జగన్ లో భయం.. బాబులో ఆత్మవిశ్వాసం.. గడప గడపకూ వర్క్ షాప్ తేల్చిందిదే!
posted on Oct 1, 2022 @ 10:37AM
వచ్చే ఎన్నికల్లో యవతకు సీట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆ క్రమంలో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. ఇప్పటికే తన వారసులను ఎన్నికల బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఏ ప్రాంతంలో..... ఏ నియోజకవర్గంలో యువతను బరిలో దింపితే.. పార్టీ గెలుపు తథ్యం అనే కోణంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పార్టీలో పలువురు సీనియర్ల నేతల వారసుల పేర్లతో ఓ జాబితా ఇప్పటికే సిద్దం చేశారని తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ఇద్దరూ పోటీ చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. అయితే గత ఎన్నికల్లో వారి కుమారులు జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ ఆస్మిత్ రెడ్డిలను బరిలోకి దింపిగా.. వారు ఓటమి పాలైయ్యారు.
మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 70 సీట్లు యువతకు కేటాయించినా.. మిగిలిన సీట్లు పార్టీ కోసం కష్టించిన వారికి కేటాయించినా.. పార్టీకి మేలు జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు 2024 ఎన్నికల్లో యువత ఓట్లు భారీగా పెరగనున్నాయని సమాచారం. ఇవి టీడీపీ గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించేసిన సంగతి విదితమే.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాపులో వచ్చే ఎన్నికలు చాలా టఫ్‌గా ఉంటాయని.. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో మళ్లీ మీరే పోటీ చేయాల్సి ఉంటుందని సీనియర్లకు సీఎం జగన్ ముఖం మీదే చెప్పాశారు. అలాగే నాయకుల వారసులకు మాత్రం నో ఛాన్స్ అని స్పష్ఠం చేసేశారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వారసులను మాత్రం పంపవద్దని... కావాలంటే మీతోపాటు వారిని వెంట తీసుకు వెళ్లాలని అంతేకాని వారసులను రంగంలోకి దింపి.. మీరు మాత్రం సైలెంట్‌గా ఇంటి వద్ద ఉంటే.. పరిస్థితులు మరోలా మారే అవకాశం లేకపోలేదని వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సీఎం జగన్ కర్తవ్య బోధ చేశారు.
అయితే వైయస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాల పేరిట.. లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేయడమే కానీ.. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివద్ధి పని జరగలేదన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందేనని సరిగ్గా ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ రిష్ రాజ్ సింగ్... సైతం స్వయంగా సీఎం జగన్‌కు అందించిన నివేదికలో ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం పలువురు మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేసిన వ్యాఖ్యలు సైతం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మారాయని వారు చెబుతున్నారు. అలాగే వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ ప్రకటించడం.. దీంతో అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళనలు, దీక్షలతోపాటు మహాపాదయాత్రులు.. చేస్తున్నారని.. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ పుట్టిముంచుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.