వన్డేల గెలుపు దూకుడుతో ఆసియాకప్ కి హర్మన్‌ప్రీత్ జట్టు
posted on Sep 30, 2022 @ 4:08PM
ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ వన్డేసిరీస్‌లో ఎంతో దూకుడుగా ఆడి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మహిళల జట్టు ఆసియాకప్ లోనూ అదే ధాటితో ఆడి విజేత కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. సూపర్ స్టార్ హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత్ మహిళల జట్టు శనివారం ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ శ్రీలంకతో తలపడుతుంది.
ఇటీవలి కాలంలో టీ-20లో భారత్ అంతగా రాణించడం లేదు. ముఖ్యంగా ఆసియాలో చెప్పుకోదగ్గ ప్రావీ ణ్యత ప్రదర్శించలేకపోయింది. అయితే మొత్తం మీద చూసుకుంటే, ఆసియా కప్ ఆరంభమైనప్పటి నుంచి 2004 నుంచీ టైటిల్విజేత భారత్ నిలవడం భారత్ మహిళల క్రికెట్‌కు గర్వకారణమనే చెప్పాలి. ఈ టోర్నీలో నాలుగు పర్యాయాలు వన్డే టైటిల్స్, 2 టి-20 టైటిల్స్ కైవసం చేసుకుంది. కాగా ఆసియాకప్ వన్డే ఫార్మాట్ నుంచి టీ-20 ఫార్మాట్‌కి 2012లో మారింది. అప్పటి నుంచి రెండు పర్యా యాలు విజేతగా నిలిచింది. కాగా 2018లో మాత్రం శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
కాగా, ఈ టోర్నీలో భారత్ ఆధిపత్యం మరింత కొనసాగించాల్సి ఉంది. నాలుగేళ్ల తర్వాత ఇపుడు మంచి అవకాశం వచ్చింది. పైగా ఇంగ్లండ్ మీద గెలిచిన ఊపులో ఉన్న జట్టు తప్పకుండా టోర్నీ విజేతగా నిలిచే అవకాశాలున్నాయని క్రికెట్ పండితులు అంటున్నారు. బంగ్లదేశ్ లో 2020 లో జరగాల్సిన టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదాపడింది. తర్వాత అప్పటి టోర్నీ రద్దయింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత భారత్ జట్టు కాస్తంత ఇబ్బందుల్లో పడింది.
ఆ వెంటనే జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. కానీ హర్మన్‌ప్రీత్ జట్టు వన్డేల్లో ఇంగ్లండ్ జట్టును 3-0 తేడాతో ఓడించి పగదీర్చుకుంది. సిరీస్ విజయం ప్రముఖ ఆల్‌రౌండర్ ఝులన్ గోస్వామి చివరి సిరీస్ అయింది. దీని తర్వాత ఆమె రిటైరయ్యారు. ఆమెకు భారత్ జట్టు ఆ విజయాన్ని అంకితం చేసింది.
జట్టు కూర్పు విషయానికి వస్తే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ఫామ్‌లో ఉంది, అలాగే స్మృతీ మంధాన, షఫాలీవర్మ, సబ్బినేని మేఘన, హేమలత కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరంతా ఆసియా కప్‌లో పరుగుల వరద సృష్టించే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ పర్యటన సమయానికి గాయంతో జట్టుకు దూర మయిన రోడ్రిగ్స్ , వికెట్ కీపర్ రిచాఘోష్ కూడా జట్టులోకి వచ్చారు. బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి పటిష్టంగా మంచి ఫామ్‌లో ఉన్నారు.
కాగా శ్రీలంక విషయానికి వస్తే, కెప్టెన్ చమరి అటపట్టు మీదనే ఎక్కువ బాద్యత ఉంది. విష్మి గుణరత్నే జట్టులో లేకపోవడంతో ఆమె అన్ని విధాలా జట్టు బాధ్యతను స్వీకరించాల్సి వస్తుంది. మిడిల్ ఆర్డర్‌లో హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ గట్టి పోటీనివ్వవచ్చు.
హర్మన్ ప్రీత్ నాయకత్వంలోని భారత్ జట్టులో స్మృతి,దీప్తి, షఫాలీ, రోడ్రిగ్స్, సబ్బినేని, రిచా ఘోష్, స్నేహరాణా, హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజావస్త్రకార్, రాజేశ్వరీ గైక్వాడ్, రాధాయాదవ్, కె.పి.నావగరి ఉన్నారు.
చమరి అట్టపట్టు నాయకత్వంలోని లంక జట్టులో నీలాక్షి డి సిల్వా, కావిష దిల్హారి, అచ్చిని కులసూర్య, సుగంధిక, హర్షిత, మధుషిక, హాసిని పెరీరా, ఒషాడి రణసింఘే, ఇనోకా రణవీరా, అనూష్క సంజీవిని, కౌషాని, మాల్సా షెహానీ, రష్మీ సిల్వా, తరికా సివాండీ ఉన్నారు.