దసరా తరువాత మోగనున్న మునుగోడు నగారా.. ?
posted on Sep 30, 2022 @ 12:14PM
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీ కంటే ప్రజలలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశమేదైనా ఉందంటే అది మునుగోడు ఉప ఎన్నికే. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు, ఆ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ మూడు ప్రధాన పార్టీల నేతలూ, కార్యకర్తలలోనే కాదు.. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరిలోనూ నెలకొని ఉంది. అయితే నవంబర్ లో ఉప ఎన్నిక ఉంటుందన్న అంచనాలు చాలా కాలం నుంచీ ఉన్నప్పటికీ.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి అందిన సమాచారం మేరకు దసరా తరువాత ఏ క్షణంలోనైనా మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంటే ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ లో జరిగే అవకాశం ఉంది.
ఇందుకు తగ్గట్టుగా ఉప ఎన్నిక ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక ఎర్పాట్ల వివరాలు తెలియజేయాల్సిందిగా కోరిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే వాటితో పాటే మునుగోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇక మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా కారణంగా అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను అసెంబ్లీ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశాననీ, రాష్ట్రంలో తెరాసనున దీటుగా ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆయన అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను అనివార్యం చేయడం ద్వారా వ్యూహాత్మకంగా పావులు కదిపిందని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించిన నాటి నుంచీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపింది. మునుగోడులో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాస ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
అదే సమయంలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కాంగ్రెస్ క్యాడర్ లో నిరుత్సాహం నిండుతుందన్నది కూడా బీజేపీ వ్యూహమని అంటున్నారు. అయితే రాజగోపాలరెడ్డి రాజీనామా అనంతరం అనూహ్యంగా బీజేపీ వెనుకబడి తెరాస, కాంగ్రెస్ లు పుంజుకున్నాయని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఊహించిన విధంగా రాజగోపాలరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్ కమలం గూటికి చేరలేదు. అంతే కాకుండా రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్లు బిగించే విషయంలో రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ ప్రజలలో ఆగ్రహాన్ని నింపాయని అంటున్నారు.
రాజగోపాలరెడ్డికే మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే కష్టమేనని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనను ఆ బాధ్యతకు దూరంగా ఉంచి ప్రచార బాధ్యతలను కేంద్ర నాయకులకు అప్పగించిందని చెబుతున్నారు. మొత్తం మీద దసరా తరువాత మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందన్న స్పష్టత రావడంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టీ అటువైపే మళ్లింది.