అదిరింది సారూ కేసీఆరూ.. కొత్త పార్టీ.. కోత్త ఫ్లైటు!
posted on Sep 30, 2022 @ 2:12PM
కొత్త ఇల్లు కొత్త.. అంటూ అదేదో సినిమాలో ఓ డైలాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితీ అలాగే ఉంది. అదిరింది సారూ..కేసీఆరూ.. కొత్త ఫ్లైటూ, కొత్త పార్టీ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెరాస అధినేతగా, తెలంగాణ సీఎంగానే కాదు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని ఉవ్విళ్లూరుతున్న నేతగా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.
ఆయన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే, ప్రతి మాటా ఒక రాజకీయ ఎత్తుగడే అన్నట్లుగా ఉంటుంది. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే.. మౌనం వహించినా సంచలనమే అన్నట్లుంటుంది ఆయన వ్యవహార శైలి. ఎనిమిదేళ్లుగా తెలంగాణ సీఎంగా ఉన్న ఆయన.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇక తనకు తిరుగులేదని అనుకున్నారో ఏమో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా రాష్ట్రంపై కంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆయన చాలా రాష్ట్రాలు తిరిగేశారు.
చాలా మంది నేతలతో భేటీ అయ్యారు. అవేమీ పెద్దగా కలిసి రాకపోయినా.. ఆయన తగ్గేదేలే.. అంటూ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం, ప్రతి చర్యా ఒక సంచలనమే అన్నట్లుగా సాగుతోంది. తన జాతీయ రాజకీయ ప్రవేశంలో భాగంగా దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది అనే చెప్పాలి.
ఆ విమానం కొనుగోలు ఖర్చును ఐదారుగురు పార్టీ నేతలు భరించారని చెబుతున్నారు. దేశ ప్రధాని కూడా గతంలో అంటే 2014 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక విమానంలో సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే అదేమీ పార్టీ ఆయన కోసం కొన్న విమానం కాదు. కానీ ఆయన సన్నిహితుడిగా పేరొందిన పారిశ్రామిక వేత్త సమకూర్చిన విమానం అది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ జాతీయ రాజకీయ ప్రవేశం బీజేపీ ఏకగ్రీవ తీర్మానంతో జరిగింది. మరి కేసీఆర్ విషయంలో అలాంటిదేమీ లేదు.
ఎందుకంటే ఇప్పటి కింకా ఆయన ప్రాంతీయ పార్టీ అధినేతే.. అందుకే ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించి చక్రం తిప్పాలనుకుంటే అందుకు ఎవరి అనుమతులూ, ఏ పార్టీ తీర్మానం అవసరం లేదు. ఆయన నిర్ణయమే తెరాస నిర్ణయం. ఎందుకంటే ఆయనే తెరాస, తెరాసయే ఆయన. అది పక్కన పెడితే కేసీఆర్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ దేశ ప్రధాని అయినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న తానెందుకు కాకూడదనుకున్నారో ఏమో .. ప్రధాని పీఠం లక్ష్యంగా గురిపెట్టు జాతీయ రాజకీయాలలోకి అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా కొత్త పార్టీనే స్థాపిస్తున్నారు. అందుకు ముహూర్తం ఖరారు చేసేశారు. దసరా రోజున ఆయన తన జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
ఆ ప్రకటన తరువాత ఇక కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు ఉంటాయి. బాడుగ విమానాలు తన స్థాయికి సరిపోవనుకున్నారో ఏమో సొంతంగా విమానాన్ని కొనుగోలు చేసేయాలని నిర్ణయించారు. మోడీకి అదానీలా.. కేసీఆర్ కోసం విమానాలు సమకూర్చి పెట్టేందుకు బోలెడు మంది సదా సిద్ధంగా ఉంటారు. అయినా ఎందుకో కేసీఆర్ ఆ దిశగా ఆలోచించేందుకు ఇష్టపడలేదు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత పేరు బయటకు వచ్చిన తరువాత.. అలాగే సొంత మనిషి అనుకున్న ఎంపీ సంతోష్ కూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత మరెవరినీ దగ్గరకు తీయద్దు అనుకున్నారో ఏమో.. వాళ్లూ వీళ్లూ విమానాన్ని సమకూర్చి పెట్టేదేమిటి? సొంతంగా విమానాన్ని కొనేస్తే పోలా అని నిర్ణయించుకున్నారు.
అందుకే బాగుంది సారూ.. కేసీఆరూ అని అందరూ అనేలా కొత్త పార్టీ , కొత్త విమానంతో ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్న మాట. విజయదశమి రోజునే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. చెడుపై మంచి గెలిచిన రోజు విజయదశమిగా ప్రతీతి. అటువంటి విజయదశమిని కేసీఆర్ తన కొత్త పార్టీ పేరు ప్రకటనకు ఎంచుకున్నారు. గత కొంత కాలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన ఆయన ఆ యుద్ధం ఆరంభానికి విజయదశమిని ఎన్నుకున్నారని తెరాస వర్గాలు ఘనంగా చెబుతున్నాయి.
కేసీఆర్ కు దైవ భక్తి మెండు. అందుకే ఆయన జాతీయ పార్టీ ప్రకటనకు ముందు శుక్రవారం (సెప్టెంబర్ 30) యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. పనిలో పనిగా గతంలో ప్రకటించిన విధంగా కేజీ 16 తులాల బంగారాన్ని స్వామివారికి సమర్పించి తన పసిడి మొక్కు తీర్చుకున్నారు. అలాగే తన కొత్త జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే శనివారం (అక్టోబర్1 ) వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు. విజయదశమి రోజున పార్టీని ప్రకటించి కొత్త పార్టీ తరఫున తొలి బహిరంగ సభ కరీంనగర్ లో నిర్వహించనున్నారు. మొత్తం మీద కేసీఆర్ కొత్త పార్టీ లాంచింగ్ ను ఘనంగా, చాలా ఘనంగా చేయనున్నారు.