వెంకన్న దేవునికి జగనన్న అవమానం...అందుకేనా ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ ‘రెడ్డి’ ది ఏ కులం? ఏ మతం? ఇలా ప్రశ్నించడం, ‘సభ్య’ సమాజానికి సమంజసం అనిపించక పోవచ్చును, కానీ, ఎంత కాదనుకున్నా, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన కులం ఏమిటి? ఆయన మత విశ్వాసం ఏమిటి? అనే అంశం చర్చకు వస్తూనే వుంది. వస్తూనే ఉంటుంది కూడా. ముఖ్యంగా, ఇతర మతస్తుల, ముఖ్యంగా మెజారిటీ మతస్తులు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రవర్తించి నప్పుడు, తప్పయినా, ఒప్పయినా ఇంకేదైనా, ముఖ్యమంత్రి మత విశ్వాసాలు తప్పని సరిగా చర్చకు వస్తూనే ఉంటాయి.
అందులోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందూ దేవాలయాల పై వరుస దాడులు పెరిగాయి. దేవీ, దేవతల విగ్రాహాలు ద్వంసం చేసే దురాగతాలు పెరిగి పోయాయి. రథాలను దుండగలు తగల బెట్టారు. మరో వంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు మహా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ప్రతి రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే, క్రైస్తవులకు ప్రత్యేక దేశం కావాలనే, డిమాండ్ వరకు వెళ్ళింది. ఇదంతా ముఖ్యమంత్రి ప్రోత్సాహం, ప్రోద్బలంతో సాగుతోందా లేదా అనేది పక్కన పెడితే, జరుగతున్న పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి మత విశ్వాలు చర్చకు రావడం తప్పు కాదు. వస్తాయి,
వస్తూనే ఉంటాయి. నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,అయన కుటుంబ మత విశ్వాసాల గురించి ఎవరికీ, ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇందుకు సమబందించి జగన్ రెడ్డి తల్లి విజయమ్మ బైబిల్ సాక్షిగా, చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా కాలం క్రితం, ఒక ఇంటర్వ్యూలో ఆమెను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమె ఏ మాత్రం తడబాటు లేకుండా, “మాది క్రైస్తవ కుటుంబం. ఏసు ప్రభువు ఒకడే దేవుడు అని నమ్మే క్రైస్తవ ధర్మాన్ని, మా కుటుంబం దేవుని వాక్కుగా విశ్వసిస్తుంది. కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాలు అన్నీ, క్రైస్తవ ధర్మం ప్రకారమే జరుగుతాయి” అని స్పష్టంగా చెప్పారు.
అంతే కాదు, రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) కానీ, జగన్ కానీ, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, రాజకీయ అవసరాల కోసం హిందూ దేవాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందువుల పండగలు, పబ్బాలలో మొక్కుబడిగా మాత్రమే పాల్గొంటారని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. అంతే కానీ, క్రైస్తవ ధర్మాన్ని మాత్రం ఆ క్షణంలో కూడా మరవరని విజయమ్మ అంతే స్పష్టంగా చెప్పారు. విజయమ్మ చెప్పిన సత్య్యాన్ని పక్కన పెట్టినా, కళ్ళ ముందు జరుగతున్న పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి,“ఏసు దేవుడు ఒక్కడే దేవుడు”, ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను వారు వారు విశ్వసించరు అనే నిజం, వారి చర్యలలో స్పష్టంగా దర్శనమిస్తూనే వుంది. అందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు.
జగన్ రెడ్డి చాలా సందర్భాలలో మాటకు ముందో మారు, చివరో మరో మారు దేవుని ప్రస్తావన చేస్తారు. దైవ స్తుతి చేస్తారు. అయితే, అమాయకంగా, హిందువులు ఎవరైనా, ఆయన ప్రస్తావించిన, దేవుడు, ముక్కోటి దేవతలు ఆరాధించే, వెంకన్న దేవుడనో, కనకదుర్గమ్మ తల్లనో, అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ఆయన పగటి పూట పలవరించినా, రాత్రులలో కలవరించినా ‘ఏసు’ దేవుని నామమును మాత్రమే పలుకుదురు. మరో, దేవున్ని మనసులోకి రానీయరు. ఆలాగే ఆయన రాత్రులలో నేరుగా దేవునితో మాట్లాడినా, ఏసు దేవునితోనే మాట్లాడతారు కానీ , పక్కనే ఉన్నారు కదా అని మంగళగిరి పానకాల స్వామితోనో, మన వైజాగ్’ కు దగ్గరగా ఉన్నారని సింహాద్రి అప్పన్నతోనో మాట్లాడరు. ఆయన ఏసు ప్రభువునే ధ్యానిస్తారు, ఏసు ప్రభువునే ఆరాధిస్తారు.
ఏసు ప్రభువుతోనే మాట్లాడతారు. కలలో అయినా, ఆయన, ఏ ‘హిందూ’ దేవుడిని దేవుడినిగా గుర్తించరు. ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఏ ఒక్కరి పేరూ పొరపటున అయినా ఉచ్చరించరు. అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నుదుటున బొట్టు లేదని, అయన వెంట వారి సతీమణి రాలేదని, లేరనీ, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఇప్పుడు మళ్ళీ మరో మారు ముఖ్యమంత్రి మత విశ్వాసాల విషయం చర్చకు వచ్చింది.
నిజానికి ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలను పాటిస్తే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇతర మత విశ్వాసాలను, ముఖ్యంగా హిందువుల విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలను అగౌరవ పరిచే విధంగా, ముఖ్యమంత్రి ప్రవర్తన, సర్కార్ తీరు ఉంటున్నాయనేదే హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ.
ప్రస్తుత విషయానికే వస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా వస్తోంది. నిజానికి, దేవుని కార్యానికి అనే కాదు, హిందూ ధర్మం,ఆచార, వ్యవహారాల ప్రకారం పెళ్లి, పేరంటం ఏదైనా, తల్లి తండ్రులు, పెద్దలు, పిల్లలు ఎవరైనా దంపతులకు దంపతులే బట్టలు పెడతారు. అంతేకానీ, ఇలా ఒంటరిగా వచ్చి బట్టలు పెట్టడం ఉండదు. అలాంటిది, ఆ దేవ దేవునికి ముఖ్యమత్రి ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించడం,అపచారం. అవమానం. హిందువుల మనోభావాలను కించపరిచే, అపరాధం. నిజమే, ఏసు నాథుని తప్ప మరో దేవుని పేరును ఉచ్చరించడమే మహా పాపమని, ‘సెక్యులర్’ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భావిస్తే భావించ వచ్చును, అది వారి విశ్వాసం. అలాటప్పుడు, ముఖ్యంత్రి అయినా, మనసు చంపుకుని మొక్కుబడి తంతుగా కార్యక్రమలో పాల్గొనడం ఎందుకు? ఇంచక్కా దేవాదాయ శాఖ మంత్రి దంపతులకో, లేదా మరో మంత్రికో ఆ కార్యం అప్పగిస్తే, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కాదా? ముఖాన బొట్టు పెట్టుకోవలసిన అవసరం ఉండదు కదా? ఇలా, తమ మనస్సును కష్ట పెట్టుకొంటూ, కోట్లాది హిందువుల మనోభావాలను కించే పరచడం అవసరమా? ఇదే ఇప్పడు హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ముఖ్యమంత్రిని అడుగుతున్న ప్రశ్న.