జగన్ నియోజకవర్గ సమీక్షలకు మంగళం.. ఎందుకో తెలుసా?
posted on Sep 20, 2022 @ 11:52AM
రాజుగారికి వేగులు ఎలాగో రాజకీయ పార్టీకి క్యాడర్ అలగ..ఇది ఏపీ సీఎం జగన్ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. రాజుగారి వేగులు రాజ్యంలో ప్రజలేమనుకుంటున్నారన్నది రహస్యంగా సమాచారం సేకరించి రాజుగారికి చేరవేస్తారు.
ఆ చేరవేసే సమాచారం అంతా రాజుగారి చెవులకు, మనసుకు హాయి కలిగించేదిలాగే ఉండాలన్నది అలిఖిత షరతు. ఎవ్వరూ ఆ సంగతిని వేగులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకి అలా తెలిసిపోతుందంతే. ఏదో సినిమాలో నటి అంజలి మాటమాటికీ ‘ఏమో నాకన్నీ తెలిసిపోతాయంతే’ అంటుంటుంది. అలా ప్రత్యకమైన హేతుబద్ధమైన కారణం ఏమీ లేకుండానే రాజుగారి వేగులకు రాజుగారికి ఏం చెబితే నచ్చుతుందో అలా తెలిసిపోతుందంతే.
అలా తెలియని వేగులకు ఎలాగూ సమస్యలు తప్పవు. తల కోటగుమ్మానికైనా వేలాడొచ్చు. వేగు కొలువు ఊడిపోయినా ఊడిపోవచ్చు. జగన్ విషయంలో కూడా అంతే తమ పార్టీ అధినేతకు ఏం చెబితే రుచిస్తుందో ఆయన పార్టీ క్యాడర్ కు తెలుసు. ఏమో వారికి అలా తెలిసిపోయిందంతే. కానీ అదే క్యాడర్ లో అలాంటి లోకజ్ణానం లేని వారు కూడా ఉన్నారు.
వారు అధినేత ముందు సమస్యలు ఏకరవు పెట్టారు. అభివృద్ధి, చేసిన పనులకు బిల్లులు, ఆగిపోయిన పెన్షన్లు అంటూ కొండవీటి చాంతాడంత జాబితాను జగన్ ముందు ఉంచారు. ఎలా అంటారా? తనకు అవసరమైతే తప్ప మంత్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్ పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కలిశారు అన్న అనుమానం కలుగుతోంది. జగన్ ను కలిసిన వారు ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన క్యాడరే. వాళ్లని కూడా అనేక వడపోతల తరువాత.. వారంతా జగన్ కు పరమ భక్తులని నిర్ణయించుకున్న తరువాత వారిని జగన్ ముందు ప్రవేశ పెట్టారు. అయితే వందిమాగధుల ఊహలు తల్లకిందులయ్యాయి. అంతటి భక్తులూ అధినేత ముందు సమస్యల చిట్టా విప్పేశారు. పార్టీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అధినేతకు నివేదించారు.
అసలు విషయమేమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ సమీక్షలకు ఉపక్రమించారు. ముందుగా ఆయన కుప్పం, రాజాం నియోజకవర్గాల క్యాడర్ తో భేటీ కావాలని అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేసి మరీ పిలిపించారు. వరుసగా రెండు రోజుల పాటు రోజు కో నియోజకవర్గం చొప్పున జగన్ సమీక్షించారు. అంతే అక్కడితో నియోజకవర్గ సమీక్షలను జగన్ బంద్ చేశారు. నియోజకవర్గ సమీక్షలు, క్యాడర్ తో సమావేశాలు అంటేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎందుకు అలా అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. పరిశీలకుల కథనం ప్రకారం జగన్ అభిమానులు టుది కోర్ అనుకున్న 50 మంది పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి మరీ నియోజకవర్గ సమీక్షల కోసం పిలిపిస్తే.. జగన్ ముందు వారు హాజరు ప్రభో అనడానికి ముందే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల అంశాలు తప్ప ప్రతికూల అంశాలు ఏ మాత్రం ప్రస్తావించవద్దని విస్పష్ట ఆదేశాలు ఇస్తే.. వారు మాత్రం జగన్ ముందు సమస్యలనే ఏకరవు పెట్టారట.
బిల్లులు, పథకాలలో కోతలు, రోడ్లపై గుంతలు, అడుగంటిన అభివృద్ధి అంటూ ఓ పేద్ద జాబితాను జగన్ ముందు ఇచ్చారు. కుప్పం క్యాడర్, రాజాం క్యాడర్ కూడా కూడబలుక్కున్నట్లు ఇవే విషయాలు ప్రస్తావించడంతో జగన్ ఇక క్యాడర్ తో కలిసే ప్రశక్తే లేదని ఖరాఖండిగా నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జగన్ నియోజకవర్గాల సమీక్ష రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక నియోజకవర్గాన్ని కాపాడుకుని, అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యతను ఉన్న చోట ఎమ్మెల్యేలకూ లేని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జీలకు అప్పగించేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు. దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి కొండలా పేరుకు పోతోంది. ఈ పరిస్థితిపై పార్టీ క్షత్రస్థాయి క్యాడర్ లో ఆందోళన పెరుగుతోంది. జగన్ ఇప్పటికైనా పట్టించుకుని క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున పని చేయడానికి క్యాడర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.