దసరా రోజున ఏమి జరుగుతుంది?.. తెరాసలో ఉత్కంఠ
అక్టోబర్ 5, దసరా పండగ రోజు ఏమి జరుగుతుంది? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆ రోజున తెలంగాణ భవన్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, చేసే సంచలన ప్రకటన ఏమిటి? జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా ? కేసీఆర్ కుమారుడు, తెరాస ఉపాధ్యక్షుడు కేటీఅర్’ ను తెరాస అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చివరకు ఏమి జరుగుతుంది, అనేది మాత్రం ఎవరూ ఉహించలేక పోతున్నారు.
అదొకటి అలా ఉంటే, కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం వలన, ఆయన ఏమి అశిస్తున్నారు అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసేఆర్ వెంట నడచిన ప్రొఫెసర్ కోదండ రామ్ సహా అనేక మంది ఉద్యమ నాయకులు, కేసేఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు వెనక ఉదాత్త ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయని,అనుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ సంక్షోభం నుంచి బయట పడేందుకు కేసీఆర్ ఒక ఎత్తుగడగా జాతీయ పార్టీ ఏర్పాటు చర్చను తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల్లో రోజుకు రోజుకు పెరుగతున్న వ్యతిరేకత నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే, ఈ ఎత్తుగడగా పేర్కొంటున్నారు.
అంతేకాదు, తెలంగాణ అస్థిత్వవాదం పునాదిగా ఏర్పడిన తెరాస జాతీయ పార్టీ గా ఎదగడం అయ్యే పని కాదనే అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తున్నారు.అంతే కాదు, తెలంగాణ వాదాన్ని వదిలేస్తే, తెరాస మనుగడ కూడా కష్టమవుతుందని అంటున్నారు. ఒక విధంగా, ముఖ్యమంత్రి కేసేఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని అంటున్నారు.
అలాగే, పండగ పూట నిర్వహిస్తున్న సమావేశంలో జాతీయ పార్టీకి సంబంధించి, కొంత చర్చ, ఒకటి రెండు తీర్మనాలు మినహా సంచలన ప్రకటన ఏదీ ఉండక పోవచ్చని కూడా అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఒకటికి పదిసార్లు ఏకరవు పెట్టిన, దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణలో అమలవుతున్న పథకాల పాత పాటనే మళ్ళీ మళ్ళీ వినిపించే అవకాశం ఉండని అంటున్నారు. అదే విధంగా జాతీయ పార్టీ పేరున ఇప్పడు జరుగతున్న తతంగం అయితే కొనసాగుతుందని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, పండగ పూట నిర్వహించే తెరాస సమావేశంలో నిజంగా సంచలన ప్రకటన ఏదైనా ఉంటుందనుకుంటే, పార్టీ పగ్గాలు కొడుకు కేటీఆర్ కు అప్పగించడమే అవుతుందని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని ముందుగా ప్రకటిస్తే, ఇటు మీడియాలో, అటు పార్టీలో ఫోకస్ అంతా అటు మరలే ప్రమాదాన్ని పసిగట్టే ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అంశాన్ని ముందుంచి అసలు విషయం నుంచి ఫోకస్ తప్పించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.నాయకత్వ మార్పిడిని ఎవరూ ప్రశ్నించకుండా, అదొక సహజ పరిణామంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తెర మీద జరుగతున్న తతంగం అంతా జాతీయ పార్టీ చుట్టూ తిరుగుతున్నా తెర వెనక జరుగతున్న కథ మాత్రం, ఎప్పటి నుంచో అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న కేటీఆర్ పట్టాభిషేకానికి మరో ముందడుగుగా భావించ వచ్చని అంటున్నారు.
అందుకే ముఖ్యమంత్రి కేసేఅర్ శనివారం (సెప్టెంబర్ 1) వరంగల్ సభలో, కేంద్రం పై విమర్శల కంటే యువత పై ఎక్కువ ఫోకస్ పెట్టారని, దేశ భవిష్యత్ ను యువత కాపాడు కోవాలని పిలుపు నిచ్చారని అంటున్నారు. అలాగే, ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి తమ వయసు 68 సంవత్సరాలని గుర్తు చేయడం కూడా అందుకేనని అంటున్నారు. అయితే, జాతీయ పార్టీ ఏర్పాటు, విషయంలో ముఖ్యమంత్రి వెనకడుగు వేసినట్లు కాదని, అయితే, పండగ సమావేశం ప్రధాన లక్ష్యం మాత్రం అది కాదని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగ్తుతుంది అనేది, వేచి చూడవలసి ఉంటుందని అంటున్నారు.