ముంబైలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
posted on Oct 1, 2022 8:20AM
అమెరికాకే పరిమితం అనుకున్న కాల్పుల సంస్కృతి ఇప్పువు విశ్వవ్యాప్తం అయిపోతోంది. భారత దేశంలోనూ కాల్పుల సంస్కృతి పెచ్చరిల్లుతోంది. చిన్న చిన్న విభేదాలే కాల్పులకు దారి తీస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో రియల్టర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం (సెప్టెంబర్ 30) అర్ధరాత్రి దాటిన తరువాత కాల్పుల కలకలం రేగింది.
ముంబైలోకి కండివాలి పోలీసు స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు తమ ప్రత్యర్థులపై కాల్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు. పాతకక్షలే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.