జగన్ లిక్కర్ పాలసీ షేమ్ టు షేమ్
posted on Oct 1, 2022 @ 10:36AM
దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం.. జగన్ వాగ్దానాలలో అతి ముఖ్యమైనది. అయితే వాగ్దానాలను నెరవేర్చి తీరాలన్న నియమమేమీ ఏపీ సీఎంకు లేదు. అందుకే అధికారానికి ముందో మాట.. తరువాత మరో మాట అన్నది ఈ మూడేళ్ల పాలనలో అందరికీ ప్రస్ఫేటంగా తెలిసేలాగే ఆయన వ్యవహార శైలి ఉంది. సంపూర్ణ మద్య నిషేధం విషయం కూడా అంతే.
ఈ విషయంపై ఆయన నోరు మెదపకపోయినా.. ఆయన చేష్టలు మాత్రం మద్యం ఆదాయంతో పబ్బం గడిపేసుకోవాలన్న చందంగానే ఉంది. పైగా ఆయన పార్టీ నేతలు, కేబినెట్ సహచరులూ కూడా అవకాశం దొరికిప్పుడల్లా మద్య నిషేధం మా మేనిఫెస్టోలో ఎక్కడుందో చెప్పండి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే అది పక్కన పెడితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్టైలే వేరు.. ఎవరేమనుకున్న ఆయన పెద్దగా పట్టించుకోరు.
అందుకే సంపూర్ణ నిషేధం మాటే ఎత్తకుండా మద్యం పాలసీని మరో ఏడాది పాటు యథాతథంగా కొనసాగిస్తూ జగన్ ప్రభుత్వం శుక్రవారం సెప్టెంబర్ 30) ఉత్తర్వ్యులు జారీ చేసింది. అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ బార్గవ్ జారీ చేసిన ఉత్వర్వులలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న మద్యం విధానమే మరో ఏడాది మాటు అంటే 2023 సెప్టెంబర్ 30దాకా కొనసాగుతుంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అందు కోసమే అంటూ రాష్ట్ర ప్రభుత్వం… మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యాపారుల చేతి నుంచి ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది. గత ఏడాది మద్యం పాలసీ ప్రకారం రాష్ట్రంలో 2,934 మద్యం షాపులు కొనసాగుతున్నాయి. వీటి సంఖ్యను ఏమాత్రం తగ్గించకుండానే యధాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మద్య నిషేధం అన్న మాటను కాదు కాదు హామీని అటకెక్కించేసిందన్న మాట.