కేటీఆర్’కు పట్టాభిషేకం.. హరీష్ రావుకు..?
ఇప్పటి కిప్పుడు కాకపోయినా,మరో రెండు మూడు నెలల్లో, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, విజయ దశమి ‘జాతీయ’ ప్రకటన తర్వాత కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అందు కోసమే ఆయన ప్రత్యేకంగా ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా తెరాస నాయకులలో చర్చ మొదలై నట్లు తెలుస్తోంది.
నిజానికి ముఖ్యంత్రి కేసీఆర్, గాంధీ జయంతి రోజు ప్రగతి భవన్లో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేంలోనే, ఈ మేరకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాలలో కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించినట్లు వార్త లొచ్చాయి. ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంఛి తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగిస్తారా? లేక ఇక్కడి బాధ్యతలు అలాగే ఉంచి, అదనపు బాధ్యతలుగా ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తారా అనే చర్చ పార్టీలోనే కాకుండా, రాజీకీయ, మీడియా వర్గాల్లోనో జరుగుతోంది.
ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థ తాత్పర్యాలు, నానార్దాలు చాలానే ఉంటాయని అన్నారు. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక అర్థం ఏమైనా ఉందా, అంటే, ఉందనే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి మాటల్లో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్’గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే, అదొక్క కేసీఆర్ వల్లనో మరొకరి వల్లనో అయ్యే పనికాదు. ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి, ఇంకా పార్టీలో మిగిలున్న హరీష్ రావు వంటి ముఖ్య నేతలు త్యాగాలకు సైతం సిద్దం కావాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలనుచక్క పెట్డంలో గట్టి పట్టున్న ట్రబుల్ షూటర్’ హరీష్ రావు వంటి వారి అవసరం జాతీయ పార్టీకి ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్’కు అన్ని విధాలనమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకు స్థాన చలనం ఉండే అవకాశాన్ని కొట్టి వేయలేమని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్’ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కే.తారక రామ రావు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కు అప్పగించే అవకాశాలను కాదనలేమని అంటున్నారు.
అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందని, అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిని మాత్రం అంత తేలిగ్గా అదీ కుమారుడు కేటీఆర్’కే అయినా ఇవ్వరని వదులుకోరని అంటున్నారు.
నిజానికి, 2018లో తెరాస రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ పట్టాభిషేకం గురించి మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, ఒకటి రెండు సందర్భాలలో ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయి. అయినా అదేమీ జరగలేదు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు కేసీఆర్ మానసికంగా సిద్ధమయ్యారని, రాజకీయ సమీకరణాలను సరి చూసుకుని కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, జాతీయ రాజకీయ వ్యుహలకు సమాంతరంగా వ్యూహ రచన సాగుతోందని అంటున్నారు. అందులో భాగంగా కూడా కొందరు ‘ముఖ్య’ నేతలకు జాతీయ బాధ్యలు అప్పగించి, పక్కకు తప్పించవచ్చని అంటున్నారు.అదే నిజమైతే, అధికార మార్పిడి, అంత సులభంగా జరిగిపోతుందా, లేక ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో ప్రస్తావించిన విధంగా తెలంగాణ షిండే తెర మీదకు వస్తారా, సంక్షోభం తలెత్తుతుందా,అనే కోణంలోనూ చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.