ఐఎస్బీ చంద్రబాబు ఫొటో లేకపోవడమేంటి.. వెంటనే ఏర్పాటు చేయండి.. మాజీ సీజేఐ
ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్టం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.
కేవలం చంద్రబాబు దూరదృష్టితో చేసిన ప్రయత్నం వల్లనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ కు వచ్చింది. కేవలం రెండు దశాబ్దాలలోనే ఐఎస్ బి హైదరాబాద్ అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు పొందింది. ఇదే విషయాన్ని ఇటీవల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మరోమారు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నాడు ఆయన చేసిన బృహత్ప్రయత్నానికి కొందరు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారనీ, చివరికి కేసులు వేసి మరీ అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ చెప్పారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ఇటీవల నిర్వహించిన ‘లీడర్‌షిప్ సమ్మిట్-22’ను జస్టిస్ రమణ ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు.
ఆ సందర్భంగా ఐఎస్బీకి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన కేసును తానే వాదించానని గుర్తు చేసుకున్నారు. ఆ కేసు తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారు ఉంటారనీ, ఐఎస్బీ విషయంలో కూడా అలాగే జరిగిందనీ పేర్కొన్న జస్టిస్ ఎన్వీ రమణ.. చంద్రబాబు దార్శనికతతో, పట్టుదలతో ఐఎస్బీ హైదరాబాద్ కు రావడానికి ప్రయత్నించి సఫలికృతులయ్యారని పేర్కొన్నారు. అటువంటి చంద్రబాబు ఫొటో ఐఎస్బీలో లేకపోవడం బాధాకరమని చెప్పిన జస్టిస్ ఎన్వీ రమణ వెంటనే ఆయన ఫొటో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
నిజమే హైదరాబాద్ కు ఐఎస్బీ రావడానికి చంద్రబాబు దార్శనికత, సమర్ధత కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి చంద్రబాబుకు మూడు నెలల కిందట జరిగిన ఐఎస్బీ ద్విశతాబ్ది వేడుకలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. రాజకీయ కారణాలతో ఒక దార్శనికుడిని మరగున పడేద్దామన్న ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించదనడానికి జస్టిస్ రమణ ప్రసంగమే ప్రత్యక్ష నిదర్శనం.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆసియాలో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న యోచనతో ప్రపంచంలోని 500 పరిశ్రమలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చారని తెలిసిన క్షణం నుంచీ దానిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని చంద్రబాబు పడిన తపన, పడిన శ్రమ, చూపిన పట్టుదల, అందుకోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన తీరూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల ఉన్నతిని కాంక్షించి చూపిన చొరవ చరిత్ర ఎన్నటికీ విస్మరించదు. అయితే కేవలం రాజకీయాలే పరమావధిగా భావిస్తున్న కొందరు రాజకీయ నాయకులు, మేధావులుగా గుర్తింపు పొంది పాలకుల కాళ్ల కింద బానిసల్లా బతుకుతున్న కొందరు విద్యావంతులూ మాత్రం ఆయన విస్మరించి ద్విశతాబ్ది వేడుకలు నిర్వహించారు. అలా చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడం వంటి ప్రయత్నమేనని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగం మరోసారి తేటతెల్లం చేసింది.
అసలు ఐఎస్ బీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడానికి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవలను ఒక సారి గుర్తు చేసుకుంటే.. అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు.
అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నవిధానంపై దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ. దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు.
ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు. ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు. ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు. అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు. అలా వచ్చిన వారిని ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు. స్వయంగా బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు. చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది. బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు. అయితే అంతటితో పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. ఆరోపణలు గుప్పించింది.
కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది. అదిగో ఆ విషయాన్నే తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్లో చెప్పారు. సరే అదలా ఉంచితే రాష్ట్రంలో ఐఎస్బీకి రాయతీలు ఇవ్వడాన్ని అప్పట్లో ఇక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తే కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రానికి ఐఎస్ బీని సాధించలేకపోయినందుకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు.
చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది. 2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది.