గుడివాడ నుంచి పోటీ చేస్తా.. నానిని ఓడిస్తా.. తెలుగువన్ ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి
posted on Sep 20, 2022 @ 11:39AM
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసి కొడాలినానిని ఓడిస్తానని రేణుకా చౌదరి అన్నారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన రేణుకా చౌదరి ప్రస్తుతం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొని రైతుల ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి వ్యాఖ్యలపై రేణుక ఘాటుగా స్పందించారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణుక కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అని రేణుకా చౌదరి అన్నారు. "బుజ్జీ నీకు చరిత్ర తెలియదు... రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్ కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్ అన్నారు.
కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే... ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి... నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చారనీ, ఇంతటి పబ్లిసిటీ ఎంత ఖర్చు పెట్టినా రాదనీ, కానీ నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది. అయితే కొడాలి నాని నియోజకవర్గం నుంచే తాను అసెంబ్లీకి పోటీ చేస్తాను, గెలుస్తానని రేణుకా చౌదరి అన్నారు.
తాను గుడివాడ నుంచి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను గుడివాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని చెప్పిన రేణుకా చౌదరి, కొడాలినానిని మళ్లీ ఎన్నుకోవడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా లేరని రేణుక అన్నారు.నా చరిత్ర, ఛరిష్మా, నా పోరాట తత్వం ఇవే తనను గెలిపిస్తాయని రేణుకా చౌదరి అన్నారు.