ఇంతవరకు ఇదీ ... కథ.. కహానీ ఔర్ బాకీ హై!
posted on Sep 30, 2022 @ 5:48PM
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ముందునుంచి నేను రేసులో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్’ అన్నంత పని చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా నామినేషన్ల గడువు చివరి రోజు శుక్రవారం( సెప్టెంబర్ 30) నామినేషన్ దాఖలు చేశారు.
అంతే కాకుండా, పరోక్షంగానే అయినా, గాంధీలకు వ్యతిరేకంగా జీ 23 స్వరాన్ని వినిపించారు. గాంధీ కుటుంబ బయటి వ్యక్తిగా బరిలో దిగారు. నిజానికి గతంలో శరద్ పవార్, రాజేష్ పైలెట్, జితేంద్ర ప్రసాద , సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదివికి బరిలో దిగినా, ఒకటి రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేక పోయారు. ఈ నేపధ్యంలో, అధిష్టానం అధికారిక అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారంటే, ఒక విధంగా శశిథరూర్ సాహసమే చేస్తున్నారు. ఆఫ్కోర్స్, ఈ ఎన్నికల్లో అయన ఓడి పోయినా, ఆయనకు పోయేదేమీ లేదు. మహా అయితే, మళ్ళీ మరో మారు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే అవకాశం రాక పోవచ్చును, కానీ అదే ఆయన గెలిస్తే మాత్రం అది కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయిగా నిలిచి పోతుంది. చరిత్ర సృష్టించిన హీరో అవుతారు.
సరే శశిథరూర్ విషయం అలా ఉంటే 10 జనపథ్ (సోనియా గాంధీ నివాసం) కేంద్రంగా సాగిన అసలు కథ హాలీవుడ్ సస్పెన్స్ థిల్లర్ ను మరిపించింది. సోనియా గాంధీ ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పికప్ చేశారు. ఆయన, ముఖ్యమంత్రి పదవి వదిలి, ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా లేక పోయినా, ఒప్పించి, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దించారు. ఆ తర్వాత ఏమి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు అనుకున్న గెహ్లాట్ , ఎదురు తిరిగారు. సచిన్ పైలెట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రి చేస్తే ఒప్పుకునేది లేదని షరతు విధించారు. ఎక్కడా ఎవరికీ, అనుమానం రాకుండా, ఏకంగా 90 మంది ఎమ్మెల్యేలను కూడగట్టి, మూకుమ్మడి రాజీనామా అస్త్రాన్ని సంధించారు.
అధిష్టానం ఆదేశాలను దిక్కరించారు. సరే ఆ తర్వాత సారీ చెప్పారనుకోండి అది వేరే విషయం. కట్ చేస్తే... రెండు రోజుల హై డ్రామా తర్వాత సోనియా గాంధీ గెహ్లాట్ ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించారు. మరో గాంధీ ఫ్యామిలీ విధేయుడు దిగ్విజయ్ సింగ్ ను తెర మీదకు తెచ్చారు. ఓ 24 గంటలు ఆయన చుట్టూనే కథ నడిచింది. దిగ్విజయ్ స్వయంగా, కాంగెస్ అధక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ వేస్తున్నట్లు కూడా చెప్పారు.
అంతే కాదు అంతకు నాలుగు రోజుల ముందు, అలాంటి ఆలోచన లేదని చెప్పిన దిగ్విజయ్ రాహుల్ గాంధీ యాత్ర నుంచి నేరుగా, ఢిల్లీ వచ్చి ఎన్నికల బరిలో ‘టోపీ’ వేశారు. కానీ, ఆఖరి క్షణంలో ఆయన డ్రాప్ అయ్యారు. ఆయన స్థానంలో లేటుగా వచ్చినా లేటెస్టుగా .. వచ్చినా .. అమ్మ ఆశీస్సులు ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆఖరి క్షణంలో వచ్చి నామినేషన్ వేశారు. దిగ్విజయ్ సింగ్ తనకు ఖర్గే పై ఉన్న ‘అపరిమిత’ గౌరవం కారణంగా పోటీ నుంచి తప్పుకుని ఖర్గే కు మద్దతు ప్రకటించారు.
నిజమే ఇక్కడ ఎక్కడా సోనియా గాంధీ ప్రత్యక్షంగా తెర మీదకు రాలేదు కానీ, కథ మొత్తం 10 జనపథ్ కేంద్రంగానే జరిగింది. అదేమీ రహస్యం కాదు. నిజానికి, సోనియా గాంధీ చాలా స్పష్టంగా తను న్యూట్రల్ గా ఉంటానని, ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని శశిథరూర్ కు మాటిచ్చారు. కానీ, జరిగిన కథ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. అయితే, ఇంతటితో అయిపొయినట్లేనా లేక ఇంకా కథ మిగిలే ఉందా.. అంటే .. కహానీ ఔర్ బాకీ హై అనే అంటున్నారు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది, అప్పటి వరకు, ఏదైనా జరగవచ్చును. ఇంతవరకు ఇదీ కథ .