వెన్నుపోటు వక్ర భాష్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన బాలయ్య అన్ స్టాపబుల్ షో
అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు. అలాగే, నిప్పులాంటి నిజాన్నిగుప్పిట పట్టి దాచలేరు. అందుకే పెద్దలు నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. కానీ, నిజం గడపదాటే లోగా, అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది అదీ నిజమే. అదీ పెద్దలు చెప్పిన మాటే. అయితే, సత్యాన్వేషణ క్సోం జరిగే సంఘర్షణలో అసత్యాన్నే నమ్ముకుని, రాజకీయం చేయాలనుకునే వారు, తాత్కాలికంగా కొంత పైచేయి సాధిస్తే సాధించవచ్చును కానీ, చివరకు సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే. అదే అంతిమ సత్యం.కానీ, ఈలోగా జరగకూడని అనర్ధం జరిగిపోతుంది. నిజం,నిలకడ మీద తెలిసినా మచ్చ మాత్రం అలాగే మిగిలి పోతుంది.
తెలుగు దేశం పార్టీ చరిత్రలో, అలా మిగిలిన మచ్చే, ఆగస్టు సంక్షోభం. నిజం, 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇన్నేళ్ళుగా దుష్ప్రచారం జరుగుతూనే వుంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని,నిలబెట్టే పవిత్ర ఆశయంతో, నందమూరి తారక రామా రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని మొగ్గలోనే తుంచేందుకు, దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాయి. నాదెండ్ల భాస్కర రావు (30 రోజుల ముఖ్యమంత్రి) కుముద్ బెన్ జోషీ (అప్పటి రాష్ట్ర గవర్నర్) ను పావులుగా, ప్రయోగించి తెలుగు దేశం పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను రాజకీయంగా హత్యచేసేందుకు,రాజకీయ దుష్టశక్తులు చేసిన విఫల ప్రయత్నాలు చెరిపేస్తే చెరిగి పోయేవి కాదు. అవే దుష్ట శక్తులు లక్ష్మీ పార్వతి రూపంలో మరో ప్రయత్నం చేశాయి.
ఇది నిజం. నిజమైన చరిత్ర. అయితే, చరిత్రను వక్రీకరించిన, ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తుల దుష్ట పన్నాగాలను, సమర్ధవంతంగా ఎదుర్కుని, పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు చంద్రబాబు చేసిన విరుగుడు యజ్ఞాన్ని ‘వెన్నుపోటు’ గా చిత్రించిన, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఈ రోజుకు కూడా జరుగుతూనే వుంది. అయితే, ఇప్పడు, ఆనాటి సంక్షోభానికి సూత్రదారులుగా, పాత్రదారులుగా అపవాదులు మోస్తున్న, ఎన్టీఅర్ నిజమైన వారసులు, చంద్రబాబు నాయుడు, నందమూరి బాల కృష్ణ నోరు విప్పారు. నిజాన్ని అవిష్కరించారు. ఇదుకు వేదికగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2. సక్సెస్‘ఫుల్’గా సాగిన సీజన వన్, కొనసాగింపుగా మొదలైన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-2, ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తిని పెంచింది.
అందులోనూ, బావా, బావ మరుదుల సంవాదం మధ్యలో బాలయ్యా అల్లుడు, మేనల్లుడు లోకేష్ బాబు ఎంట్రీతో రక్తికట్టించిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆ ఆసక్తిని మరింతగా పెంచింది ఈ ప్రోమో విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7,996 కామెంట్లు లభించాయి. ఈ రియాల్టీ షోలో చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఎలాంటి ముసుగులు లేకుండా అవిష్కరించారు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఎప్పుడూ, ఎన్నడూ బయట పెట్టని కాలేజీ అల్లర్ల మొదలు, వైఎసార్ తో స్నేహం వరకు, అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా తప్పయిందని అంగీకరించడం వరకు చాలా విషయాలను ప్రస్తావించారు. అయితే, ఈ అన్నిటినీ మించి రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిన 1995 ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు మనసు విప్పి మాట్లాడారు..
చంద్రబాబు నాయుడు తమ రాజకీయ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం గురించి, బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించారు. 1995 డెసిషన్. దీనికి ముందు వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాం. అయితే.. దీనికి ముందే.. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఐదుగురు ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు. ఐదుగురం కలిసి ఎన్టీఆర్‌ను కలి శాం. రాజకీయాలపై చర్చించాలని కోరాం. అప్పుడు వచ్చిన వారిలో ఇద్దరిని (హరికృష్ణ, బాలకృష్ణ) బయటకు పంపించాక. 3 గంటలు చర్చించారు.
నేను చాలా సేపు రిక్వెస్ట్ చేశాను. మీటింగ్ పెట్టుకుందామన్నా. చివరకు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్కటంటే ఒక్క మీటింగ్ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి.. ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే. రామాంజనేయ యుద్ధమే జరిగింది. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తి కన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ముందుకువెళ్లాం. అప్పుడు ఆ సమయం లో మీరు (బాలయ్య) కూడా ఉన్నారు. అప్పుడు.. ఆ సమయం లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? బయట నుంచి వచ్చి న వ్యక్తి ప్రభావం ఆయనపై పెరిగింది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాకే.. ఈ ‘నిర్ణయం’ వచ్చింది. ఆ రెండు మూడు నెలలు.. మీరు ఎంత మథనపడ్డారు? ఆయనకు చాలా రకాలుగా చెప్పాం. ఆయనకు నమ్మినబంట్లుగా ఉన్నవారు కూడా చాలా సార్లు చెప్పారు” అంటూ ఆరోజు జరిగిన వాస్తవ చిత్రాన్ని అవిష్కరించారు.
ఆలాగే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు నాయుడు, అడిగిన ప్రశ్నకు బాలయ్య కాదని, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే కాదు, బాలయ్య నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పార్టీ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పౌరుడిగా చెబుతున్నా.1999 ఎన్నికలు అదే నిరూపించాయి. ఇవాల్టికీ ఆయన చరిత్రలో మిగిలారంటే.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆయనకు ఇచ్చిన గౌరవమే కారణం అని స్పష్టం చేశారు. తమిళనాడులో రామస్వామి నాయకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన ఓ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నవారు ఆయనతో విభేదించారు. తర్వాత, ఆయన సిద్ధాంతాలను మాత్రం ముందుకు తీసుకువెళ్లారు. అదే ఎన్టీఆర్ చరిత్ర కూడా!! ఇది.. మీ బిగ్ డెసిషన్ కాదు.. మన కుటుంబాల డెసిషన్. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, అని చెప్పారు.
అయితే, చరితను చరిత్రగా చూడలేని, కొందరు, ముఖ్యంగా తల్లికి చెల్లికి, వెన్నుపోటు పొడిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భజన బృందం ఇప్పటికీ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. అయిత విచిత్రం ఏమంటే, బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు అబద్ధాలలో పీహెచ్డీలు చేసిన వైసేపీ నేతలు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కరరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావును, వారు రాసిన ‘పవిత్ర’ గ్రంధాలను ఉటంకిస్తున్నారు. అయితే, ఇప్పటికే 1999 ఎన్నికలు మొదలు ఇప్పటివరకు నిజం ఏమిటో ప్రజలే నిరూపించారు. మళ్ళీ మళ్ళీ నిరుపిస్తునే ఉంటారు. అందులో సందేహం లేదు.