మూడొంతుల మందికి నో’ టికెట్ .. అందుకే గడప గడప టెస్ట్
కంటి రోగానికి పంటి మందు వేస్తే, ఏమవుతుంది? కంటి రోగం కుదరదు సరికదా, ఉన్న కన్ను పోతుంది. అంధత్వం మిగులుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తంతు కూడా అలాగే వుంది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు, ఆయన ఎమ్మెల్యేలకు పాఠాలు బానే చెపుతున్నారు. గడప గడపకు వెళ్ళక పోతే గండం తప్పదని, టికెట్ రాదని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ తంతు ఒక విధంగా గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించింది అన్నట్లుగా ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో డక్కామొక్కీలు తిన్న సీనియర్ మంత్రులు,ఎమ్మెల్యేలకు జగన్ గెలుపు పాఠాలు వినిపిస్తున్నారు. రాజకీయాల్లో షార్ట్కట్స్/అడ్డదారులు ఉండవని చెప్పు కొస్తున్నారు. నిజానికి, వైసీపీ ఎమ్మెల్యేల విషయం ఏమో కానీ. జగన్ రెడ్డి అడ్డదారిలోనే ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్ ఆకస్మిక, అసాధరణ మరణాన్ని జగన్ రెడ్డి సానుభూతిగా మలచుకుని అడ్డదారుల్లో రాజకీయ నిచ్చెనలు ఎక్కారు. అంతే కానీ, జగన్ రెడ్డి అందరిలా కష్టపడి కింది నుంచి పైకొచ్చిన నాయకుడు కాదు. ఆయన ఆస్తులు ఎలా సంపాదించారో, అధికారాన్ని అదే అరిలో అందుకున్నారు. అయినా, ఆయన రాజకీయాల్లో నిలబడాలంటే కష్టపడవలసిందే, జనంలో ఉండవలసిందే అంటూ,గడప గడప గడపకు వెళ్లి జనం ‘దీవెనలు’ అందుకోవాలని చెపుతున్నారు. నిజానికి, ముఖాన నెత్తురు చుక్క లేకుండా అయన ఎదురుగా కుర్చుని పాఠాలు వింటున్నవారిలో చాలా మందికి జగన్ రెడ్డి కంటే చాలా చాలా అనుభవమే వుంది. రాజకీయాల్లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గెలుపు ఓటముముల పోరాటంలో ఎదిగొచ్చిన వారే ఉన్నారు. అలాంటి సీనియర్ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి పాఠాలు చెప్పడం అయితే ఆయన గడుసు తనం అవుతుంది కాదంటే అజ్ఞానం అనిపించుకుంటుంది. అదీ కాదంటే ఆ ఎమ్మెల్యేల దౌర్భాగ్యం అవుతుంది తప్ప మరొకటి కాదని అంటున్నారు.
సరే అదలా ఉంటే ఇంతకీ, జగన్ రెడ్డి ఎందుకు గడప గడపకు కార్యక్రమం మీదనే అంతలా దృష్టి పెట్టారు? ఎందుకు గడప గడప సమీక్షలు పెట్టి, మంత్రులు, ఎమ్మెల్యేల ముఖాన ఓటమి ముద్ర వేసి అవమానిస్తున్నారు. అంత్య నిష్టూరం, కంటే ఆది నిష్టూరం మేలని భావించి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారా? లేనే లేదు. అలాంటి దేమీ లేదు. నిజానికి, మూడేళ్ళుగా ప్యాలెస్ గడప దాటకుండా, దాటినా పోలీసు బందోబస్తు మధ్య జనానికి దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గడప గడపకు మంత్రులు, ఎమ్మెల్యేలను బలవంతంగా తరమడం వెనక ఉన్న ఉద్దేశం ఆయన చెపుతున్నట్లుగా ‘ప్రేమ’ పూర్వక హెచ్చరిక కానే కాదు. ఒక విధంగా వదిలించుకునే ఎత్తుగడగానే పరిశీలకులు భావిస్తున్నారు.
నిజం, ఏమి చేసినా ఎంతమందిని మార్చినా ఓటమి తధ్యమని సర్వేశ్వరులు తేల్చి చెప్పిన నేపధ్యంలోనే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మందిని పైగా మార్చి కొత్త ప్రయోగం చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, అదొక్కటే అయన ముందున్న దింపుడు కళ్ళెం ఆశని, అందుకే వీలైనంత ఎక్కువ మందికి ఉద్వాసన పలికేందుకే జగన్ రెడ్డి ఎమ్మెల్యేలకు జనాగ్రహం రుచి చూపించి టిక్కెట్ రేసునుంచి తప్పించి సాగనంపేందుకే గడప గడపకు తరుముతున్నారని అంటున్నారు. నిజానికి ఇప్పటికే చాలా వరకు సిట్టింగులు, పోటీకి విముఖత చూపుతున్నారని అంటున్నారు.
