కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్, గెహ్లాట్
posted on Sep 20, 2022 @ 11:54AM
కాంగ్రెస్ పార్టీ నాయకుని ఎంపిక వచ్చే నెలలో జరగనుంది. పార్టీ యువనేత రాహుల్ గాంధీ పార్టీ ఉన్నత పదవిని ఆశించడం లేదు. అయినా పార్టీ సీనియర్లు, దేశంలో కాంగ్రెస్ పార్టీ వివిద స్థాయి నాయకులు రాహుల్‌నే కోరుకుంటున్నారు. కానీ రాహుల్ మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ మరో మూడురోజుల్లో ఆరంభం కానుంది. ఈ పరిస్థితుల్లో ఆ పదవి కోసం పార్టీ సీని యర్లు కొందరు ఆశపడటం గమనిస్తున్నాం. తాజాగా తెరమీదకు శశిథరూర్, అశోక్ గెహ్లాట్ వచ్చారు. వీరిద్దరికి ఆ పదవి దక్కే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.
కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ గత పాతికేళ్లుగా సోనియా గాంధీ లేదా రాహుల్ వెంట ఉన్నారు. ఆయన ఇపుడు పార్టీ ఉన్నతపదవికి అర్హుడనని భావించి ముందుకు వచ్చారు. కాంగ్రెస్ జి-23 లో కీలక సభ్యుడు. పార్టీ నాయకత్వం లోపంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, ఆ పదవిని వీలువెంట భర్తీ చేయనవసరం ఎంతో ఉందని మొదటగా హెచ్చరించింది ఆయనేనని అంటారు. 2020 నుంచి కూడా పార్టీ పటిష్టతా లోపాన్ని గురించి సోనియాగాంధీకి ఏదో ఒక సమయంలో చెబుతూవచ్చారు. సోనియా ఆరోగ్య సమస్యతో విదేశాలకు వెళ్లి తిరిగి రాగానే సోమవారం ఆమెను కలిసినపుడు పార్టీ పదవికి పోటీ చేయడానికి ఆమె నుంచి సమ్మతి కూడా థారూర్ పొందారు.
కానీ ఆ తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా పోటీలో ఉన్నారన్నది బయటపడడంతో ఎన్నిక అంత సులభంగా తేలే వ్యవహారంగా లేదన్నది స్పష్టమయింది. గాంధీ కుటుంబానికి ఎంతో సన్ని హితునిగ పేరున్న గెహ్లాట్ మొదట నుంచీ రాహుల్ కే మద్దతునిస్తూ వచ్చారు. కానీ ధారూర్ పోటీ చేస్తున్నా రన్నది ఆయనకు మింగుడు పడటం లేదు. అందుకే గెహ్లాట్ కూడా బరిలోకి దిగాలనే అనుకు న్నారు. అయితే ఇలాంటి పోటీల గోలని వినడం ఇష్టంలేని మేడమ్‌గారు ఎవరు పోటీ చేయాలనుకున్నా ఎలాంటి అభ్యంతరమూ లేదని జనాంతికంగా అనేశారు. కానీ దాని సారాంశం అదికాదు, పోటీ చేయడానికి ఎవరి ఆదేశం అవసరం లేదని, ఎవరు రాహుల్ జీ కంటే గొప్ప అర్హులని భావించుకుంటే వారు పోటీ చేయవచ్చ ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ మరింత స్పష్టం చేశారు.
మరో మూడురోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుంది. గతేడాది పార్టీ లో సీనియర్లు, కీలక సభ్యు లు బయటికి వెళిపోవడంతో పార్టీ ఉన్నత పదవికి ఎన్నిక జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్ మోస్ట్ గులాంనబీ అజాద్ వెళిపోవడం ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీ అధ్యక్షపదవిని 19 ఏళ్లపాటు చేపట్టిన సోనియాగాంధీ 2017లో తన కుమారుడు రాహుల్ గాంధీని ఆ స్థానంలో పెట్టారు. అది తాత్కాలికమే, 2019లో ఆయన దాన్ని వదులుకున్నారు. ముఖ్యంగా పార్టీ ఓటమికి బాద్యతవహిస్తూ ఆయన పార్టీ ఉన్నతపదవిని తాను ఆశించడంలేదనే ప్రకటించారు. దీనికి తోడు పార్టీ నాయకత్వం, ఆదేశాలు పటిష్టంగా లేకపోవడంతో పార్టీ ఆ తర్వాత రాష్ట్రాల ఎన్నికల్లోనూ వెనుకబడింది. పరిస్థితులను చేజారనీయకుండా చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ అభిమానులు, ఓటర్ల ను మరింతగా ఆకట్టుకుని పటిష్టపరిచేం దుకు రాహుల్ భారత్ జోడో యాత్రను ఆరంభించారు. పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టపరచడంలో తలమునకలై పార్టీకోసమే జీవించాలన్న ఆశతో ముందడుగు వేస్తున్న రాహుల్ పార్టీ అధ్యక్షపదవికి తిరిగి రానని భీష్మించారు. ఈ తరుణంలోనే గెహ్లాట్ వంటి సీనియర్లు మళ్లీ రాహుల్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయనే పార్టీ అధ్యక్షునిగా ఉంటారని ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా పార్టీ సీనియర్లు, ఆయన వీరాభిమానులు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా పరిస్థితులను తమకు అనుకూలం చేసుకోవాలన్న తలంపుతో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఇంతటితో కాంగ్రెస్ పని అయిపో యిం దని బాహాటంగానే ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నా రు. ఈ పరిస్థితుల్లో శశిథరూర్‌గాని, అశోక్ గెహ్లాట్ గానీ కాంగ్రెస్ ను ఓటములు, అవమానాల తీరం దాటిస్తారన్నది అనుమానమే. ఇప్పటివరకూ కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం అంటే కాంగ్రెస్ అన్న సిద్ధాంతంలో ముందడుగు వేసిన కాంగ్రెస్ నాయకులు, వీరాభిమానులు ఇపుడు బయటి వారి నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించి, అదే ఉత్సాహంతో పార్టీ విజయాలకు తోడ్పడతారన్నది చూడాలి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాకుంటే ప్రియాంకా వర్దాలే పార్టీకి కావలసిన పరిస్థితుల్లో కేవ లం ఎంపీగా, సోనియా మెచ్చుకున్న పార్టీ వ్యక్తులుగా శశిథరూర్, గెహ్లాట్‌లు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అంతే బరువు బాధ్యతలతో చేపట్టగలగటం మీద అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రాల స్థాయిల్లో పార్టీ బాధ్యతలు, పార్టీకోసం పాటుపడటం వేరు ఏకంగా దేశం మొత్తం మీద పార్టీ వ్యవహారాలను అధీనంలో పెట్టుకుని పార్టీ వర్గాలను ఎన్నికల్లో కదం తొక్కించడం అనేవి చిన్న విషయాలు కావు. అందుకు వేరే ప్రాంతాలవారి అభీష్టం తెలియాలి. థారూర్, గెహ్లాట్‌ను దేశం యావత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఏమాత్రం ఇష్టపడతారు, ఏమాత్రం అంగీకరించి తోడుంటామన్నదీ అనుమానమే. కనుక బతిమాలో, బామాలో రాహుల్‌నే ఇంటికి రారా నాయనా అని కాళ్లు కడిగి అంతా వెన్నుదన్నుగా ఉంటామ ని ధైర్యం పాఠాలు చెప్పి పీఠం ఎక్కించడమే మేలు అని పరిశీలకుల మాట.