అభిమాని డేటింగ్‌కి రూ.500 ఇచ్చిన క్రికెటర్ అమిత్
posted on Sep 30, 2022 @ 11:05PM
ప్రభాస్ వీరాభిమాని సెల్ఫీ అడిగాడు, రిటైర్ అయ్యే ఉద్యోగి తోటివాళ్లతో టీపార్టీ చేసుకున్నాడు, ఒక కుర్రాడు తన లవర్ కోసం వేరే స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇవి వినడానికి సరదాగా ఉంటాయి, కానీ వాటిలో చిన్న ఆనందం కూడా ఉంది. చాలా కాలం గుర్తుండే జ్ఞాపకమే అవుతుంది ప్రతీదీ!
ఓ కొంటె కుర్రాడు తన లవర్‌తో ఓ పూట సరదాగా గడపాలని అనుకున్నాడు. కానీ అందుకు పర్సు ఫుల్‌గా లేదు. ఆమెను సరదాగా అలా షికారుకి తీసికెళ్లడం, హోటల్‌లో తినడం, వీలయితే సినిమాకి తీసికెళ్లడానికి దేనికి అతని దగ్గర తగినంత డబ్బు లేదు. కనీసం మంచి హోటల్లో కొద్దిసేపు కబుర్లు చెప్పుకోవడానికి కాఫీ తాగడానికీ లేవు. అతను క్రికెట్ వీరాభిమాని. క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి స్కూల్లో ఉన్నపుడు ఫ్రెండ్స్‌తో కలిసి చాలా సరదాగా గడిపాడు. అతనికి భారత్ మాజీ టెస్ట్‌ప్లేయర్, స్పిన్నర్ అమిత్ మిశ్రా అంటే వీరాభిమానం. అంతే వెంటనే.. అన్నా! జర ఓ మూడొందలు గూగుల్ పే చేస్తావా? అని అడిగాడు. అంతే కాదు వీలయినంత త్వరలో వాసస్ ఇస్తానన్నాడు. సరే బాగే ఉంది, ఇంతకీ మూడొందలతో ఏం చేస్తావని స్పిన్నర్ అమిత్ అడిగాడు. ఆ కుర్రాడు తన లవర్‌ని అలా షికారుకి తీసికెళ్లాలి అని సమాధానం చెప్పాడు.. ఆ కుర్రాడు చాలా సిన్సియర్‌గా! అంతే అమిత్ ఆ సమాధానం నచ్చి ఒకే అని డబ్బులు పంపాడు.
అతని అభ్యర్ధనలో సిన్సియారిటీ గుర్తించానన్నాడు అమిత్. ఇదంతా ట్విటర్‌లో జరిగిన సంభాషణ. కానీ లెగ్ స్పిన్నర్ వెంటనే సానుకూల స్పందన ఇస్తాడని ఆ వీరాభిమాని అనుకోలేదు. పైగా మరో ట్విస్ట్ ఏమిటంటే, రూ.300 లు మాత్రమే కాదు, అమిత్ మరో రూ.200 కూడా అదనంగా ఇచ్చాడు.. మరింత ఆనందంగా గడపమని!
ఆ కుర్రాడి ఆనందానికి అంతే లేదు. అమిత్ పంపిన డబ్బు క్షణాల్లో అందాయి. ఆ స్క్రీన్ షాట్ ను అమిత్‌కి పంపాడు ఆ కుర్రాడు. ఇదో ఊహించని అభిమానం. భారత్ మాజీ ప్లేయర్ అమిత్‌కి మరింత ఆనందదాయక సంఘటనే! అందేరూ మీ డేటింగ్‌కి ఆల్ ది బెస్ట్ అంటూ మెసేజ్ పెట్టాడు!