ఫ్లయిట్‌లో సీటు మార్చారు ఎందుకో తెలుసా?
posted on Sep 20, 2022 @ 5:08PM
మొదటిసారి మెట్రో రైల్లోనో, విమానంలోనో ప్రయాణించేవారికి తలుపులు తెరుచుకోవడం తెలియాలి. కనీసం ఎవరన్నాచెబితే తెలుసుకోవాలి. అసలు అందుకు పక్కనున్నవారితో మాట్లాడ్డం తెలియాలి. అంటే భాషాపరమైన తేడాలు ఉంటే మాత్రం బహుత్ కష్ట్ హై! ఏది వచ్చినా రాకపోయినా ఈ రోజుల్లో కాస్తంత ఇంగ్లీషు మాత్రం చచ్చినట్టు వచ్చితీరాలి. లేకపోతే అనామకుని చూసినట్టు చూస్తారు. నువ్వు అరిచి గింజుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. విమానంలో సీటూ మారుస్తారు. ఇంగ్లీషోడి రూల్!
ఈరోజుల్లో మనవళ్లను చూసుకోను పెద్దవాళ్లు ఓపిక తెచ్చుకుని మరీ అవకాయజాడీలతో విదేశాలకు వెళు తున్నారు. బస్సెక్కినంత సులువే అన్నా..అనుకుంటారు. కానీ అసలు సమస్య కూచున్నతర్వాత నుంచి మొదలవుతుంది. మనూరు బస్సు సీట్ల కంటే మంచిసీట్లని విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ హఠా త్తుగా ఓ అమ్మాయి వచ్చి వాట్ యూ ఈట్? అనో ఆప్ క్యా ఖాతీ? అనో అడుగుతుంది. ఏవంటది అన్నా.. అని పక్కాయన్నోసారి అడిగితే మీ పని అయిపోయినట్టే. పక్కవాళ్లు చాలా చిరాగ్గా చూస్తారు. ఫ్లయిట్ అటెండర్ నవ్వుతుంది. వెనకాల కూచున్నాయనతో పెద్ద జోక్‌లా చెప్పి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. మనం జోకర్ అవుతాం. అదీ సంగతి. అంచేత రెండు ముక్కలు ఇంగ్లీషు, నాలుగు ముక్క లు హిందీ రావాలంటా రు మరి!
అన్నట్టు మరో ప్రమాదం కూడా ఉందండోయ్. పక్కవాళ్లకి మనం మాట్లా డేది అర్ధంగాకపోయినా, ప్రధాన రెండు భాషలు రాకపోయినా అమాంతం సీట్లు మార్చేయగలరు. ఆ ప్రమాదమూ ఉంది. బస్సులో లా కిటికీ దగ్గర సీటు దొరికిందని ఆనందించొద్దు. పక్కనున్నది మీ వూరు వాళ్లయితే ఫరవాలేదు.. కాకపోతేనే పెను ప్రమాదం. అమాంతం మిమ్మల్ని వెనక్కి పంపేస్తారు. మొన్నీమధ్యనే ఇండిగో విమానంలో ఇలాం టి సంఘటనే జరిగింది.
ఓ తెలుగు పెద్దావిడకి తెలుగు తప్ప మరో భాష రాదు. అది ఆమె తప్పు కాదు. కానీ తోటి ప్రయాణీకుడికి, ఫ్లయిట్ అటెండర్‌కీ ఇబ్బంది కలిగింది. ఏది అడిగినా సరిగా సమాధానం రావడం లేదు. అమెకు తెలుగు తప్ప మరో భాష రాదని అర్ధమయింది. అందువల్ల ఆమెను వేరే సీట్లోకి మార్చేరు. ఆమె పాపం తెగ కంగారు పడింది. ఇంగ్లీషు, హిందీ రాకపోతే దించేస్తారేమోనని! పైగా సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె సీటు మార్చవలసి వచ్చిందని ఫ్లయిట్ అటెండర్ సమాధానం చెప్పడం విడ్డూరం.
అసలు ఫ్లయిట్‌లో పనిచేసే సిబ్బందికి ప్రయాణీకులతో ఎలా వ్యవహరించాలన్నది శిక్షణలో నేర్పు తారు. భాషల విషయంలో ఇత రుల సహాయం తీసుకోమంటారు. కానీ పాపం ఆ పెద్దావిడ విష యంలో ఆ ఫ్లయిట్ అటెండర్ ఆ జాగ్రత్త పాటించలేదేమో! అన్నట్టు మీరన్న రెండు ముక్కలు ఇంగ్లీషు, హిందీ నేర్చుకోండి ..ఇలాంటి గోల ఉండదు.