16, 2022 @ 1:23PM
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం మరింత గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిత్యావసర ధరలపై తెలుగుదేశం సభ్యుల ఆందోళనతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేల ను సభ నుంచి సస్పెండ్ చేశారు. వారిని వెంటనే బయటకు తోసేయండంటూ మార్షల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 13 మంది టీడీపీ ఎమ్మె ల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
నిత్యావసర ధరలపై టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పెరిగిన చార్జీలు, పన్నులపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థిత చోటు చేసుకోవడంతో... స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రతీరోజు ఇదొక అలవాటుగా మారిందని. మీ దుష్ప్రవర్తనకు సస్పెండ్ చేస్తున్నా. ప్రతి రోజు ఇదొక వ్యాపకం అయిపోయిందా మీకు. ఇంతకంటే వ్యాపకం లేదా మీకు అని మండిపడ్డారు. వారిని బయటికి లాగేయండి అంటూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహించారు. మార్షల్స్‌తో ఎలా బయటకు పంపు తారంటూ మండిపడ్డారు. దీనితో స్పీకర్ స్పందిస్తూ ‘‘దె ఆర్ మార్షల్స్ ఆస్ ద స్పీకర్ ఆయామ్ డిక్లరింగ్. వన్స్ అయామ్ డిక్లేర్ యు షుడ్ నాట్ టేక్ ఎనీ మోర్ హియర్. తీసుకెళ్లిండి’’ అంటూ మార్షల్స్‌ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.
అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్ రూల్ 2 ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నా యుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చిన్నరాజప్ప, గండ్ర వెంకటరెడ్డి, జోగేశ్వ రావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు, వెలగ పూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లు సస్పెండ్ అయ్యారు.