కౌన్ బనేగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ?
posted on Sep 20, 2022 @ 2:41PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం, మరో రెండు రోజులో అంటే గురువారం (సెప్టెంబర్ 22) నోటిఫికేషన్ విడుదల అవుతుంది. సెప్టెంబర్ 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అవసరం అయితే, అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ నిర్వహిస్తారు.అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు ఎన్నికంటూ జరుగుతుందా? ఆ అవసరం ఉంటుందా? అంటే, పార్టీ కీలక నేతలు సహా ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ తెలియక పోవడంతో, అధ్యక్ష ఎన్నికల వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అయితే, సోనియా గాంధీ ఎట్టి పరిస్థితిలోనూ, పగ్గాలు పరాయి చేతికి ఇవ్వరని, అవసరం అయితే, మళ్ళీ ఆమే బాధ్యతలు చేపట్టినా చేపడతారని అంటున్నారు.
నిజానికి, సోనియా గాంధీ విదేయ వర్గం ఇప్పటికే, ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఆదలా ఉంటే, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపధ్యంలో, రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ బలాన్ని పుంజు కుంటోంది. పార్టీ కీలక నేతలు కొందరు రాహుల్ గాంధీకి, విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.పీసీసీ తీర్మానాలు చేస్తున్నాయి. అలాగే, రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నికోవాలని సీనియర్ నేతలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతమైన సంస్కరణలు అవసరమంటూ రెండేళ్ళ క్రితం నుంచి డిమాండ్ చేస్తున్న జీ23 గ్రూప్ కు మద్దతు పెరుగుతోంది. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలని కాంగ్రెస్ యంగ్ గ్రూప్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిటిషన్ కు ఇంచుమించుగా ఓ వెయ్యి మంది వరకు యువనేతలు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా అనే విషయంలో,పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అదలా ఉంటే కాంగ్రెస్ యంగ్ గ్రూప్ పిటిషన్ స్వాగతించిన పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్’ పోటీకి సై అంటున్నారు. ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను ఆమె ముందుంచారు. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు, అంతర్గత ప్రజాసామ్యం అవసరమని,పార్టీకి మేలు చేస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ అన్నిటినీ మించి, పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారా? లేదా? అనేది, ఇంకా ఆయన మనసులోని మాటగానే ఉంది. ఇటీవల కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సమయంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో తమ మనసులో స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు, కానీ అదేమిటో మాత్రం బయట పెట్టలేదు. నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వత తాను పోటీ చేసేది లేనిది తెలిసి పోతుందని, సస్పెన్స్ ను మరింత పెంచారు.
నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి ఓడిపోయిన నేపధ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరో మారు అధ్యక్ష పదవి చేపట్టాలనే డిమాండ్ అప్పటి నుంచి వినిపిస్తూనే వుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారని అంటున్నారు. మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరనే ప్రచారం బలంగానే సాగుతోంది. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.
అదలా ఉంటే రాహుల్ గాంధీ చివరి వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వద్దే వద్దనే మాట మీద నిలబడితే, సోనియా విదేయ వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పోటీకి సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగానే, గెహ్లాట్ నామినేషన్ వేస్తారని, అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నిర్ణయంతో సంబంధం లేకుండా శశిథరూర్ కూడా నామినేషన్ వేస్తారని అంటున్నారు. అయితే చివరకు రాహుల్ గాంధీ, ఓకే అంటే ఇద్దరూ ఉపసంహరించుకునే అవకాశమే ఉందనీ అలాగే గెహ్లాట్, శశిథరూర్‌లలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనేది కూడా, చివరకు సోనియానే నిర్ణయిస్తారని అంటున్నారు.ఆ అవగాహనతోనే సోనియా గాంధీ, శశిథరూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.నిజంగా అదే జరిగితే, చాంతాడంత రాగం తీసి, అదేదో పాట పడినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు, మరో ప్రహసనంగా ముగుస్తుందని అంటున్నారు.