సెలవులో తెలంగాణ సీఎస్.. విదేశీ పర్యటన సాకేనా?
posted on Oct 1, 2022 @ 2:56PM
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ నైరోబీలో జరగనున్న ఇక్రిసాట్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ బాధ్యతలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన మరో మూడు నాలుగు రోజులలో ఉన్న సమయంలో ఇలా హఠాత్తుగా ఇక్రిసాట్ సమావేశం అంటూ సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయినా ఇక్రిసాట్ సమావేశం సీఎస్ అనివార్యంగా హాజరవ్వాల్సినంత ముఖ్యమైన సమావేశం ఏమీ కాదు. ఆయన మరో అధికారిని ఇందుకు డిప్యూట్ చేసే అవకాశాలు ఉన్నా.. ఆలా చేయకుండా కీలక సమయంలో సోమేష్ కుమార్ విదేశీ పర్యటన పేరుతో వెళ్లడంపైనే పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా తెరాసలో అంత కంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఈడీ దాడుల గాబరా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ప్రమేయంపై ఈడీ కూపీలాగుతున్నదన్న సమాచారంతో తెలంగాణ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయడానికి అన్నీ సిద్ధమైన తరుణంలో సీఎస్ సోమేష్ కుమార్ విదేశీ పర్యటన పేరుతో హైదరాబాద్ వీడి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన వెళ్లేది ఇక్రిసాట్ సమావేశంలో పాల్గొనేందుకు కాదనీ, అయినా ఆయన విదేశాలకు వెళ్లడం లేదనీ అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫీనిక్స్ వ్యవహారంలో తన ప్రమేయంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఆయన హస్తినకో, మరో ప్రాంతానికో వెళ్లనున్నారని అంటున్నారు. ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఢిఫెన్స్ లో పడిన నేపథ్యంలో సీఎస్ తాను కొంత కాలం అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మేలని భావించడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇంతకీ ఆంధ్రా కేడర్ కి చెందిన సోమేష్ పట్టుబట్టి కోర్టు ఆదేశాలను ధిక్కరించడానికి కూడా సిద్ధపడి తెలంగాణాలో ఉండాలనుకున్నారు.
అటువంటి సోమేష్ కుమార్ కు ఫీనిక్స్ కుంభకోణంలో ప్రమేయంపై ఈడీ కూపీలాగుతుండటంతో ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయారని అంటున్నారు. ఈడీ దర్యాప్తు కారణంగా ప్రభుత్వం ఇబ్బందులలో పడటం, కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన సమయంలో ఈడీ దాడులు జరిగితే ప్రభుత్వ పరువుతో పాటు సీఎం కు కూడా ఇబ్బందులు తప్పవన్న కారణంతో స్వయంగా సీఎం కేసీఆర్ సూచించడంతోనే ఆయన విదేశీ పర్యటన నెపంతో దూరంగా వెడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
అధికార వర్గాలలో కూడా ఇదే వాదన వినవస్తున్నది. మొత్తం మీద దసరా ముందు.. అంటే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు సీఎస్ దూరంగా ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.