పెగాసన్ పై సభా సంఘం మధ్యంతర నివేదిక.. పెగాసన్ ప్రస్తావన ఏదీ?
posted on Sep 20, 2022 @ 4:56PM
పెగాసన్ పై గత అసెబ్లీ సమావేశాలలో నియమించిన సభా సంఘం.. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందని ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఇది ప్రాథమిక నివేదికే అన్న భూమన నేతృత్వంలోని కమిటీ ఇంకా సేకరించాల్సిన సమాచారం ఎంతో ఉందని చెప్పింది. ఇప్పుడు సభ ముందుంచినది మధ్యంతర నివేదిక మాతరమేనని భూమన కరుణాకరరెడ్డి సభకు తెలిపారు. ఇంతకీ పెగాసన్ సాఫ్ట్ వేర్ దుర్వినయోగంపై ఏర్పాటు చేసిన సభా సంఘం తన మధ్యంతర నివేదికలో ఆసలా విషయాన్నే ప్రస్తావించలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం డేటా చెరీ చేసిందంటూ పాత పాటనే సభా సంఘం తన నివేదికలో వల్లె వేసింది. డేటా చోరీ పేరుతో గతంలో వైసీపీ సర్కార్ పేట్టిన కేసులోని వివరాలనే ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం మరోసారి వల్లె వేసింది. అయితే ఆ కేసు ఎప్పుడో వీగిపోయింది.
పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు నియమించిన హౌస్ కమిటీ తన మధ్యంతర నివేదికలో పెగాసస్ అంశాన్ని కనీసం ప్రస్తావనగా కూడా తీసుకు రాలేదు. స్టేట్ డేటా సెంటర్లో ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని చేరవేశారనీ, తద్వారా వారికి ప్రత్యేక లబ్ధి చేకూరిందనీ పాత పాటనే మరోసారి వినిపించింది. ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందని పేర్కొంంది. గత ప్రభుత్వం సేవామిత్ర యాప్ ను ఇందు కోసం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఓట్ల తొలగింపు ఆరోపణలపై అప్పట్లోనే ఈసీ స్పందించింది.
ఎవరు పడితే వారు యాప్‌ల ద్వారా ఓట్లను తొలగిం సాధ్యం కాదని తేల్చేసింది. అలాగే ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం లేదని అప్పట్లో ఆధార్ స్పష్టం చేసింది. ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం తన మధ్యంతర నివేదికలో.. పాచిపోయిన ఆ విషయాలనే కొత్తగా కనుగొన్నట్లు పొందుపరిచింది.
రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఆరంభమైన నేపథ్యంలో భూమన నేతృత్వంలోని సభా సంఘం మధ్యంతర నివేదిక అంటూ అరకొర సమాచారం అసెంబ్లీ ముందు ఉంచడం ఆధారాలు బయట పెట్టకుండా ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకేనని తెలుగుదేశం అంటోంది.