చౌతాలా ఆహ్వానం.. లైట్ తీసుకున్న కేసీఆర్
posted on Sep 20, 2022 @ 1:46PM
తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు కేంద్రంలో చక్రం తిప్పాలనే ప్రయత్నాలు అడుగడుగునా కుంటుపడుతున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ ఎల్ డి) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా కూటమిలో చేరేందుకు కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. హర్యానాలో ఈ నెల 25న చౌతాలా నేతృత్వంలో సమ్మాన్ సమారోహ్ నిర్వహించనున్నారు. ములాయంసింగ్ యాదవ్, టీఎంసీ అధినేత మమతాబెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నీతిస్ కుమార్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, ఎన్‌సిపి నేత శరద్‌పవార, అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ వంటివారంతా ఈ సమావేశంలో పాల్గొన డా నికి సిద్ధమయ్యారు.
అయితే ఈ సదస్సులో పాల్గొనడం వల్ల తనకు ప్రత్యేకించి కలిగే ప్రయోజనం ఏమీ లేదన్న అనుమానం తోనే కేసీఆర్ సదస్సుకు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నట్టు పరిశీలకులు పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ పర్యటనల్లో కలిసిన ఈ నాయకులు తనకు ప్రత్యేకించి మద్దతునిచ్చేంతగా ఆసక్తి ప్రదర్శించనే లేదు. దేశంలో ప్రతిపక్షాలన్నీ బీజేపీని వ్యతిరేకించి కేంద్రంలో బీజేపీ పరపతిని దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకు అన్ని విపక్షాలు ఒక్కతాటి పై నడవాల్సిన అవసరాన్ని వారూ గుర్తించారు. కానీ కార్యాచరణకు కేసీఆర్‌తో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కేసీఆర్ ఆశలు దెబ్బతిని ఇంటిముఖం పట్టారు.
ఆ తర్వాత టీఎంసీ నేత మమతా బెనర్జీ దాదాపు అదే సూత్రం మీద సమావేశం ఏర్పాటుచేసి అందరం చేతులు కలిపి ఒక మాట మీద నిలిచి ముందడుగు వేయాలని ప్రకటించారు. కానీ అందులో ఆమె ప్రాధా న్య తను, ఆమె ఆధిపత్యాన్ని పసిగట్టి కేసీఆర్ అందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. తాను కాలికి బలపం కట్టుకుని తిరిగినపుడు చూపని ఆసక్తి హఠాత్తుగా అదే పథంలో ముందుకు వెళదామంటూ చేతులు కలప మని అడగడంలో అర్ధంలేదని కేసీఆర్ భావించారు.
ఇక ఇపుడు తాజాగా చౌతాలా అదే రాగాన్ని అందుకున్నారు. మనం ఒక మాట అనుకుంటే ప్రణాళిక సిద్ధం చేసుకుని యుద్ధానికి సన్నద్ధం కావచ్చుననే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కానీ గతానుభవం మెండుగా వున్న కేసీఆర్ ఇందుకు విముఖతే ప్రదర్శించారు. ఐఎన్ ఎల్‌డి కేసీఆర్‌కు ఆహ్వానం పంపింది కానీ కేసీ ఆర్ ఇంకా సదస్సుకు వెల్లేదీ లేనిదీ నిర్ణయించలేదు. ఆహ్వానించిన మాట వాస్తవమేనని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. అయినా కేసీఆర్ స్వయంగా జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో కంకణం కట్టుకున్న పరిస్థితిలో మళ్లీ తాను వేరే కూటమిలో ఎలా చేరతారని టీఆర్ ఎస్ వర్గాల మాట. పైగా కేసీ ఆర్ కూడా ఇటీవలి బీహార్ పర్యటనలో తాను ఏ కూటమిలో చేరే ప్రసక్తి లేదని ప్రకటించారు కూడా. ఇపుడు అది కాదని మనసు మార్చుకుంటారన్నది అనుమానమే.
అయితే చౌతాలా పిలుపు, ఆ సమావేశంలో పాల్గొనాలా వద్దా అన్నది కేసీఆర్ తన పార్టీ సీనియర్లతో సంప్ర దిస్తున్నారని తెలుస్తోంది. నీతిష్, శరద్, మమతాబెనర్జీ, దేవెగౌడ తదితరులను గతంలోనే తమ నాయకు డు కలిశారు గనుక ఇపుడు ప్రత్యేకించి ఆ సమావేశానికి వెళ్లి వారితో చర్చించాల్సిన అవసరం పెద్దగా లేదనే అంటున్నారు.