2024లో ఏపీలో అధికారం ఎవరిదంటే.. రాయపాటి సెన్సేషన్!
posted on Oct 1, 2022 @ 1:28PM
రాయపాటి సాంబశివరాలు. ఏపీ రాజకీయాలలో ఢక్కామెక్కీలు తిన్న నేత. మాజీ ఎంపీ. రాజకీయ నాడి తెలిసిన నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కొద్ది కాలంగా ఆయన క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా నరసరావు పేట నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
అయినా ఆయన రాజకీయ విశ్లేషణలకు విశ్వసనీయత ఉందని రాజకీయనాయకులు చెబుతుంటారు. అనారోగ్యం కారణంగానే ఆయన గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. అయితే ఆయన అంచనాలపైన మాత్రం రాజకీయ వర్గాలలో విశ్వసనీయత మెండుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచే పార్టీ ఏదన్నది బయటపెట్టేశారు. ఏపీలో వచ్చే ఎన్నికలపై తన సర్వే ఇదంటూ ఆయన వెల్లడించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని రాయపాటి చెప్పారు. ఆ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన తన సర్వే ఫలితంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం ఘన విజయం తధ్యమన్నది రాయపాటి సర్వే సారాంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తక్కువలో తక్కువ తెలుగుదేశం 125 స్థానాలలో విజయం సాధిస్తుందని రాయపాటి పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, ఆ మార్పు ప్రగతి కోసమేననీ ఆయన వివరించారు. దార్శనికుడిగా, అభివృద్ధి కాముకుడిగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపే ప్రజలను ఆయనవైపు చూసేలా చేస్తోందని రాయపాటి వివరించారు.
గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రాయపాటి వచ్చే ఎన్నికలలో తన పోటీ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పొత్తుల విషయం కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఇలా ఉండగా ఏపీలో వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిదన్న అంశంపై ఇప్పటికే పలు రకాల సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలూ కూడా జగన్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనే పేర్కొన్న సంగతి ఇక్కడ గమనార్హం. ఆఖరికి జగన్ తన ఐప్యాక్ టీమ్ తో చేయించుకున్న సర్వేలో కూడా వైసీపీ ఓటమి చ్ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయని చెబుతున్నారు.
అందుకే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గరం అవుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ఉన్న సానుకూలతను మరింత పెంచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు కూడా సిద్ధమౌతున్నారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రకు సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయపాటి కూడా తన సర్వే అంటూ వెల్లడించిన వివరాలు తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు.