జెండా ఏది ?.. అజెండా ఎక్కడ ?
అయిపొయింది. మూడు ముళ్ళు పడిపోయాయి. కానీ, అసలు తంతు మాత్రం ఇంకా మిగిలే వుంది. అవును, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు మారింది. మారింది అంటే, మారింది అనేందుకు కూడా లేదు. ఇంకా ఆ వ్యవహారంకూడా పూర్తి కాలేదు. తెరాస పేరు మార్పు ప్రతిపాదనను ఆమోదిస్తూ పార్టీ కార్యవర్గం ఆమోదించిన తీర్మానం కాపీ, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరలేదు. నిజానికి, ఇది కేసీఆర్ అనుకుంటున్నట్లుగా అంత తేలిగ్గా చిటికలో అయిపోయే వ్యవహారం కాదని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం ఎప్పుడొస్తుందో, ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. ఇలాంటి అభ్యర్ధనలను కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్దుష్ట కాల పరిమితిలో పరిష్కరించాలానే నియమం ఏదీ లేదని, గతంలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ విషయంలో ఈసీ నెలల సమయం తీసుకుందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఆయినా ఎందుకో కానీ ఏదో తరుముకు వస్తోంది అన్నట్లుగా ఆ క్రతువు అయిందని అనిపించారు.
కానీ, ఈ తంతుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, అనుమానాలు ఇంకా అలాగే మిగిలిపోయాయి. అలాగే కొన్ని కొత్త ప్రశ్నలు తెలేత్తాయని అంటున్నారు. తెరాస రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్న కార్యక్రమంలో, పార్టీ ముఖ్యుల్లో ముఖ్య నాయకురాలు, కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎందుకు కనిపించలేదు. ఆమె ఎక్కడున్నారు? ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు? ఢిల్లీ లిక్కర్ మరకల కారణంగా పెద్దలు ఆమెను పక్కన పెట్టారా? జాతీయ మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆమె తెర చాటున ఉండి పోయారా? ఇ లా ఒక్క కవిత విషయంలోనే కాదు, ఇంకా డిఫరెంట్ కోణాల్లోనూ నేరుగా కేసీఆర్ డిఫెన్సులో పడ్డారని, అంటున్నారు.
సరే ఆవిషయం ఎలా ఉంచినా, జాతీయ పార్టీ, జెండా, ఎజెండా అంటూ, ముందు నుంచి ఏదో మహాద్భుతం జరగబోతోందని ప్రచారం జరిగింది. అదే గులాబీ జెండా, అదే కారు గుర్తు. మధ్యలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత దేశం మ్యాప్. వస్తుందని ఎవరో చెప్పడమే కానీ, తెరాస/ బీఆర్ఎస్ అధ్యక్షడు, ముఖ్యమంత్రి ముఖతః అలాంటి ప్రస్తావన వచ్చినట్లు లేదు. నిజానికి, తెరాస పేరు మార్పు క్రతువు వ్యవహారానికి సంబంధించి బయట కనిపించిన హడావిడి, ఆర్భాటం లోపల కనిపించలేదని, లోపలి నాయకులే పెదవి విరిచేస్తున్నారు. పార్టీ జెండా,ఎజెండాతో పాటుగా అనేక విషయాలకు సంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇస్తారని ఆశించారు. అయితే, ముఖ్యమంత్రి పొడి పొడిగా మాట్లాడిన మాటల్లోపెద్దగా స్పష్టత లేదనే అభిప్రాయమే అందరిలో వ్యక్తమౌతున్న పరిస్థితి.
అలాగే, ఈ ‘వేడుక’ లో పాల్గొనేందుకు ఎవరెవరో వస్తారని ప్రచారం జరిగినా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామీ, ఆయన వెంట వచ్చిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మినహా నలుగురికీ తెలిసిన, మరో ముఖం కనిపించలేదు. రైతు నాయకులు కొద్ది మంది వచ్చినట్లున్నారు, కానీ, అందులో చాలావరకు సంభావనకు వచ్చిన పంతులు గార్లే కానీ, మంత్రం ముక్క వచ్చిన పండితుల్లా అయితే లేరని అంటున్నారు. అలాగే వచ్చిన రైతు నాయకులలో కూడా రాకేశ్ తికాయత్ వంటి గుర్తింపు ఉన్న నాయకులు ఎవరూ లేరు. నిజానికి, తికాయత్ ఒకసారి కాదు, రెండు మూడు సార్లు నేరుగా ప్రగతి భవన్ కు వచ్చి మంతనాలు సాగించారు. నిజా నిజాలు ఎలా ఉన్నా తికాయత్ ఎక్కడికి, ఎలా వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వెళ్ళరని అంటారు. నిజానికి, నెల రోజుల క్రితం 20 వరకు రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడు మూడు రోజులు ప్రగతి భవన్ ఆతిధ్యం అద్నుకున్న రైతు నాయకులలో సగం మంది కూడా ఈ వేడుకు రాలేదని, అంటున్నారు.
నిజానికి కేసేఆర్ జాతీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన విధంగా అడుగులు పడ లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోందనే అంటున్నారు.ఇప్పుడు పేరు మార్పు ప్రహసనంలోనూ కేసేఆర్ ఆశించింది ఒకటైతే, జరిగింది మరొకటి అని అంటున్నారు. అందుకే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వస్తానన్నా తానే వద్దన్నానని కేసేఆర్ ఒక విధంగా సంజాయిషీ ఇచ్చుకున్నారని అంటున్నారు. అందుకే, కేసేఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో ఇది మరో ముందగుడు అవుతుందో, వెనకడుగు అవుతుందో చూడవలసిందే, అంటున్నారు.