డబ్బు కొట్టు పవర్ పట్టు.. కాసులే కేసీఆర్ అజెండానా?
డబ్బుకు లోకం దాసోహం, ఈ సామెతను ఎవరు నమ్ముతారో, ఎవరు నమ్మరో ఏమో, కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం,అదే నమ్మకంతో జాతీయ రాజకీయాల్లో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ముందడుగు వేస్తున్నారు. చేతిలో కాష్ ఉంటే కొండమీది కోతినే కాదు, ఢిల్లీ పీఠంపై అధికారాన్నికూడా ఇట్టే పట్టేయచ్చని చాలా గట్టిగా నమ్ముతున్నారు. నిజం. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేదుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ప్రధానంగా డబ్బు కేంద్రంగానే సాగుతున్నాయన్నదే అందరి మాటగా వినిపిస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ రాజకీయాలో ఎంట్రీ ఇచ్చేందుకు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఎన్ని కొట్లో ఏమో తెలియదు కానీ, చాలా కాస్ట్లీ డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం, ఢిల్లీలో భారీ శాలరీతో పీఆర్వోను నియమించారు. జాతీయ పత్రికలు, మీడియాలో పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టికల్స్, ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. అఫ్కోర్స్, అదంతా ప్రభుత్వ ఖాతా నుంచే వెళుతున్నా, సొమ్ములు ఎవరివి అయినా ముఖ్యమంత్రి కేసేఆర్, జాతీయ రాజకీయాల్లో డబ్బు మీద నడిచే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నారని పరిశీలకు విశ్లేషిస్తున్నారు.
నిజానికి,జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టాలనే ఆలోచనకు అంకురార్పణగా తీర్మానం చేసిన తెరాస 21వ ప్లీనరీ సమావేశంలోనే, తెరాస ఖజానా గురించి కూడా కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. నోట్ల కట్టల లెక్కలు చెప్పారు. పార్టీ బ్యాంక్ ఖాతాల్లో రూ.800 కోట్ల వరకు ఉన్నాయి, ఇతర ఆస్తులు, వడ్డీలు, ఇతర ఆదాయాలు, వస్తున్న విరాళాలు కలుపుకుంటే, పార్టీ సంపద రూ. 1000 కోట్లకు దాటిపోతుందని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు, ఒక్కసారి పిలుపిస్తే మరిన్ని వందల వేల కోట్లు వచ్చిపడతాయని, భారీ విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని కూడా కేసీఆర్ చెప్పారు. ఇదంతా కూడా జాతీయ పార్టీ పెట్టేందుకు తెరాసకు సొమ్ముల కొరత లేదని చెప్పేందుకు చేసిన ప్రయత్నంగానే పరిశీలకులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఇతర ప్రాంతీయ పార్టీలను ఆకట్టుకునేందుకే కేసీఆర్ తెరాస ఖజానా తలుపులు తీసి, సంపదను దేశం ముందు పరిచారు.
ఇక అక్కడి నుంచి దేశంలో తమ ప్రతిష్టను పెంచుకుకునేందుకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి, కేసీఆర్ ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఇలా అనేక రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు నిందులు సమకూర్చి రాజకీయ బేరసారాలు సాగిస్తున్నారని అంటున్నారు.
గతంలోనూ ఏపీలో వైసీపీకి, యూపీలో ఎస్పీకి ఇలా అనేక ప్రాంతీయ పార్టీలకు వందల కోట్ల రూపాయల మేర ఎ న్నికల నిధులను సమకూర్చారు. ఈ మధ్య కాలంలోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, గుజరాత్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరపింది కూడా అందుకే అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
మరోవంక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాలలో తమ రాజకీయ పలుకుబడిని పెంచుకునేందుకు, ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఉత్తరాది రాష్ట్రాల రైతులు సంవత్సరం పైగా సాగించిన ఆందోళనలో చనిపోయిన పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులకు, దేశ సరిహద్దులలో చనిపోయిన సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో మొదలు దేశ వ్యాప్తంగా, జాతీయ, ప్రాంతీయ పత్రికలో తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇక ప్రస్త్తుతానికొస్తే, దసరా పండగ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ ‘బంగారు’ తెరాస నిధులు, ఆర్థిక స్థోమత పై మరో మారు చర్చ మొదలైంది. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా తిరిగేందుకు, ఏకంగా రూ. 80 కోట్లతో సొంత చార్టెడ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయంచారని అంటున్నారు. అంతే కాదు, జాతీయ పార్టీ లాంచ్ కవరేజ్ కోసం దేశంలో ప్రధాన టీవీ చానల్స్ అన్నిటిలో, ఏకంగా స్లాట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అదే నిజమైతే, జాతీయ రాజకీయాల విషయం ఎలా ఉన్నా, రాష్ట్ర రాజకేయాల్లో మాత్రం సంచలనమే అవుతుంది. మరోవంక, ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.