చిరు పొలిటికల్ ఎంట్రీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ట్వీట్
posted on Sep 20, 2022 @ 3:55PM
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ 10 సెకన్ల ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం.. నా నుంచి దూరం కాలేదంటూ... చిరంజీవి చెప్పిన ఆడియో ట్విట్.. అ హాట్ టాపిక్ అయిపోయింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ ట్విట్‌పై ఓ వైపు మెగా అభిమానులు, మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అంటు కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లోని డైలాగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఏదీ ఏమైనా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌పై భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయన్నది మాత్రం నిజం. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు.. తమ పార్టీల విజయం కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అలాంటి వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కామెంట్స్... అదీ రాజకీయంపై చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు సైతం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి... 2009 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 18 సీట్లు కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టి... కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా జరిగారు.
మరో వైపు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా థియేటర్ల టికెట్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో తాడేపల్లిలో చిరంజీవి భేటీ అయ్యారు. దాంతో చిరంజీవికి మళ్లీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో చిరంజీవి.. స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్‌లో వదిలిన ఆడియో.. ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.