రోజాకు ‘జబర్దస్త్’ సెగే తగిలిందా?
posted on Oct 1, 2022 7:39AM
రోజా పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా, రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె ఎప్పుడూ సుపరిచితురాలే. వివాదాలు ఆమె వెంట ఉంటాయో, వివాదాలనే ఆమె ఆహ్వానిస్తారో తెలియదు కానీ ఆమె పేరుతోనే పాటే వివాదాలూ గుర్తుకు వస్తాయి. సరే రోజా చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు అవకాశం కల్పించారు. అందు కోసం జగన్ సామాజికవర్గ సమీకరణాలను కూడా పక్కన పెట్టి చిత్తూరు జిల్లా నుంచి అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా కూడా మరో మంత్రిగా రోజారెడ్డికి అవకాశం ఇచ్చారు.
ఒక జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడమే అరుదైతే.. అలా మంత్రి పదవులు పొందిన వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరీ అరుదు. కానీ జగన్ రెడ్డి రో ఆ సామాజిక వర్గ సమీకరణాలను సైతం పట్టించుకోకుండా రోజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ మంత్రి పదవి దక్కిన ఆనందం పూర్తిగా అనుభవించకుండానే రోజాకు పదవీ గండం తప్పదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే గడప గడపకూ టెస్ట్ లో ఫెయిలయ్యారనీ, అధిష్ఠానం సూచనలు పట్టించుకోవడం లేదనీ, ప్రజాదరణ కోల్పోయారనీ ఇలా పలు కారణాలు చూపుతూ జగన్ వచ్చే నెలలో (నవంబర్) మరో సారి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన వర్క్ షాపులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అంతే కాదు తన ప్రస్తుత కేబినెట్ లో కనీసం ఐదో వంతు మందికి ఉద్వాసన తప్పదన్న సూచనలు కూడా ఇచ్చారు.
ఇదిగో అక్కడ నుంచీ రోజా మంత్రి పదవికి ఎసరు వచ్చేసిందన్న వార్తలు సమాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఉద్వాసనకు గురయ్యే మంత్రులలో మొదటి పేరు రోజాదే అన్న స్థాయిలో వార్తలు వినవస్తున్నాయి. అందుకు కారణాలను కూడా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పేస్తున్నారు. ఆ కారణాలలో మొదటిది ఆమెకు జబర్ దస్త్ కార్యక్రమం మీద ఉన్న మమకారంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ జడ్జి పొజిషన్ లో విరగబడి, పగలబడి నవ్వినందుకే ఆమెకు సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నందువల్ల వచ్చిన పాపులారిటీని మించి ఎన్నో రెట్లు గుర్తింపు వచ్చింది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని పలు సందర్భాలలో ఎన్నో మార్లు ఆమే స్వయంగా చెప్పారు. తనకు అంత పాపులారిటీ తీసుకువచ్చిన షోను మంత్రి పదవి రాగానే వదిలేశారు. అయితే అంతటి పాపులారిటీ తీసుకువచ్చిన షో నిర్వాహకులు దసరా ఈవెంట్ కు ఆహ్వానిస్తే ఎలా కాదనగలరు? అందుకే వెళ్లారు. ఇదిగో ఇప్పుడు ఆ షోకు హాజరైన కారణంగానే రోజా పదవికి ఎసరు వచ్చిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో షికార్లు చేస్తున్నాయి.
ఎందుకంటే.. ఆ షో వచ్చేది జగన్ నిత్యం ఆగ్రహంతో చెప్పే దుష్టచతుష్టయంలోని ఒకరికి చెందిన చానెల్ లో.. చెప్పాపెట్టకుండా ఆ షోలో రోజా ప్రత్యక్షం కావడంపై జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయనీ, జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రోజాను ఫైర్ చేయాలని అనుకోవడానికి ఇది ఒక కారణం.. కాగా మంత్రిగా పదవీ స్వీకారం చేసిన క్షణం నుంచీ ఆమె పార్టీ హై కమాండ్ ఆదేశాలు, సూచనలను ఖాతరు చేయడం మానేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా హైదరాబాద్ వెళ్లి ‘జగన్’మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పట్లోనే ఈ విషయంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అప్పటికే జగన్ తల్లిని, చెల్లిని దూరం పెట్టిన విషయం తెలిసిందే.
ఇక ఆ తరువాత కూడా రోజా తన చిత్తం వచ్చిన తీరులోనే వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వచ్చారు. సరిగ్గా ఆమె కేసీఆర్ ను కలిసిన సమయంలోనే మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో ఏపీలో జగన్ హయాంలో కరెంటు కష్టాలు, రోడ్ల దుస్థితిపై హేళన చేస్తూ మాట్లాడారు. ఇక మంత్రిగా రోజా పనితీరుపై కూడా జగన్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. మంత్రిగా గత ఐదు నెలల కాలంలో తన నియోజకవర్గం విషయంలో కానీ, తన శాఖ విషయంలో కానీ ఏ మాత్రం పట్టింపు లేని ధోరణిలో వ్యవహరిస్తున్నారని జగన్ చేయించిన సర్వేలలో తేలిందని అంటున్నారు. అందుకే తాజాగా గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాపులో జగన్ మంత్రి రోజా పేరు ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా మంత్రి అయిన తరువాత ఆ స్థాయిలో విపక్షాన్ని విమర్శిస్తూ విరుచుకుపడటంలేదని కూడా జగన్ భావిస్తున్నారంటున్నారు. ఇక సొంత నియోజకవర్గంలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని వివిధ సర్వేలలో తేలిందని కూడా అంటున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రిగా కూడా ఆమె తన స్వంత నియోజకవర్గం నగరిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. ఈ కారణాలన్నిటినీ ప్రస్తావిస్తూ వైసీపీ వర్గాలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గురయ్యే మంత్రుల జాబితాలో తొలి పేరు రోజాదే అని అంటున్నారు.