ఉత్తుత్తి మాటలెందుకు... ఉత్తరాంధ్రకు చేసిందేమిటో చెప్పండి ముందు?
విశాఖపట్నం రాజధానిపై తమ అభిప్రాయాలను జనం నోరు విప్పి చెప్పకపోతే ఉత్తరాంధ్ర కొంప మునిగిపోతుందట. ‘విశాఖ రాజధాని కావాలని గొంతెత్తి అనడానికి ఏమైంది? మన కోసం మనం నోరు విప్పలేకపోతే.. మన అమాయకత్వాన్ని వేరెవరైనా సొమ్ము చేసుకోరా? మన గడ్డ మీదకు వచ్చి అరసవిల్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటే ఓకే.. విశాఖపట్నం రాజధాని వద్దని ఇక్కడికి వచ్చి మనకు చెబుతారంట. ఎంత అన్యాయం అది. అమాయకులం కాదని మనం రుజువు చేయాలి. ఇప్పటికైనా నోరు విప్పండి’ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్న తీరు ఇలా సాగిపోయింది. జనం నోరు విప్పితే వారి పిల్లోడికి అవసరమైన రాజధాని వస్తది.. మీ అన్నదమ్ములకు కావాల్సిన ఒక సంస్థ వస్తది.. మీ తర్వాతి పిల్లలకు ఉపాధినిచ్చే అభివృద్ధి వస్తది.. దాని కోసం నోరు విప్పలేవా…? అంటూ ఉత్తరాంధ్రప్రజలను మంత్రి ధర్మాన రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఏపీకి ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ‘అమరావతి టూ అరసవిల్లి’ మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర సమీపానికి చేరువౌతున్న తరుణంలో ఆ ప్రాంతంలోని వైసీపీ నేతలు, మంత్రులు స్థానిక ప్రజల్ని రెచ్చగొడుతున్న తీరుకు ధర్మాన ప్రసాదరావు మాటలు అద్దం పడుతున్నాయి. ధర్మాన ప్రసాదరావే కాకుండా మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ,, అవంతి శ్రీనివాస్, గొల్ల బాబూరావు కూడా ఇదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపైకి ఉసిగొల్పుతుండడం గమనార్హం. కరణం ధర్మశ్రీ అయితే.. రాజీనామా అంటూ ఓ చక్కని డ్రామాను రక్తి కట్టించారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తాను రాజీనామా చేశానంటూనే.. ‘టీడీపీ వ్యతిరేకిస్తున్న ఏపీకి మూడు రాజధానులకు మద్దతుగా’ తన రాజీనామా అంటూ ఆ ఏ విధంగా చూసినా స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించని విధంగా జాగ్రత్త పడ్డారు. పైగా రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కు కాకుండా మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఏసీ నేతకు అందించడంలోని ధర్మశ్రీ నిజాయితీపై మీడియా ముఖంగా ప్రశ్నలు వచ్చాయి.
విశాఖ రాజధాని అంటూ గొంతు చించుకుంటున్న ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు, వారి కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి కూడా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే పని చూపడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిస్థితి. దీనినే జనం ఎత్తి చూపుతున్నారు. దశాబ్దాలుగా మంత్రులుగా.. ఎమ్మెల్యేలుగా.. ఇంకా అనేక పదవులు వెలగబెట్టిన వారంతా తమ ప్రాంత అభివృద్ధికి ఏం ఒరగబెట్టారంటూ జనం ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ కుటుంబం రెండు దశాబ్దాలకు పైగాను, ధర్మాన ఫ్యామిలీ మూడు దశాబ్దాలకు పైగా, గుడివాడ అమర్ నాథ్ కుటుంబం ఏకంగా ఏడు దశాబ్దాలుగా , తమ్మినేని సీతారామ్ ఫ్యామిలీ నాలుగు దశాబ్దాలకు పైగా, కోలగట్ల వీరభద్రస్వామి, కరణం ధర్మశ్రీ రెండేసి దశాబ్దాలు, గొల్ల బాబూరావు, అవంతి శ్రీనివాసరావులు పదమూడేసి ఏళ్లు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతలుగా, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ: ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ హయాంలో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, రవాణా, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. జగన్ తొలి కేబినెట్ లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు నిర్వహించారు. 1999లో బొబ్బిలి లోక్ సభా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ కూడా విజయనగరం నుంచి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య తదితరులు రాజకీయంగా ఎదిగారు. అయితేనేం.. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న బొత్స కుటుంబం తమ ప్రాంతానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందేమో చూపించాలని ప్రజలు నిలదీస్తున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి బొత్స కుటుంబం కృషి చేయకపోతే పోయింది.. ఆయన భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో ఏర్పాటు కావాల్సిన ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ పారిపోయేలా చేసిన ఘనుడని, ఆ పరిశ్రమ కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము వృథా చేసిన వైనాన్ని జనం గుర్తుచేస్తున్నారు. తీరా ఫోక్స్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ఎగిరిపోయిన తర్వాత ‘సొమ్ములు పోనాయి.. ఏటిసేత్తాం’ అన్న బొత్స వ్యాఖ్యల్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబం నుంచి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులుగా దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోంది. ఏపీ విభజనకు ముందు ధర్మాన ప్రసాదరావు రోడ్లు, భవనాల శాఖ, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లలో చేనేత, జౌళిశాఖ, క్రీడలు, చిన్న తరహా నీటిపారుదల, మైనర్ పోర్టుల మంత్రిగా వెలగబెట్టారు. ఇప్పుడు జగన్ రెండో కేబినెట్ లో రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా ఉన్నారు. అమరావతి రైతులు అరసవిల్లి పాదయాత్ర ఉత్తరాంధ్ర సమీపంలోకి వస్తున్న తరుణంలో ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొడుతున్న ధర్మాన ప్రసాదరావు అన్ని శాఖల మంత్రిగా ఏం అభివృద్ధి చేశారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నే అంటున్నారు. రెవెన్యూ మంత్రిగా ప్రసాదరావు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాన్ పిక్ భూముల వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ నాంపల్లి ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైన సందర్భాన్ని జనం గుర్తుచేస్తున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్ తొలి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. అంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృష్ణదాస్ చేసిందేమిటో ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. తాము పవర్ లో ఉన్నప్పుడు లేని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడు అమరావతి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా గుర్తుకు రావడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా జగన్ అనుమతిస్తే.. తమ తమ పదవులను విశాఖ రాజధాని సాధన కోసం ఉద్యమిస్తాని, పదవులు త్యాగం చేస్తామని చెప్పడంతో జనం అవాక్కవుతున్నారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్.. 39 ఏళ్లుగా రాజకీయ జీవితం గడుపుతూ ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసింది శూన్యం అంటున్నారు. ఎంతసేపూ అసెంబ్లీలో ఉంటేనే తాను స్పీకర్ ని అని, బయటికి వస్తే తాను వైసీపీ నేతనని, ఎమ్మెల్యేగా నియోజకవర్గం అంతా తిరుగుతానని చెప్పుకునే సీతారామ్ చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పగలరా? అని జనం ప్రశ్నిస్తున్నారు. తొలుత టీడీపీలోనూ, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి చివరికి వైసీపీలో తేలిన తమ్మినేని తన 18వ ఏట నుంచే ప్రజాజీవితంలో ఉన్నారు. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఏపీ మంత్రిగా 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీతారామ్ గతంలో తమ ప్రాంతం ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ కు ఏమి పాటుపడ్డారో అర్థం కాని పరిస్థితి ఉంది.
ఉత్తరాంధ్రలో ప్రస్తుత ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ నుంచి ఇప్పుడు మంత్రి అయ్యేదాకా పలు పదవులను అనుభవించారు అమర్ నాథ్. అమర్ నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. గురునాథరావు తండ్రి అప్పన్న కూడా రాజకీయ నాయకుడే. ఈ కుటుంబానికి రాజకీయాల్లో ఆరు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఇప్పుడు అమరావతి రైతు పాదయాత్రపై ఒంటికాలిపై లేచి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులపై విమర్శలు ఎక్కుపెడుతున్న అమర్ నాథ్ కుటుంబం రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర కోసం ఒరగబెట్టిందేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తాననడం విడ్డూరంగా ఉందంటున్నారు. రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు పోటీ యాత్ర చేస్తామని అమర్ నాథ్ ప్రకటించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గుడివాడ కుటుంబానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే.. విశాఖ రాజధాని కోసం తన పదవికి రాజీనామా చేసినట్లు ఓ హై డ్రామా నడిపారు. ఆయన చేసిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లోనే ఉందని చెబుతూ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా అనే అంశాన్ని తన రాజీనామా లేఖలో రాయడం ఏ ఫార్మాట్ కిందికి వస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ రాజధాని నెపంతో ధర్మశ్రీ ఓ పొలిటికల్ డ్రామా ఆడారని అంతా ముక్కున వేలేసుకున్నారు. తాను ఎమ్మెల్యే అయినా.. జగన్ రెడ్డి నీడలో కిట్టుబాటు ఏమీ కావడం లేదో ఏమో ఎప్పుడో రాసిన టీచర్ ఉద్యోగం రావడంతో దాంట్లో చేరిపోతానని చెప్పడం అందరూ గమనించారు. ఇప్పుడు విశాఖ రాజధాని సాధన సమితికి రాజీనామా లేఖ ఇచ్చి, వార్తల్లోకి ఎక్కాలని చూసిన ధర్మశ్రీ తన పదవీకాలం మొత్తం ఉత్తరాంధ్రకు, కనీసం తన సొంత నియోజకవర్గంలోనైనా ఏమైనా అభివృద్ధి చేశారా? అని అంటున్నారు.
గతంలో టీడీపీ హయాంలో అనకాపల్లి లోక్ సభా స్థానం నుంచి ఎన్నికైన ముత్తంశెట్లి శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర అభివృద్ధి సంగతి పక్కనపెడితే కనీసం అనకాపల్లి నియోజకవర్గానికైనా ఏమైనా సాధించారా? అంటే లేదనే చెబుతున్నారు. పార్లమెంట్ లో వివిధ కమిటీల్లో పనిచేశారు. మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడైనా ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి ఏదైనా మేలు చేశారా అనేది ప్రశ్నార్థకం. విశాఖ రైల్వే జోన్ కోసం ఆయన చేసిన గట్టి కృషి ఏమీ లేదంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవంతి ఏమి కృషి చేశారంటున్నారు. అలాంటి అవంతి ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధాని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పడం ఓ పెద్ద్ జోక్ అంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర రెచ్చగొట్టేలా ఉందని, రోజుకో కార్యక్రమం నిర్వహించి ఉత్తరాంధ్ర ఉనికి చాటాలని ప్రజలను ఉసిగొల్పడాన్ని తప్పుపడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన గొల్ల బాబూరావును ఉత్తరాంధ్రలోని పాయకరావుపేట ఓటర్లు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. గ్రూప్ వన్ అధికారిగా, విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా.. విశాఖ జిల్లా పరిషత్ సీఈఓగా, పంచాయతీరాజ్ అదనపు కమిషనర్గా.. ఇలా అనేక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన బాబూరావు తనను గెలిపించిన పాయకరావుపేట ప్రజలకు ఏమి ఒరగబెట్టారంటే ఏమీ లేదనే చెబుతారు. ఎంతసేపూ తనకు మంత్రి పదవి కోసం పాకులాటే గానీ నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవంటారు. మూడు సార్లు ఎన్నికైన దళిత ఎమ్మెల్యేనని, తనను చిన్నచూపు చేస్తున్నారంటూ వాపోయే గొల్ల బాబూరావు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కానీ, తన నియోజకవర్గం గురించి కానీ పట్టించుకున్న సందర్భం లేదంటారు. అలాంటి గొల్ల బాబూరాబు రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం గమనార్హం.
ఉత్తరాంధ్రలోని విజయనగరంలో పుట్టి, పెరిగిన స్థానిక ఎమ్మెల్యే, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఉత్తరాంధ్ర కోసం చేసిందేంటో కంచు కాగడా పెట్టి వెదికినా ఫలితం కనిపించదంటే అతిశయోక్తి కాదంటున్నారు. కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుంచి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ దాకా వీరభద్రస్వామి పలు పదవులు అనుభవించారు. విజయనగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరును జగన్ రెడ్డి సర్కార్ రాత్రికి రాత్రే మార్చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కోలగట్ల ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏమి చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయిన తర్వాత విజయనగరంలో జరిగిన అభివృద్ది ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదంటారు. అమ్మకు కూడు పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడన్నట్లు విజయనగరం గురించే పట్టించుకోని కోలగట్ల ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకుంటారా అంటే నమ్మకం కలగడం లేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి అని, విశాఖనే కార్యనిర్వాహక రాజధానిగా చేయాలంటూ గొంతు చింపుకుని గోల పెడుతున్నారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తుమని ప్రకటనలు చేసిన ఈ ఉత్తరాంధ్ర నేతలు ఒక్క రోజు గడవక ముందే రాజీనామాలపై సైలెంట్ అయిపోయారు. ఇలాంటి ఆషాఢభూతి నేతలతో ఉత్తరాంధ్రకు మేలు జరగడం అంటే ఎడారిలో ఒయాసిస్సును వెదకడం లాంటిదే అని స్థానిక జనం అంటున్నారు.