గడప గడప నిజంగానే గెలుపు మంత్రం అయితే, ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి హెచ్చరికలను ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారు? మంత్రులు, మాజీలు, సీనియర్ ఎమ్మెల్యేలు ఎందుకు రేపటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు? వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు బుగ్గన, పేర్నినానీ వంటి కీలక నేతలు, వారసులను బరిలో దించుతామని అంటున్నారు. కుదరదని ముఖ్యమంత్రి వారి మెడ మీద కత్తి పెట్టి మరీ వారే పోటీ చేయాలని,వారే గడపగడప వెళ్ళాలని వత్తిడి చేస్తున్నారు? ఇది ఒక విధంగా పొమ్మన కుండా పోగా పెట్టే ఎత్తుగడేనని అంటున్నారు. అలాగే, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ‘అయ్యకు దిక్కులేదు.. సామెతను ఎందుకు గుర్తు చేస్తున్నారు. అంటే అందరికీ ఓటమి తప్పదనే నిజం స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే, ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని అనుకోవచ్చని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా ఓటమి తధ్యమని తెలుసు. ఆయన దగ్గర ఉన్న సర్వే నివేదికలు కళ్ళు బైర్లు కమ్మే నిజాలను చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుదు జరిగినా వైసీపీ ఓటమి ఖాయమనే పీకే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాదు, ముఖ్యమంత్రి 27 మంది పేర్లు మాత్రమే ఓటమి జాబితాలో చేర్చినా నిజానికి, మొత్తం 151 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలలో 27 మంది కూడా గెలిచే అవకాశం కూడా లేదని, సర్వేలు ఘోషిస్తున్నాయి.
అయితే, అందుకు ఎమ్మెల్యేలు మాత్రమే కారణం కాదు. ఎమ్మెల్యేలు కూడా కారణమే అయినా, ప్రధాన కారణం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనుభవ రాహిత్యంతో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలు చేసి వారికి విధులు, నిధులు లేకుండా చేసి, వాలంటీర్లతో పనులు కానీయడంతో ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. మరో వంక, మూడేళ్ళుగా నియోజక వర్గం అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు అడిగే ఏ చిన్నపనిచేయలన్నా, చేతులు ఆడని పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిక్కులు చూస్తున్నారు. మరోవంక మీట నొక్కితే ఓట్లు రాలతాయని ఆయన వేసుకున్నతప్పుడు లెక్కలు వెరసి, వైసీపీ గెలిచే సీట్లు రెండు పదులకు దాటవని పీకే సర్వేలే కాదు. అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఆ తప్పును ఎమ్మెల్యేల మీద పెట్టి, చేతికి బ్లడ్ అంటకుండా, వారిని ఎన్నికల బరినుంఛి తప్పించేందుకే ముఖ్యమంత్రి గడప గడప మీద అంత ఫోకస్ పెట్టారని అంటున్నారు.
నిజానికి గడప గడప వెళితే మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాల డబ్బులు, చాలా వరకు పక్కాగానే ఖాతాలలో పడుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా, మూడేళ్లలో మీట నొక్కి లక్షా 65 వేల కోట్ల రూపాయలు పంచింది నిజమే కావచ్చును, అలాగే, 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నది కూడా నిజమే కావచ్చును.కానీ, ముఖ్యమంత్రి భ్రమిస్తున్నట్లుగా 175 కు 175 స్థానాలు గెలిచే సానుకూల వాతావరణం మాత్రం లేదు.
ప్రజలు సంక్షేమ పథకాలు అందితే చాలని అనుకోవడం లేదు. అభివృద్ధి కోరుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు, కోరుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటున్నారు.సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందుకుంటున్న ప్రజలు కూడా గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యేలను రోడ్లు అడుగుతున్నారు. మౌలిక వసతులు ఏవని ప్రశ్నిస్తున్నారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడని నిలదీస్తున్నారు? విద్యా వైద్య సదుపాయాల గురించి అడుగుతున్నారు? మూడేళ్ళలో విద్యుత్ చార్జీలు ఏడు సార్లు, ఆర్టీసీ చార్జీలు నాలుగు సార్లు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయడం చేత కాదా? అని నిలదీస్తున్నారు. అంచల వారీ మధ్య నిషేధం ఏమైందని అడుగుతున్నారు. సంక్షేమ పథకాల పేరున చేస్తున్న అప్పులు, వసూలు చేస్తున్న పన్నులు ఏమవుతున్నాయని అడుగుతున్నారు. ఈ చేత్తో ఇస్తూ ఆ చేత్తో అంతకు పదిరెట్లు గుంజుకుంటున్న సర్కార్ దగా కోరు విధానాలను ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు గజగజలాడుతున్నారు.
నిజానికి ప్యాలెస్ లో కూర్చుని, కాలు కదపకుండా నిర్ణయాలు తీసుకునేది ఆయన. బటన్లు నొక్కేది ఆయన. రాష్ట్రంలో 85 శాతం మందికి ప్రభుత్వ సహాయం అందుతోందని లెక్కలు చెప్పేదీ ఆయనే, అలాగే, బటన్ నొక్కడం ద్వారా మూడేళ్లలో లక్షా 65 వేల కోట్ల రూపాయలు పంచిపెట్టినట్టు స్వయంగా ప్రకటించుకున్నదీ ఆయనే. ఎమ్మెల్యేలు, మంత్రులు పేరుకు మాత్రమే పదవులలో ఉన్నారు. నిజానికి, తొమ్మిది నెలల క్రితం నియోజక వర్గానికి రూ. 2 కోటల వంతున అభివృద్ధి నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. కానీ, రెండు కోట్లు కాదు రెండు వందలు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. ప్రజలు అడిగే చిన్న చిన్న పనులకు ఆయినా, పైసా విదిల్చే పరిస్థితి లేదు. అందుకే, మంచైనా, చెడైనా అన్నిటికీ బాధ్యుడు మీట నొక్కే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే, అదుకే, రేపటి ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు.