అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం గూటికి తెరాస !
జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏకమయ్యేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రెండు రోజుల క్రితం హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఐఎన్ఎల్డీ బహిరంగ సభ వేదికగా చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీల నేతలు, కాంగ్రెస్, వామ పక్షాలతో కలిసే ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో కీలక భూమిక పోషించిన, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధ్యక్షుడు, నితీష్ కుమార్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్, నాల్గవ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడే కూటమి మాత్రమే బీజేపీని ఓడించగలుగుతుందని, స్పష్టం చేశారు. బీజీపే, బీజేపీ యేతర పార్టీల ఏక కూటమి ఒక్కటే ఉంటుందని మూడవ కూటమి వలన ప్రయోజనం ఉండదని అది వృధా ప్రయాసే అవుతుందని, తెగేసి చెప్పారు. జేడీయు, ఆర్జేడీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ తో కలిసి సాగుతాయని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాలని పిలుపు నిచ్చారు.
ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసున్న ఎన్సీపీ, శివసేన, డిఎంకే, జేఎంఎం, ఆర్జేడీలతో పాటుగా, కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉన్న ఇతర పార్టీలు కుడా కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు సుముఖంగా ఉన్నాయని నితీష్ కుమార్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ ఇక్కడ తెరాస పేరు ప్రస్తావించక పోయినా ఇటీవల కేసీఆర్, పాట్నా వెళ్లి నితీష్ కుమార్ తో చర్చలు జరిపిన నేపధ్యంలో ఆయన పిలుపు ఇచ్చిన పార్టీలలో తెరాస కూడా ఉండవచ్చని అంటున్నారు.
అంతే కాదు కాంగ్రెస్ ఫ్రంట్ కు బ్ఫ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ అంతకు ముందే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలు అన్నీ ఒకటిగా పోటీచేయాలని, అందుకు కాంగ్రెస్ సహకరించాలని కోరారు. అంతే కాదు విపక్షాలను ఏకం చేయడంలో సోనియా గాంధీ చొరవ చూపాలని లాలూ, నితీష్ విజ్ఞప్తి చేశారు. అందుకు సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల విషయం చర్చిద్దామని హామీ ఇచ్చినట్లు నితీష్ మీడియాకు తెలిపారు.
సరే విపక్ష పార్టీలన్నీ నిజంగా ఒకటవుతాయా? మోడీని ఓడిస్తాయా? మోడీ చేతిలో ఓడి పోతాయా? అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర, థర్డ్ ఫ్రంట్’/ప్రాతీయ పార్టీల కూటమి అంటూ చాలా కాలంగా, చాలాచాలా ప్రయత్నాలు చేస్తున్న, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఏమి చేస్తారు. జాతీయ రాజకీయాలలో ఏ గట్టునుంటారు? కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా? సొంతగా జాతీయ పార్టీ పెట్టి, ఎన్నికల అనంతరం సమయానుకూల నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా సాగుతోంది. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు, కేసీఆర్ కు ఎలాంటి అభ్యతరం లేక పోయినా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయంలో అయన ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారని అంటున్నారు.
అందుకే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగి అవసరం అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి, బీహర్ తరహాలో తెరాస,కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసి, ఆపైన లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సారధ్యంలోని జాతీయ కూటమిలో చేరాలనే, ‘ఉభయ తారక’ ఆలోచన చేస్తున్నారని. అంటున్నారు. నిజానికి ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో ఆయన ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఒక వర్గం తెరాసతో పొత్తు వైపు మొగ్గు చూపుతుంటే,మరో వర్గం పొత్తు వద్దని గట్టిగా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస ఇంటి మీద కాకి కాంగ్రెస్ గూటి మీద వాల రాదని కండిషన్ పెట్టారు. అయితే, ఇప్పటికే కాంగ్రెస్, తెరాస ఒకటే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిస్తోంది. అయితే ఏది ఏమైనా, జాతీయ రాజకీయ అవసరాల కోసం తెరాస కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగానే కనిపోస్తోందని జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి. అయితే అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అన్నదే ప్రశ్నగా పరిశీలకులు పేర్కొంటున్నారు.