మునుగోడు ఫలితంపైనే టీఆర్ఎస్ సిట్టింగ్ ల భవిష్యత్!?
posted on Oct 11, 2022 @ 3:56PM
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఏకంగా యుద్ధ వ్యూహమే రచించేశారు. చతురంగ బలాలను ముగుగోడులో మోహరించేశారు. మునుగోడులో విజయమో, వీరస్వర్గమో అన్నంత లెవెల్ లో ఆయన వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తున్నారు. ఫుట్ బాల్, బ్యాస్కట్ బాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి రెండు వేల మంది ఒటర్లకూ ఓ ఇన్ చార్జ్ ని నియమించడం ద్వారా కేసీఆర్ ఆ క్రీడా స్ట్రాటజీని వాడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఈ ఉప ఎన్నిక విజయాన్ని జీవన్మరణ సమస్యగా పరిగణిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విజయంతోనే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేయాలని ఆయన భావిస్తున్నారు. అంటే మునుగోడు ఉపన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చును.
మునుగోడు ఉప ఎన్నికను తెరాస జాతీయ రాజకీయ ప్రస్థానానికి లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తున్నారు. అందుకే.. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ మునుగోడుకు తోలారు. నియోజక వర్గాన్ని సాధ్యమైనన్ని ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నేతను ఇంచార్జిగా నియమించారు. ఉపఎన్నిక పోలింగ్ వరకు ఇంటి ముఖం చూడకుండా, మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశించారు. తాను కూడా 2500 ఓట్లున్న చిన్న గ్రామానికి ఇంచార్జిగా వెళుతున్నారు. అలాగే ఈ విజయమే తెలంగాణలో టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకునే మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మునుగోడులో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ శ్రేణులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి ఒక చిన్న గ్రామం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా నియమించారు. అలాగే మునిసిపాలిటీలలో ప్రతి రెండు వార్డులకు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా పెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇంత వరకూ ఎమ్మెల్యేలకే పరిమితమైన క్యాంపు రాజకీయాలను ఇప్పుడు కేసీఆర్ ఓటర్ల వరకూ తీసుకువచ్చేశారు.
దాదాపు ప్రతి రెండు వేల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జ్ గా చేసి ఓటర్ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మునుగోడులో తెరాసకు విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించేశారు. వారికి వారికి కేటాయించిన గ్రామాలు, వార్డులలో తెరాసకు పోలైన ఓట్ల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వారికి పార్టీ టికెట్ అన్న కండీషన్ పెట్టారని టీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి.