కాంగ్రెస్ కబ్జాకు రేవంత్ స్కెచ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సంగతి చెప్పననక్కర లేదు. అసలే అనారోగ్యం, ఆ పైన కన్నతల్లిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రియాంక, ఇక్కడో కాలు, అక్కడో కాలు అన్నట్లుగా ఎక్కడెక్కడి పనులో చక్కపెట్టుకోవడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడున్నారో, అసలు దేశంలో ఉన్నారో లేదో ఏమో కానీ, చాలా కాలంగా రాబర్ట్ వాద్రాకు సంబందించిన వార్తలు ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు.
నిజం ఏమిటో కానీ, ఆయన కూడా పీకల్లోతు కష్టాల్లోనే ఉన్నారని కొందరు అంటుంటే, అందుకే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారని ఇంకొందరు అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కీలక నేతలు ఎవరు అందుబాటులో లేక పోవడం వలనో, ఏమో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా ప్రయాణం సాగిస్తోందని, పార్టీలో మిగిలిన పెద్దలు, పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉన్నారు. అదలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ‘ఓనర్ షిప్’ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పుట్టెడు ఆశలతో పార్టీలో చేరారు. పార్టీలో చేరడం ఏమిటి మూడేళ్లు తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్లను పడగొట్టి మరీ పీసీసీ పీఠం దక్కించుకున్నారు.
రేవంత్ రెడ్డితో సన్నిహిత పరిచయం ఉన్న ఎవరైనా, ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ మీద మక్కువ ఎక్కువని అంటారు. ఆఫ్కోర్స్, రాజకీయ నాయకులు అందరికీ పదవీ కాంక్ష ఉండడం సహజం కానీ, రేవంత్ రెడ్డికి, అది ఇంకొంచెం ఎక్కువని అంటారు. అందరిలా ఆయన ఏ మంత్రి పదవితోనో సంతృప్తి చెందే రకం కాదని, ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఆయన లక్ష్యమని అంటారు. అందుకే ఆయన అన్ని పార్టీలు తిరిగి చివరకు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కుర్చీ టార్గెట్ గా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకులను సాగనంపి, పార్టీని కబ్జాచేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ పార్టీ సీనియర్లు అసంతృప్తితో రగిలి పోతూనే ఉన్నారు. అది అనేక మార్లు బహిర్గతం అవుతూనే ఉంది. పార్టీ అధిష్టానం దృష్టికీ వెళ్ళింది. ఒకటి రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి రేవంత్, సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ప్రియాంకా వాద్రా కుడా జోక్యం చేసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పిలిపించుకుని, ‘పరిస్థితి’ చర్చించారు. మరోవంక రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీనియర్లతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా, సీనియర్లను సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి.కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గా రెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వంటి కొందరు సీనియర్లు బహిరంగంగా బయట పడితే, ఇంకొందరు సైలెంట్ గా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.
నిజానికి, రేవంత్ రెడ్డి మునుగోడుకు ముందు నుంచి కుడా, సీనియర్లను పొమ్మనకుండా పొగబెట్టి పంపించే ప్రయత్నాలు సాగిస్తున్నారని,. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన సమయంలో, మర్యాద పూర్వకంగా యశ్వంత్ సిన్హాను కలిసిన పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద వాలడానికి వీలులేదని, పీసీసీ చీఫ్ హుకుం జారీ చేశారు. అంతే కాదు, ఎవరైనా,తాను గీసిన గీత దాటితే, బండ కేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాకుండా పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి. గీతదాటితే మాత్రం ఎంతటి వారినైనా ఉపెక్షించేంది లేదని సీనియర్ల కు డైరెక్ట్ గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైన తర్వాత, రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ మరి కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి దయాకర్ బహిరంగ సభ వేదికగా చేసిన. బూతు వ్యాఖ్యలు, అలాగే రేవంత్ రెడ్డి సీనియర్లను, హోంగార్డ్స్ అంటూ చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి, సీనియర్ల మధ్య దురాన్ని మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి చాల సీరియస్ అయ్యారు. అంతే కాకుండా, విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే ప్రియాంకా వాద్రా రేవంత్ రెడ్డికి అక్షింతలు వేశారని, అందుకే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారని అంటున్నారు. అలాగే, రేవంత్ రెడ్డితో చేతులు కలిపి సీనియర్ల మాటకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఎదురుకుంటున్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కు కూడా ప్రియాంక తలంటు పోశారని, పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మధు యాష్కి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే, అదెలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకుల అడ్డు తొలిగించుకుని, పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారని అంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో సీనియర్ నాయకులను ఇరికించే విధంగా వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. మునుగోడు ఆటలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచినా ఓడినా, ఆటలో తమదే పై చేయి అయ్యేలా, రేవంత్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. అదలా ఉంటే, ప్రియాంక ఎంట్రీతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్లు కూడా వ్యూహాత్మకంగా పవువులు కదుపుతున్నారని అంటున్నారు.
అందుకే, రేవంత్ రెడ్డి కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి వచ్చారని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై సర్వాధికారాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది నిజమే అయినా, కాంగ్రెస్ సీనియర్లు, ఆయన ఆటలు ఎంతవరకు సాగానిస్తారనేది చూడవలసి ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదలా ఉంటే రేవంత్ కు రాహుల్ అండదండలుంటే. సీనియర్లకు ప్రియాంక మద్దతు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉపఎన్నిక ఫలితంపైనే రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సీయర్లు కొందరు ముక్తాయింపు నిస్తున్నారు.