తెరాసకు ఎంఐఎం తలాక్ ?
posted on Oct 1, 2022 @ 3:12PM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ విజయ దశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే ఆ రోజున పార్టీ ప్రకటన వరకే ఉంటుందా లేక ఇంకా ఏమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా అనే విషయంలో ఇంతవరకు అయితే ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానికి ఇంతవరకు, జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించి కూడా తెరాస పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభా పక్షం, విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందనే సమాచారం అయితే ఉందని అంటున్నారు. అయితే, పండగ పూట జరిగే సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనతో పాటుగా తెరాస పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.
అయితే అది ఎలా ఉన్నప్పటికీ, కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా తెరాస ఏకైక మిత్రపక్షం ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్ చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజ జరిగితే బీజేపీ బలపడుతుందని ఎంఐఎం అధ్యక్షుడు హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్, ఒవైసీ జిగ్నీదోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదిక నుంచే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న సెప్టెంబర్ 17న అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా జరిపించారు.
అయినా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలున్నా ఇప్పటికే జాతీయ రాజకీయాలలో వేలు పెట్టిన ఎంఐఎం అధినేత ఒవైసీకి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కేసీఆర్ తప్పుడు రాజకీయ ఎత్తుగడల వల్లనే, రాష్ట్రంలో బీజేపీ బలం పుంజు కుంటోందని ఒవైసీ గుస్సా అవుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో కాషాయ దళం అధికారంలోకి వచ్చే ప్రమాదకర పరిస్థితులను కూడా కేసీఆర్ సృష్టిస్తున్నారని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ, హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాసకు తలాక్ చెప్పిన నేపధ్యంలో రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే పాత బస్తీ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా, బీజేపీ మోడీ ప్రభుత్వ సహకారంతో తమ గొంతు నొక్కేస్తుందని, అదే ఓ 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే, తెలంగాణలో యూపీ ( యోగీ) బుల్దోజర్ పాలనను అడ్డుకోగలుగుతామని ఒవైసీ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ మున్సిపాలిటీలలో ఎంఐఎం ఇప్పటికే ఒకటీ అరా సీట్లు గెలుచుకుంది. అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. అందుకే ఎంఐఎం తెరాసతో తలాక్ కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎంతో తెరాస దోస్తానాను బూచిగా చూపించి హిందూ ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకునేందుకు, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేసీఆర్, ఒవైసీ ‘తలాక్’ వ్యూహాన్ని తెర మీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.