అర్థమవుతోందా..? సామీ..!
posted on Sep 30, 2022 @ 3:56PM
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీ సీఎం జగన్ సమర శంఖం పూరించేశారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉందంటూనే.. ఇప్పటి నుంచే రెడీ కావాలని తన ఎమ్మెల్యేలకు హుకుం జారీచేసేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన గడప గడపకు వర్క్ షాపులో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల బాధ్యులకు ఊపిరాడని విధంగా జగన్ ఇబ్బంది పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో సీఎం జగన్ వారితో నిర్మొహమాటంగా, కఠినంగానే మాట్లాడారు.
‘నవరత్నాల ద్వారా 88 శాతం మంది ఓటర్లకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఎన్నికల దాకా ఇలాగే చేస్తాం. మన వల్ల లబ్ధి పొందిన వారు మనకు కాక ఇంకొకరికి ఎందుకు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యేలను జగన్ ప్రశ్నించారు. 151 స్థానాలు కాదు.. మొత్తం 175 స్థానాల్లోనూ మనమే గెలిచి తీరాలని జగన్ విస్పష్టంగా చెప్పారన్నారు. మనం 175 సీట్లు గెలుచుకోబోతున్నాం.. గెలిచే తీరుతాం అంటూ సాగిన జగన్ ప్రసంగం ఎమ్మెల్యేల్ని హిప్నటైజ్ చేసినట్లు ఉందంటున్నారు. తాను చెప్పడమే కానీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ఛాన్సే జగన్ ఇవ్వలేదు. మళ్లీ మీరు గెలవాలంటే ఇంటింటికీ వెళ్లి, మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇంత లబ్ధి చేకూర్చాం అని చెప్తే చాలు.. ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకూడదు అని ఆదేశించారు. ఓ 27 మంది ఎమ్మెల్యేలు ఆ పని చేయడం లేదని చెబుతూ వారి పేర్లు వెల్లడించి మరీ వారందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్. మరొకసారి చెప్పేది లేదు.. టిక్కెట్ ఇచ్చేది లేదు’ అని హెచ్చరించారు. జగన్ మాటల తీవ్రతకు బుర్ర గిర్రున తిరిగిందని, మైకం కమ్మినట్లైందని ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారంటున్నారు.
టికెట్లకు అనర్హులని జగన్ చదివిన 27 పేర్లలో ఎక్కువ మంది మహా చురుకైన వారే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గంలో చేయని పనిలేదు. ప్రత్యర్థుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొడాలి నాని సింహం నోట్లో తలపెట్టేందుకైనా వెనుకాడరని తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షణం ఖాళీగా ఉండరు. అందరి కంటే ముందు గడప గడప కార్యక్రమం పూర్తిచేశారు. రాజకీయంగా ఇంత చురుకుగా ఉండే ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీఎం ఏ ప్రాతిపదికన అంచనా వేశారో తెలియదు. కేవలం గడప గడప తిరిగితేనే ఓట్లు పడతాయా అనేది తొంభై శాతం మంది ఎమ్మెల్యేల్లో మెదులుతున్న ప్రశ్న. గడప గడపకు వెళ్లి జనం సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిళ్లు నమిలి వచ్చేస్తే ప్రయోజనం ఏమిటన్నది వారి సందేహం. ఈ ప్రశ్నలను, సందేహాలను జగన్ ముందు ఉంచలేక ఎమ్మెల్యేలు వారిలో వారు మధన పడుతున్నారు.
అన్ని ప్రతికూలతల మధ్యా సాహసించి గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను జనం వదలిపెట్టడం లేదు. తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఎక్కువ శాతం మందికి పథకాలు అంది, వారంతా జగన్ పట్ల కృతజ్ఞతగా ఉంటే ఇక ఎమ్మెల్యేల పాత్ర ఏమి ఉంటుంది? వారు గడప గడపకు తిరగకపోతే వచ్చే ప్రమాదం ఏమి ఉంది? ఎమ్మెల్యేలను చూసి జనం ఓటు వేయనప్పుడు, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఎందుకు? అనే ప్రశ్నలు విన వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను అర్ధం చేసుకోకుండా సీఎం చేయిస్తున్న సర్వేలు, అంచనాలు మేలు చేస్తాయా అనేది వైసీపీ శ్రేణులు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు. నిందిస్తున్నారు. కానీ జగన్ మాత్రం లబ్ధి పొందినవారు గంప గుత్తగా తనకే ఓట్లు వేస్తారని గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ విధమైన జగన్ తీరే ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. కాగా.. జగన్ పైకి కన్పించినంత అమాయకుడు కాదని, ఎన్నికల నాటికి ప్రత్యర్థులు అవాక్కయ్యేలా దెబ్బకొట్టడానికి అస్త్రాలు రెడీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలను ఆయన ఆంతరంగికులు సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది.
జగమొండి జగన్ కు అర్థం కాని మరో కీలకాంశం కార్యకర్తల్లో ప్రబలుతున్న అసంతృప్తి. ఈ మూడేళ్లలో వైసీపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఉపకారమేదీ లేదు. జగన్ విజయం కోసం వైసీపీ కార్యకర్తలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకొని ఎందుకు పనిచేస్తారనే ప్రశ్న వస్తోంది. ఈ ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఎం ఆదేశాలకు, ఎమ్మెల్యేల ఆలోచనలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తన పథకాలు, బటన్ నొక్కుడు వల్ల సగానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమని, మరోసారి అధికారం తథ్యమనీ జగన్ నమ్ముతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లి, ప్రచారంచేసే పరిస్థితులు ఉండకపోవచ్చుననీ, పోలీసు భయం పోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు ఉధృతంగా ఉంటుందనీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
బాగా పనిచేసే వారిని, నిత్యం ప్రజల మధ్యే తిరిగేవారిని తప్పు పట్టి, జనానికి అందకుండా తిరిగే వారికి మంచి మార్కులు వేయడంలోనే జగన్ అంచనాలు సరిగా లేవని అర్ధమవుతోందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ప్రభుత్వం సమస్య ఎదుర్కొంటోందా అనే ఆలోచన సీఎం చేయడం లేదని వీరి భావన. ధరల పెరుగుదల, దోపిడీ మాదిరిగా సాతుగున్న మద్యం, ఇసుక అమ్మకాలు, ఉద్యోగుల అసంతృప్తి, ఉపాధ్యాయుల ఆగ్రహం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన అవినీతి వంటి అంశాలను ప్రధానంగా జనం చర్చిస్తున్న విషయం జగన్ కు తెలుస్తోందా? ఆయనకు అర్ధమౌతోందా అని ప్రశ్నిస్తున్నారు.
ధరల పెరుగుదలతో జనం మండిపోతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిప్పు రాజేస్తున్నారు. జగన్ తీరుతో వైసీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇవన్నీ గాలికి వదిలేసి పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయనుకొంటే పుట్టి మునగడం తధ్యం సామీ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు వ్యతిరేకత అంతా మీ మీదే సామీ.. మా మీద కాదు’ అని తన జగన్ పైనే వారు సెటైర్లు వేసేదాకా వచ్చింది. అయినా పరిస్థితి జగన్ కు ఎందుకు అర్ధం కావడం లేదో అర్ధం కావడం లేదని వారు జుట్టు పీక్కుంటున్నారు.